ఈ ప్రశ్నలకు బదులివ్వు చంద్రబాబూ


చంద్రబాబు చేసిన అన్యాయాలు, ప్రత్యేక హోదా విషయంలో చేసిన మోసాల మీద వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రజల తరపున ఆరు ప్రశ్నలు అడిగారు. చంద్రబాబుకు చిత్తశుద్ధి ఉంటే.. ఏమాత్రమైనా దమ్మూ, ధైర్యం ఉంటే.. ఈ ప్రశ్నలకు సమాధానం చెబుతారని ఆశిస్తున్నానన్నారు. 

1. ఆ ఏడు నెలలూ ఏం చేశావు బాబూ? 

మార్చి 2, 2014న... మన రాష్ట్రాన్ని విడగొట్టిన తర్వాత అప్పటి కేంద్ర ప్రభుత్వం మనకు ప్రత్యేక హోదా ఇవ్వాలని భావించి, కేంద్ర కేబినేట్‌ తీర్మానం ఆమోదించి, ప్లానింగ్‌ కమిషన్‌కు ఉత్తర్వులు కూడా జారీ చేసింది. ఈయన ముఖ్యమంత్రి అయ్యింది 2014, జూన్‌లో. ఆ తర్వాత డిసెంబర్‌ 2014 వరకూ ... అంటే ఏడు నెలలు ఈఫైల్‌ ప్లానింగ్‌ కమిషన్‌ వద్దే ఉంది. ఈ ఏడు నెలల కాలంలో గాడిదలు కాస్తున్నావా చంద్రబాబూ? సీఎం హోదాలో ఉండి కనీసం అగడను కూడా అడగలేదే? ఇది మోసం కాదా?

2. జైట్లీ ప్యాకేజీ ప్రకటించిన రోజు ఎందుకు పోరాడలేదు? 

సెప్టెంబర్‌ 8, 2016న ప్రత్యేక హోదాకు బదులుగా, ఓ అబద్దపు ప్యాకేజీని అర్ధరాతి కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ ప్రకటించారు. ఈ మధ్య ఇదే అరుణ్‌జైట్లీ మరో ప్రకటన చేశారు. దీంతో చంద్రబాబు తన మంత్రుల చేత రాజీనామా చేయించారు. జైట్లీ మొదటి సారి చేసిన ప్రకటనకు, ఇపుడు చేసిన ప్రకటనకు
ఏమైనా తేడా ఉందా? మొదటి సారి అబద్ధపు ప్యాకేజీ ప్రకటిస్తే ఇదే చంద్రబాబు అర్ధరాత్రి ప్రెస్‌మీట్‌ పెట్టి స్వాగతించారు. మర్నాడు అసెంబ్లీలో జైట్లీకి, కేంద్రానికి ధన్యవాదాల తీర్మానం చేశారు. అంతటితో ఆగలేదు. ఢిల్లీ వెళ్లి జైట్లీకి శాలువాలు కప్పొచ్చారు. ఇదే పెద్దమనిషి ఈశాన్య రాష్ట్రాలు ప్రత్యేక హోదాతో ఏం బాగుపడ్డాయని అసెంబ్లీలోనే వ్యాఖ్యానించారు. కోడలు మగ పిల్లాడిని కంటానంటే అత్త వద్దంటుందా? అని ఈయనే అంటారు. ఇంత దారుణంగా ఆ రోజు ప్రత్యేక హోదాకు తూట్లు పొడిచారు. జైట్లీ ప్యాకేజీ ఇస్తూ తొలిసారి ప్రకటన చేసినప్పుడే తన మంత్రులను ఉప సంహరించుకుని ఉంటే హోదా వచ్చేది కాదా చంద్రబాబూ?

3. నా ఆమరణ దీక్షను ఎందుకు భగ్నం చేశావు? 

ప్రత్యేక హోదా కోసం నాలుగేళ్ళుగా ఏ పోరాటం చేసినా నువ్వు నీరు గార్చలేదా చంద్రబాబూ? హోదా కోసం నేను ఎనిమిది రోజులుగా నిరాహార దీక్ష చేస్తుంటే, నరేంద్ర మోదీ వస్తున్నారని పోలీసులను పంపించి, తెల్లవారు జామున నా టెంట్‌ ఎత్తేయించింది నువ్వు కాదా? ప్రతిపక్ష నేత దీక్ష చేస్తున్నాడని నన్ను చూపించి మోదీని డిమాండ్‌ చేయాల్సింది పోయి ఇలాంటి పని చేస్తావా? గల్లీ నుంచి ఢిల్లీ దాకా మా పార్టీ ధర్నాలు, దీక్షలు, బంద్‌లు చేస్తే నువ్వు దగ్గరుండి చేసిందేమిటి? దగ్గరుండి పోలీసులను పెట్టి బస్సులు తిప్పిన చరిత్ర చంద్రబాబుది కాదా? ప్రత్యేక హోదా రాకపోతే కలిగే నష్టంపై విద్యార్థులకు అవగాహన కల్గించేందుకు యువ భేరీలు నిర్వహిస్తే పిల్లలపై పీడీ యాక్ట్‌ పెడతానని బెదిరించిన చరిత్ర చంద్రబాబుది కాదా? ఇవన్నీ అన్యాయాలు, మోసాలు కావా? 

