ఎపిలో ఉద్యోగాలు లేవంటున్న చంద్రబాబు

 


అవునండీ చంద్రబాబే...ఈమాట అంటున్నారు. స్కిల్స్ డెవలప్ చేసుకుని ఎక్కడ ఉద్యోగం వస్తే అక్కడకు వెళ్లండని యువతకు సూచనలిస్తున్నారు. యువనేస్తం కార్యక్రమంలో నిరుద్యోగలతో ముఖాముఖీ మాట్లాడిన చంద్రబాబు రాష్ట్రంలో ఉద్యోగ కల్పన లేదన్న విషయాన్ని స్పష్టంగా బైటపెట్టారు. 
ఎక్కడ దొరికితే అక్కడికే...
చంద్రబాబు గారు దేశ దేశాలూ తిరుగుతున్నప్పుడు ఏ ఎయిర్పోర్ట్ లో చూసినా తెలుగువాళ్లే కనబడుతున్నార్ట. దీనిబట్టి ఆయనకర్థం అయ్యిందేంటయ్యా అంటే తెలుగు వారు అన్ని చోట్లా ఉద్యోగాలు చేస్తున్నారు. కనుక మీరు ఎపిలోనే ఉద్యోగాలు కావాలని గొడవ చేయకుండా ఎక్కడ అవకాశం వస్తే అక్కడకు వెళ్లిపోండి అని శెలవిస్తున్నారు ముఖ్యమంత్రి గారు. ప్లేస్ మెంట్ ఏజెన్సీలను తెస్తాను వారెక్కడ జాబ్ ఇస్తే అక్కడకెళ్లి చేసుకోండి అని చెబుతున్నారు. ఎపిలోనే ఉద్యోగాలు కావాలంటే ఎట్లా? అన్నది బాబుగారి భావన. మరి అలా అయితే కోట్ల పెట్టుబడులు పెట్టిన సంస్థలను తెచ్చాం, లక్షల ఉద్యోగాలిచ్చాం అంటూ బాబుగారు డప్పు కొట్టేదంతా అబద్ధమేనా? 
నిరుద్యోగులపై అవమానకరమైన కామెంట్లు
డిగ్రీలు, పీజీలు చేయడం కాదు స్కిల్స్ కూడా నేర్చుకోవాలి. స్కిల్స్ నేర్చుకోకపోతే దేవుడు కూడా మిమ్మల్ని కాపాడలేడు అంటూ అక్కడికొచ్చిన యువతపై కామెంట్లు చేసారు బాబుగారు. కమ్యూనికేషన్ స్కిల్స్, అప్ గ్రేడింగ్ నాలెడ్జ్, టెక్నాలజీ ఉపయోగించడం వంటి వన్నీ చేయాలంటే పేదింటి నిరుద్యోగులకు సాధ్యమయ్యేపనేనా? ఉన్నత చదువులు చదవడమే వారికి పెద్ద కల. ఫీజ్ రీయంబర్స్ మెంట్ లాంటి పథకాలకు తూట్లు పడి వారి గొప్ప చదువుల కలలు నిర్వీర్యం అయిపోతున్నాయి. ఏదోలా కష్టపడి, అప్పో సొప్పో చేసి కొంత వరకూ చదివించిన తల్లితండ్రులకు ఆసరాగా ఉండాలంటే ఉద్యోగాలు లేక, ఉపాధి దొరక్క అగచాట్లు పడుతున్నారు నిరుద్యోగులు. నాలుగేళ్లుగా నిరుద్యోగులకు 2000 భృతి అని చెప్పి చివరకు కొద్దిమందికి మాత్రం 1000 రూపాయిలే ఇస్తామన్న చంద్రబాబు నేడు వారి చదువులు, స్కిల్స్ గురించి పరిహాసంగా మాట్లాడటం విడ్డూరం. కమ్యూనికేషన్ స్కిల్స్, కంప్యూటర్ కోర్సులు, మేనేజ్మెంట్ కోర్సులు నేర్చుకోగల స్థోమతే ఉంటే వారు నిరుద్యోగ భృతి కోసం ఎదురు చూడాల్సిన పరిస్థితే ఉండదు కదా! అందరూ ఫైట్లలో ప్రయాణం చేయగల ఉద్యోగాలు చేయగలరా? అందరూ ఉన్న రాష్ట్రాన్ని వదులుకుని వెళ్లిపోయి ఉపాధి చూసుకోగలరా? బాబుగారికి ఆ మాత్రం కామెన్ సెన్స్ కూడా లేకపోయింది. స్కిల్ డెవలప్ మెంట్ అంటూ చంద్రబాబు గారు ఇప్పించిన నాలెడ్జ్ ఏమిటయ్యా అంటే సబ్బుల తయారీ, షాంపూల తయారీ, ఫినాయిల్ మేకింగ్, మార్కెటింగ్ నైపుణ్యాలు. చాలా చోట్ల ఇలాంటి అంశాలనే నేర్పుతున్నారంటూ వాపోతున్నారు నిరుద్యోగులు. 
ఎక్కడ ఉద్యోగం వస్తే అక్కడ చేయండి.
ఆంధ్రప్రదేశ్ లోనే ఉద్యోగం చేయాలని ఆలోచించకండి. మీకు తెలివుంటే బెంగుళూరులో, ముంబై లో, లండన్ లో ఉద్యోగాలు చేయొచ్చు అని సలహా ఇచ్చారు చంద్రబాబు. అంటే ఎవరి తెలివితో వారే ఎక్కడో అక్కడ ఉద్యోగాలు సంపాదించుకోవచ్చు అనేట్టైతే లక్షలాది ఉద్యోగాలను రాష్ట్రానికి కల్పిస్తామంటూ బాబుగారు వాగ్దానాలు ఎందుకు చేసినట్టు. ఎవరి తెలివికి తగ్గ ఉద్యోగం వారు ప్రైవేటు రంగంలోనో, ప్రభుత్వ సంస్థల్లోనో సంపాదించుకుంటారు. దేశంలో ఎక్కడైనా, దేశాలు దాటైనా వెళ్లి ఉద్యోగాలు చేసుకుంటారు. కానీ 2014 ఎన్నికల ముందు చంద్రబాబు ఇంటికో ఉద్యోగం అంటూ హామీ ఇచ్చాడు. రాష్ట్రంలో పరిశ్రమలు, కంపెనీలు, ఐటి, ప్రభుత్వ రంగాలు లక్షల ఉద్యోగాలు మీకు కల్పిస్తాయంటూ నిరుద్యోగులను మభ్య పెట్టాడు. ఇప్పుడొచ్చి ప్లేస్ మెంట్ సంస్థలను తెస్తాను...ఎక్కడ ఉద్యోగం వస్తే అక్కడ కెళ్లి చేసుకోండి అంటూ ఉచిత సలహాలిస్తున్నారు.
రాష్ట్ర దుస్థితి
ప్రత్య్రేక హోదా రాలేదు. దానివల్ల పరిశ్రమలూ లేవు. కార్పొరేట్ సంస్థలూ లేవు. ఉద్యోగాలూ లేవు. వాటిపేరు మీద రాష్ట్రంలోనే భూములు కారుచౌకగా కొందరికి సొంతం అవుతున్నాయి. ఈ విషయాన్నే ఇటీవల కాగ్ కూడా స్పష్టం చేసింది. అసలు రాష్ట్రంలో ఎంప్లాయిమెంట్ పరిస్థితి దయనీయంగా ఉంది. ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ లేదు, ప్రైవేటు ఉద్యోగాలకు అవకాశం లేదు. ఇదీ రాష్ట్రంలో నిరుద్యోగుల దుస్థితి. చేస్తానన్నవి చేయక, ఇచ్చిన హామీలు నెరవేర్చక నేడు నిరుద్యోగులను చులకనగా మాట్లాడుతున్న చంద్రబాబుకు ఆ నిరుద్యోగులే 2019 ఎన్నికల్లో సమాధానం చెబుతారు. 



 
 


Back to Top