దివంగత మంత్రికి అసెంబ్లీ ఘన నివాళి  

కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపిన సభ 

స్వ‌యంగా సంతాప తీర్మానాన్ని ప్ర‌వేశ‌పెట్టిన సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌

సంతాప తీర్మానంపై మాట్లాడిన పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు  

ఆయనతో తమకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్న సభ్యులు 

 అమ‌రావ‌తి: దివంగత రాష్ట్ర మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డికి శాసనసభ ఘన నివాళులు అర్పించింది. గౌతమ్‌రెడ్డి మృతి పట్ల సభ తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేసింది. శోకతప్తులైన వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపింది. మంగళవారం సభలో సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి స్వయంగా సంతాప తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా స్పీకర్, పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు గౌతమ్‌రెడ్డితో ఉన్న సాన్నిహిత్యాన్ని గుర్తు చేసుకున్నారు. ఆయన చేసిన సేవలను స్మరించుకుంటూ భావోద్వేగానికి గురయ్యారు. సంతాప సూచకంగా సభలో రెండు నిమిషాలు మౌనం పాటించారు. గౌతమ్‌రెడ్డి లేకపోవడం శాసనసభకు లోటని స్పీకర్‌ తమ్మినేని సీతారాం ఆవేదన వ్యక్తం చేశారు. సంతాప తీర్మానాన్ని చదివి వినిపించారు.     
 
 నా స్నేహితుడి కుటుంబానికి అన్ని రకాలుగా అండగా ఉంటాం:  సీఎం వైయ‌స్ జ‌గ‌న్ 

 దివంగత మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డిని చిరస్థాయిగా గుర్తుంచుకునేలా నెల్లూరు జిల్లా సంగం బ్యారేజీకి ఆయన పేరు పెడతామని సీఎం వైఎస్‌ జగన్‌ ప్రకటించారు. మరో ఆరు వారాల్లో సంగం బ్యారేజీ పనులు పూర్తవుతాయని, యుద్ధ ప్రాతిపదికన మంత్రి అనిల్‌ పర్యవేక్షిస్తున్నారని తెలిపారు. ప్రాజెక్టు పూర్తి చేసి మేకపాటి గౌతమ్‌ సంగం బ్యారేజీ అని పేరు పెట్టి ప్రారంభిస్తామన్నారు. మేకపాటి గౌతమ్‌రెడ్డి సంతాప తీర్మానాన్ని మంగళవారం శాసనసభలో స్వయంగా ప్రవేశపెట్టిన ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌ తమ చిరకాల అనుబంధాన్ని, మంత్రివర్గ సహచరుడి మంచి పనులను గుర్తు చేసుకున్నారు.

మూడు కోరికలను నెరవేరుస్తాం..
గౌతమ్‌రెడ్డి తండ్రి మేకపాటి రాజమోహన్‌రెడ్డి కోరిన వాటిని నెరవేరుస్తామని సీఎం వైయ‌స్ జగన్‌ చెప్పారు. ఉదయగిరిలోని మేకపాటి రాజమోహన్‌రెడ్డి ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ అండ్‌ సైన్స్‌ (మెరిట్స్‌) కళాశాలకు గౌతమ్‌ పేరు పెట్టి అగ్రికల్చర్, హార్టికల్చర్‌కు అనువైన బోధనా కాలేజీగా ఏర్పాటు చేయాలని కోరారని తెలిపారు. ఆ కాలేజీని ప్రభుత్వం తీసుకుని ఆయన ఆశించినట్లుగానే గౌతమ్‌ పేరుతో అగ్రికల్చర్, హార్టికల్చర్‌ కోర్సులను ప్రవేశపెట్టి ఉత్తమ కాలేజీగా తీర్చిదిద్దుతామన్నారు. 

ఉదయగిరికి తొలిదశలోనే నీరు
వెలిగొండ ప్రాజెక్టు పరిధిలో ఉదయగిరి ప్రాంతాన్ని రెండో దశలో కాకుండా మొదటి దశలోకి తెచ్చి పనులు వేగంగా పూర్తి చేసి ఉదయగిరి ప్రాంతానికి నీళ్లివ్వాలని రాజమోహన్‌రెడ్డి చాలా భావోద్వేగంగా అడిగారని, అది కూడా కచ్చితంగా నెరవేరుస్తామని సీఎం వైయ‌స్ జగన్‌ ప్రకటించారు. ఉదయగిరి ప్రాంతాన్ని వెలిగొండ మొదటి దశలోకి తీసుకువచ్చి ప్రాజెక్టు పనులను యుద్ధ ప్రాతిపదికన చేపడతామన్నారు. ఉదయగిరి డిగ్రీ కాలేజీలో వసతులు మెరుగుపరచాలని కోరారని, నాడు–నేడు రెండో దశలో ఆ కళాశాలకు మెరుగులు దిద్దుతామన్నారు. రాజమోహన్‌రెడ్డి కోరిన మూడు అంశాలను కచ్చితంగా చేస్తామని ఈ సభ ద్వారా భరోసా ఇస్తున్నట్లు చెప్పారు.

