బురదలో నడుస్తూ.. బాధితుల్లో ధైర్యం నింపుతూ...

తుని:

వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు శ్రీమతి వైయస్ విజయమ్మ బుధవారం తుని పట్టణంలో ముంపునకు గురైన ప్రాంతాల్లో పర్యటించి బాధితులను ఓదార్చారు. ఉదయం తొమ్మిది గంటలకు మొదలైన విజయమ్మ పర్యటన గంటా నలభై నిమిషాలు సాగింది. అమ్మాజీపేట, సీతారాంపురం, కంకిపాటివారిగరువు, రాజీవ్ గృహకల్ప, రెల్లి కాలనీ, కుమ్మరిలోవ కాలనీ ప్రాంతాల్లో పర్యటించారు. దారి పొడవునా బాధితులను ఆప్యాయంగా పలకరిస్తూ ముందుకు సాగారు. వీధుల్లో పేరుకుపోయిన బురదలోనే కాలినడకన విజయమ్మ బాధితుల చెంతకు వెళ్లి పరామర్శించారు. అనంతరం విశాఖ జిల్లా పాయకరావుపేట వెళ్లారు. తొలుత పాయకరావుపేట మెయిన్ రోడ్డులో వైయస్ఆర్ కాంగ్రెస్ వైద్య విభాగం నేతృత్వంలో డాక్టర్ వై.యస్.రాజశేఖరరెడ్డి చిల్డ్రన్, డెంటల్ కేర్ యూనిట్ ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరాన్ని ప్రారంభించారు. చాకలిపేటను సందర్శించారు. సీఎం తుని వచ్చినా పాయకరావుపేట రాలేదని బాధితులు ఆక్షేపించారు. రేషన్ అడిగితే ఎవరికి ఓటేశారో.. వారినే అడగండంటున్నారని విజయమ్మ వద్ద గోడు వెళ్లబోసుకున్నారు. అధికారులతో మాట్లాడి రేషన్ వచ్చేలా చూస్తామని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు వారికి భరోసా ఇచ్చారు. అప్పటికీ ప్రభుత్వం స్పందించకపోతే ప్రత్యక్ష ఆందోళనకు దిగుతామని హెచ్చరించారు. తర్వాత స్థానిక పాండురంగ స్వామి దేవాలయాన్ని విజయమ్మ దర్శించారు. అక్కడినుంచి జాతీయ రహదారి మీదుగా విశాఖ వెళ్లారు. మధ్యలో నక్కపల్లి మండలం గొడిచెర్ల వద్ద పత్తి, వరి పంట రైతులు విజయమ్మకు వారి బాధలు వివరించారు. పార్టీ తరఫున బాధితులకు న్యాయం జరిగేవరకూ పోరాడతామని ఆమె హామీ ఇచ్చారు. రేగుపాలెం, అనకాపల్లి వద్ద కూడా బాధితులను విజయమ్మ పరామర్శించారు. సాయంత్రం విశాఖ చేరుకొని, విమానంలో హైదరాబాద్ వెళ్లారు. విజయమ్మ వెంట పార్టీ నేతలు వై.వి.సుబ్బారెడ్డి, కొణతాల రామకృష్ణ, పిల్లి సుభాష్‌చంద్రబోస్, జ్యోతుల నెహ్రూ, గొల్ల బాబూరావు, వంశీకృష్ణ శ్రీనివాస్, చెంగల వెంకట్రావు, గండి బాబ్జీ, కుంభా రవిబాబు, దాడిశెట్టి రాజా, సర్వేశ్వరరావు తదితరులున్నారు.

Back to Top