4. మేం పార్టీల మద్దతు కూడగట్టే వరకు అవిశ్వాసం గురించి ఆలోచించావా? 

అసలు మొన్న వైయస్‌ఆర్‌ సీపీ అవిశ్వాస తీర్మానం పెట్టి ఉండకపోతే నువ్వు అవిశ్వాస తీర్మానం పెట్టి ఉండేవాడివా చంద్రబాబూ? సంఖ్యాబలం ఉంటేనే అవిశ్వాసానికి మద్దతునిస్తానని మార్చి 15వ తేదీన చంద్రబాబు చెప్పారు. మర్నాడే యూటర్న్‌ తీసుకున్నారు. కారణమేంటో తెలుసా? నేను రాసిన లేఖను తీసుకుని మన పార్టీ ఎంపీలు ప్రతీ పార్టీని కలిసి, అవిశ్వాస తీర్మానానికి మద్దతు తెలపమని కోరారు. వాళ్ళంతా ఒప్పుకున్నట్టు మర్నాడు జాతీయ మీడియాలో వచ్చిందని... వాళ్ళు ఎలాగూ మద్దతు తెలుపుతున్నారని చంద్రబాబు ప్లేట్‌ మార్చారు. తాను అవిశ్వాసం పెట్టాడు కాబట్టి మిగతా పార్టీలు మద్దతునిస్తున్నాయని సిగ్గులేకుండా అన్నాడు. ఇలాంటి మనిషి ఈ ప్రపంచంలో ఎవరైనా ఉంటారా? మార్చి 15న సంఖ్యాబలం ఉంటేనే మద్దతునిస్తానన్నాడు. అంటే దానర్థం అప్పటికి ఆయన ఏ పార్టీతోనూ మాట్లాడలేదనేగా. మార్చి 16 వరకూ తాను అవిశ్వాసం పెట్టబోతున్నట్టు ఆయనకే
తెలియదు. ఇలా సిగ్గులేకుండా రాజకీయాలు చేస్తుంటే ఇది మోసం కాదా చంద్రబాబూ?

5. ఉద్యమించకుండా హోదా ఎలా సాధిస్తావు? 

చంద్రబాబు మొన్న అఖిల పక్షాన్ని పిలిచారు. మరో డ్రామాను రక్తికట్టించారు. అదెలా ఉందో తెలుసా? ఒక గజదొంగ దొంగతనాల నివారణకు సలహాలు ఇవ్వమని మీటింగ్‌ పెట్టినట్టుగా ఉంది ఆయన అఖిలపక్షం సమావేశానికి పిలవడం. అఖిలపక్షాన్ని పిలిచిన చంద్రబాబు వెల్లడించిన కార్యాచరణ ఏంటో తెలుసా? ఎవరూ నిరసనలు తెలుపకూడదట. ఆందోళనలు చేయ్యకూడదట. విద్యార్థులు ఉద్యమంలోకి రానే రాకూడదట. ఉద్యమం పెద్దదయితే రాష్ట్రానికి చెడ్డపేరు వస్తుందట. కేవలం నల్లబ్యాడ్జీలు పెట్టుకుని ఆఫీసులకు వెళ్లాలట. ఢిల్లీ వాళ్ళు కదులుతారట. ఇలా చేస్తే ప్రత్యేక హోదా వస్తుందా? ఇది మోసం కాదా చంద్రబాబూ? 

6. ఏపీ ఎంపీలంతా ఏకతాటిపై నిలబడితే కేంద్రం దిగిరాదా? 

ప్రత్యేక హోదా ఇవ్వకపోతే పార్లమెంట్‌ చివరి రోజున వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎంపీలంతా రాజీనామా చేస్తామని ఇప్పటికే ప్రకటించాం. టీడీపీతో సహా 25 మంది ఎంపీలు ఒక్క తాటిపై నిలబడి రాజీనామా చేస్తే కేంద్రం దిగిరాదా చంద్రబాబూ? అయినా ఆయన ఎంపీలతోటి రాజీనామాలు చేయించరట. కారణం ఏంటో తెలుసా? చంద్రబాబుకు భయం.. ఆయన చేసిన అవినీతిపై కేసులు పెడతారని, అరెస్టు చేస్తారనే భయం. కేసులు పెట్టి, అరెస్టు చేస్తే ఆయన తరపున మాట్లాడేందుకు పార్లమెంట్‌లో  ఎంపీలు కావాలట. ఇదంతా ఆయన ఊహించుకుని సిగ్గులేకుండా ఎంపీలు రాజీనామాలు చేయొద్దని ప్రత్యేక హోదాను తాకట్టు పెడుతుంటే... అసలు ఇతను మనిషేనా అనిపిస్తోంది?   

Back to Top