ఆ ఊహే కష్టంగా ఉంది
తన సహచరుడు, చిరకాల మిత్రుడు, మేకపాటి గౌతమ్‌రెడ్డి ఇకలేడన్న ఊహే ఎంతో కష్టంగా ఉందని, ఇది రాష్ట్రానికి కూడా తీరని లోటు అని సీఎం పేర్కొన్నారు. గౌతమ్‌ తనకు చిన్నతనం నుంచి స్నేహితుడని, తన కంటే వయసులో ఒక సంవత్సరం పెద్దవాడైనా తనను అన్నగా భావించేవాడని గుర్తు చేసుకున్నారు. తనను అంత విశ్వసించి, తనపై అంత నమ్మకముంచేవాడన్నారు. తనకేం కావాలి...? తనకేం నచ్చుతుందోనని తపించేవాడని చెప్పారు. అలాంటి ఒక మంచి స్నేహితుడిని, ఎమ్మెల్యేని పోగొట్టుకున్నానని, గౌతమ్‌ ఇక లేడనే వాస్తవాన్ని జీర్ణించుకోలేకపోతున్నానన్నారు. గౌతమ్‌ ఉన్నత చదువులు చదివాడని, యూకేలోని మాంచెస్టర్‌ యూనివర్సిటీలో చదువులు పూర్తి చేసి ఇక్కడకి వచ్చాడని తెలిపారు.

కాంగ్రెస్‌ను వీడాక నా వెంటే నిలిచారు..
నాడు కాంగ్రెస్‌ పార్టీ నుంచి తాను తొలుత బయటకు అడుగులు వేసినప్పుడు గౌతమ్‌ రాజకీయాల్లో లేడని, ఆయన తండ్రి రాజమోహన్‌రెడ్డి అప్పట్లో కాంగ్రెస్‌ ఎంపీగా ఉన్నారని సీఎం జగన్‌ చెప్పారు. తాను ఈ స్థానానికి వస్తానని ఆ రోజుల్లో బహుశా ఎవరూ ఊహించి ఉండకపోవచ్చన్నారు. కాంగ్రెస్‌తో విభేదించి ఆ పార్టీ నుంచి బయటకి వచ్చినప్పుడు అతి తక్కువ మంది తనతోపాటు ఉండటానికి సాహసించారని తెలిపారు. అలాంటి కొద్ది మంది వ్యక్తులలో గౌతమ్‌ ఒకరని గుర్తు చేసుకున్నారు. గౌతమ్‌ ప్రభావం ఆయన తండ్రిపై ఉందన్నారు. రాజమోహన్‌రెడ్డి తనతో నిలబడటానికి గౌతమ్‌తో తనకున్న స్నేహం, విశ్వాసం, తాను చేయగలననే నమ్మకం ప్రధాన కారణాలన్నారు.మేకపాటి కుటుంబమంతా తన వెంట నడిచిందని, అలాంటి స్నేహితుడ్ని కోల్పోవడం ఎంతో బాధాకరమన్నారు.

పట్టుబట్టి పెట్టుబడులు..
వరుసగా రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన గౌతమ్‌రెడ్డి కేబినెట్‌లో ఆరు శాఖలకు ప్రాతినిధ్యం వహించి సమర్థంగా పనిచేశారని సీఎం జగన్‌ కొనియాడారు. దుబాయ్‌ ఎక్స్‌పోకు వెళ్లేముందు కూడా తనను కలిశారని చెప్పారు. రాష్ట్రానికి పరిశ్రమలు, పెట్టుబడులు రప్పించేందుకు తీసుకుంటున్న చర్యలు, తాను కలుసుకున్న పారిశ్రామికవేత్తల వివరాలను తనకు తెలియచేయాలని కోరుతూ రోజూ ముఖ్యమంత్రి కార్యాలయానికి వివరాలు పంపేవారని తెలిపారు. పరిశ్రమలపరంగా రాష్ట్రాన్ని ముందెన్నడూ లేని విధంగా ముందుకు తీసుకెళ్లారని చెప్పారు. 

