బీజేపీ తో చంద్రబాబు మైండ్ గేమ్


() తెలివిగా బీజేపీ ని
ఇరికిస్తున్న చంద్రబాబు

() టీడీపీ క్యాడర్ ను
వాడుకొంటూ ఎత్తుగడలు

() మిత్ర ధర్మాన్ని
పట్టించుకోవటం లేదంటున్న కమలనాథులు

హైదరాబాద్) రాజకీయాల్లో
చౌకబారు ఎత్తుగడలు వేయటంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిది అందెవేసిన చేయి. బీజేపీ
పార్టీని నిర్వీర్యం చేయటానికి ప్రస్తుతం ఆయన అటువంటి ఎత్తుగడలే వేస్తున్నారు.
పైగా బీజేపీని తాను భరిస్తున్నట్లుగా కలరింగ్ ఇస్తున్నారు. బీజేపీ ఎమ్మెల్యేల
అసెంబ్లీ నియోజక వర్గాల్లో జరగుతున్న రాజకీయాన్ని చూస్తే  ఈ సంగతి ఇట్టే అర్థం అవుతుంది.

          ఆంధ్రప్రదేశ్ లో నాలుగు నియోజక వర్గాల్లో బీజేపీ ఎమ్మెల్యేలు
గెలిచారు. ఇందులో ఇద్దరిని మంత్రి వర్గంలో చేర్చుకొన్నారు. ఇందులో మంత్రి కామినేని
శ్రీనివాస్ తాను బీజేపీ నుంచి గెలిచిన విషయం ఎప్పుడో మరిచిపోయారు. పూర్తి స్థాయి
తెలుగుదేశం కార్యకర్తకన్నా ఎక్కువగా ఆయన పనులు చేసి పెడుతుంటారు. ఆఖరికి చంద్రబాబు
దగ్గరకు రాజకీయ మధ్యవర్తిత్వాలు జరపటం దాకా ఆయన టీడీపీ సేవలు విస్తరించాయని
చెబుతున్నారు.

          మరో మంత్రి పైడికొండల మాణిక్యాలరావు మీద మొదటనుంచి చంద్రబాబు
కి కోపం గానే ఉంది. ముఖ్యంగా పుష్కరాల సమయంలో ఆయన్ని పూర్తిగా పక్కన పెట్టేసి సొంత
మంత్రి నారాయణ చేతుల మీదుగా పనులు చేయించుకొన్నారు. అప్పట్లో తనకు పుష్కరాలకు
సంబంధం లేదని ఆయన బహిరంగంగా చెప్పటం సంచలనం కలిగించింది. తాజాగా మంత్రి మాణిక్యాల
రావుకి ఎసరు పెట్టేందుకు టీడీపీ శ్రేణుల నుంచి తనకు ఫిర్యాదు వచ్చేట్లుగా ప్లాన్
చేసుకొన్నారు. అందుకోసమే కేవలం ముగ్గురు మునిసిపల్ కౌన్సిలర్లు టీడీపీలో చేరిక
కార్యక్రమానికి కూడా చంద్రబాబు అక్కడకు హాజరు అయ్యారు. అక్కడ పార్టీ శ్రేణుల నుంచి
బీజేపీ ఎమ్మెల్యే మీద ఫిర్యాదు స్వీకరించారు. దీని ఆధారంగా బీజేపీ ని నిర్వీర్యం
చేసేందుకు కుట్ర పన్నారు. అసలు అక్కడ హవా నడిపిస్తున్నదే టీడీపీ వర్గాలు అని,
మార్కెట్ కమిటీ ఛైర్మన్ పదవి వంటివి కూడా తనకు తెలీకుండా నింపేసుకొంటున్నారని
మాణిక్యాలరావు వాపోయారు.  

అటు రాజమండ్రి అర్బన్ ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ నియోజక వర్గంలో పూర్తిగా రూరల్ టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చ య్య చౌదరి తిష్ట వేశారని తెలుస్తోంది. అటు విశాఖ నగరంలోని బీజేపీ ఫ్లోర్ లీడర్ విష్ణుకుమార్ రాజు నియోజక వర్గంలో కూడా మంత్రి గంటా హవా బాగా నడుస్తోందన్న మాట ఉంది. మొత్తం మీద చంద్రబాబు తన రాజకీయపు ఎత్తుగడలతో బీజేపీ ఎమ్మెల్యేల నియోజక వర్గాల్లో కుంపటి రాజేస్తున్నారని అర్థం అవుతోంది.

Back to Top