గౌతమ్‌ కృషితో పారిశ్రామిక దిగ్గజాల రాక
గతంలో ఎన్నడూ లేనివిధంగా పారిశ్రామిక దిగ్గజాలు ఆంధ్రప్రదేశ్‌పై దృష్టి సారించడం వెనుక మంత్రి గౌతమ్‌రెడ్డి కృషి ఎంతో ఉందని సీఎం జగన్‌ తెలిపారు. సెంచురీ ఫ్లైవుడ్‌ కడప జిల్లా బద్వేలులో రావడంతోపాటు బంగర్‌లు.. శ్రీ సిమెంట్స్‌ ఫ్యాక్టరీ పెట్టడానికి అడుగులు ముందుకు వేశారని చెప్పారు. బజాంకాలు, బంగర్‌లు, సన్‌ఫార్మా దిలీప్‌ సంఘ్వీ, ఆదిత్య బిర్లా తమ హయాంలోనే రాష్ట్రంలో అడుగుపెడుతున్నారన్నారు. అదానీలు కూడా తమ హయాంలోనే రాష్ట్రానికి వస్తున్నారని చెప్పారు. వారి పేర్లను గతంలో పత్రికల్లో చదవడమే మినహా మన రాష్ట్రంలో పరిశ్రమలు పెట్టడానికి ముందుకు రాలేదన్నారు.

వారందరికీ భరోసా కల్పించి రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేలా ఒప్పించడంలో గౌతమ్‌రెడ్డి ఎంతో కృషి చేశారన్నారు. గౌతమ్‌ భౌతికంగా మన మధ్య లేకున్నా తన కలలు, తన ప్రాంతానికి మంచి జరగాలన్న కోరికను కచ్చితంగా నెరవేరుస్తామన్నారు. పైలోకంలో ఉన్న గౌతమ్‌ను దేవుడు చల్లగా చూస్తాడని, ఆయన కుటుంబ సభ్యులకు దేవుడి ఆశీస్సులు ఉండాలని మనసారా కోరుకుంటున్నట్లు చెప్పారు. మేకపాటి కుటుంబానికి తామంతా ఎప్పుడూ అండగా, తోడుగా ఉంటామని భరోసా ఇచ్చారు.  

గౌతమ్‌లో నిజంగా బుద్ధుని లక్షణాలు:  స్పీకర్‌ తమ్మినేని సీతారాం
గౌతమ్‌రెడ్డిలో నిజంగా గౌతమ బుద్ధుడి లక్షణాలు ఉన్నాయి. గొప్ప సంస్కారవంతుడు, మంచి విజ్ఞానం ఉన్న వ్యక్తి. ఇన్నేళ్లలో ఆయన ఎవరినీ నొప్పించడం చూడలేదు. ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలి అనే దానికి ఆయన నిలువెత్తు నిదర్శనం. ఇన్ని మంచి లక్షణాలున్న గౌతమ్‌రెడ్డి చనిపోయారంటే నమ్మలేకపోతున్నాం. ఆయన సీటు వైపు చూసినప్పుడు బాధ కలుగుతోంది. నిండైన విగ్రహం లేకపోవడం సభకు చాలా వెలితిగా ఉంది. పుత్ర వియోగం ఆ తల్లిదండ్రులకు ఎంతో బాధాకరం. శ్రీకాకుళం జిల్లాలో టెక్స్‌టైల్స్, హ్యాండ్‌లూమ్స్‌ మెగా క్లస్టర్‌ గురించి ఆయన్ను అడిగితే ప్రతిపాదనను కేంద్రానికి పంపి ఒకసారి ఇద్దరం కలిసి ఢిల్లీ వెళదామన్నారు. ఈరోజు ఆ మనిషి లేరు. ఆయన ఆదర్శ జీవనం, హుందాతనం సభకు రోల్‌ మోడల్‌. ఆయన ఆలోచనల్ని ఆచరించడమే ఆయనకు నిజమైన నివాళి.      
     
ఎంతో సఖ్యతగా ఉండేవారు: మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి
గౌతమ్‌రెడ్డి చిత్తూరు జిల్లా ఇన్‌చార్జి మంత్రిగా కూడా వ్యవహరించేవారు. అందరితో ఎంతో సఖ్యతగా ఉండేవారు. జిల్లా ఎమ్మెల్యేలను, ఇతర ప్రజాప్రతినిధులను సంప్రదించకుండా ఏ ఒక్క నిర్ణయం తీసుకోలేదు. రాజకీయాల్లో ఇలాంటి వ్యక్తులు చాలా అరుదుగా ఉంటారు. అంత గొప్ప లక్షణాలున్న వ్యక్తి చిన్న వయసులోనే మనల్ని వీడిపోవడం దురదృష్టకరం.      
 
ఏనాడూ దర్పం చూపలేదు:   మంత్రి అనిల్‌కుమార్‌ యాదవ్ 
సభలో నా పక్కనే గౌతమ్‌రెడ్డి కూర్చునేవారు. ఆయన ఇవాళ లేకపోవడం ఎంతో బాధ కలిగిస్తోంది. ఒకే జిల్లాకు చెందిన వాళ్లం కావడంతో ఆయనతో ఎక్కువ సాన్నిహిత్యం ఉండేది. ఒక జిల్లాకు చెందిన మంత్రులమైనా కూడా మా మధ్య భేదాభిప్రాయాలు, రాజకీయ విబేధాలు ఏ రోజూ చోటు చేసుకోలేదు. సుధీర్ఘ రాజకీయ ప్రస్థానమున్న, సంపన్నమైన కుటుంబం నుంచి వచ్చానన్న దర్పం ఆయనలో ఏ కోశానా కనబడేదికాదు. దేవుడు మంచి వాళ్లను త్వరగా తీసుకుపోతారంటారు. అందుకే ఆయన ఈ లోకాన్ని వీడారేమో.
 
పీడ కలలా ఉంది :   మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి 
గౌతమ్‌రెడ్డి లేరు అన్న విషయాన్ని పీడ కలలాగా భావిస్తున్నాను. మేకపాటి కుటుంబంతో 35 ఏళ్ల అనుబంధం నాకు ఉంది. నేను నెల్లూరు జిల్లా ఇన్‌చార్జి మంత్రిగా కూడా ఉండటంతో ప్రతి రెండు, మూడు రోజులకు ఓసారి గౌతమ్‌ ఫోన్‌ చేసి మాట్లాడేవారు. గౌతమ్‌ రెడ్డి మరణ వార్త విని వాళ్ల ఇంటికి వెళ్లగానే.. నన్ను చూసి ‘నా బంగారం లాంటి కొడుకు లేడయ్యా’ అంటూ ఆయన తల్లి రోదించిన ఘటన ఇప్పటికీ మర్చిపోలేకపోతున్నాను. తుపాను సమయంలో ఆత్మకూరు నియోజకవర్గంలో పర్యటిస్తున్నపుడు సోమశిల వద్ద వరదల్లో దెబ్బతిన్న దేవాలయాన్ని పునఃనిర్మించాలని గౌతమ్‌ నాతో అన్నారు. ఈ విషయాన్ని సీఎం దృష్టికి తీసుకుని వెళ్లాను. దేవాలయం నిర్మాణానికి చర్యలు తీసుకుని ఆయన ఆశయాన్ని నెరవేరుస్తాం.
     

ప్రత్యేక ముద్ర వేశారు :  మంత్రి ఆదిమూలపు సురేశ్ 
గౌతమ్‌రెడ్డితో నాకు వ్యక్తిగతంగా ఎంతో అనుబంధం ఉంది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అధినేత కొన్ని పనులు మాకు అప్పజెప్పినప్పుడు ఇద్దరం కలిసి గంటలు, రోజులు చొప్పున కసరత్తు చేశాం. సీఎం జగన్‌ మొదటి డ్రీమ్‌ కేబినెట్‌లో మంత్రిగా ఆయన తనదైన ప్రత్యేక ముద్ర వేశారు. రాజకీయాల్లో ఎంతో ఉజ్వల భవిష్యత్తు ఉన్న వ్యక్తి అనతి కాలంలో మరణించడం బాధాకరం.    
 
పారిశ్రామిక కృషీవలుడు 
మండలిలో సంతాప తీర్మానాన్ని ప్రవేశపెట్టిన మంత్రి బుగ్గన 

 

 అమరావతి: దివంగత మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి రాష్ట్ర పారిశ్రామిక ప్రగతికి బాటలు వేసిన గొప్ప నాయకుడని, తుది శ్వాస వరకు పరిశ్రమలను రప్పించేందుకు కృషి చేశారని ఆర్థిక శాఖమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ పేర్కొన్నారు. వివాదరహితుడు, అజాత శత్రువు, మర్యాదస్తుడైన గౌతమ్‌రెడ్డి మరణం రాష్ట్రానికి తీరని లోటన్నారు. ప్రతి సమస్యపై క్షుణ్ణంగా అవగాహన చేసుకున్న తర్వాతే మాట్లాడేవారని, ఏ ఒక్కర్నీ ఆయన విమర్శించిన దాఖలాలు లేవన్నారు. గౌతమ్‌రెడ్డి మృతికి సంతాపంగా మంగళవారం శాసన మండలిలో మంత్రి బుగ్గన తీర్మానాన్ని ప్రవేశపెట్టగా చైర్మన్‌తో సహా పలువురు సభ్యులు ఆయనతో తమ అనుబంధాన్ని గుర్తు చేసుకుని కంటతడి పెట్టారు. మేకపాటి కుటుంబం అభ్యర్థన మేరకు ఆత్మకూరు నియోజకవర్గంలోని విద్యా సంస్థలను వ్యవసాయ విశ్వవిద్యాలయంగా తీర్చిదిద్ది గౌతమ్‌రెడ్డి పేరుపెట్టాలని సభ్యులు కోరారు. 

ఆయనకు కోపం తెలియదు: మండలి చైర్మన్‌
గౌతమ్‌రెడ్డితో తనకు వ్యక్తిగత అనుబంధం ఉందని, ఆయన ఉన్నత విలువలు కలిగిన గొప్ప వ్యక్తి అని మండలి చైర్మన్‌ కొయ్యే మోషేన్‌రాజు చెప్పారు. గౌతమ్‌రెడ్డిలో ఏనాడూ చిరునవ్వు మినహా కోపం చూడలేదని, ఎవరినీ నొప్పించేవారు కాదని గుర్తు చేసుకున్నారు. విశాఖ స్టీల్‌ప్లాంట్‌ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా తీర్మానాన్ని ప్రవేశపెట్టి అసెంబ్లీ ఆమోదించేలా చొరవ చూపారన్నారు. పెట్టుబడులకు బ్రాండ్‌ అంబాసిడర్‌ లాంటి వ్యక్తి అని కొనియాడారు. గౌతమ్‌రెడ్డి ఉభయసభల్లో ఎంతో మర్యాదస్తుడని, ప్రతీ ఒక్కర్ని ఆప్యాయంగా పలకరించేవారని డిప్యూటీ చైర్‌పర్సన్‌ జకియాఖానం పేర్కొన్నారు. యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించాలన్న సీఎం జగన్‌ తపన దివంగత గౌతమ్‌రెడ్డిలో నిత్యం కనిపించేదని ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు చెప్పారు. పరిపూర్ణమైన వ్యక్తిత్వం కలిగిన వ్యక్తికి దేవుడు పరిపూర్ణమైన జీవితాన్నివ్వకపోవడం బాధాకరమని ఎమ్మెల్సీ సి.రామచంద్రయ్య ఆవేదన వ్యక్తం చేశారు.

కన్నీటిపర్యంతమైన ఎమ్మెల్సీ చక్రవర్తి
తన ఎదుగుదలకు గౌతమ్‌రెడ్డి ఎంతో తోడ్పాటు అందించారని గుర్తు చేసుకుని ఎమ్మెల్సీ బల్లి చక్రవర్తి కన్నీటి పర్యంతమయ్యారు. స్నేహశీలి, వినయశీలి, మృదుస్వభావం లాంటి గొప్ప లక్షణాలున్న గౌతమ్‌రెడ్డి మరణం రాష్ట్ర పారిశ్రామిక ప్రగతికి తీరని లోటని ఎమ్మెల్సీ మహ్మద్‌ ఇక్బాల్‌ పేర్కొన్నారు. గౌతమ్‌రెడ్డి హఠాన్మరణం విషాదకరమని ఎమ్మెల్సీ మాణిక్య వరప్రసాద్‌ చెప్పారు. మంత్రినన్న దర్పం ఆయనలో ఏనాడూ కానరాలేదని ఎమ్మెల్సీ వి.గోపాలరెడ్డి తెలిపారు. ప్రజలతో ఎలా మెలగాలో ఆయన్ను చూసి నేర్చుకోవాలని ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి పేర్కొన్నారు. విదేశాల నుంచి పెద్ద ఎత్తున పరిశ్రమలు, రూ.లక్షల కోట్ల పెట్టుబడులను రప్పించేలా గౌతమ్‌రెడ్డి కృషి చేశారని ఎమ్మెల్సీ మాధవరావు చెప్పారు. ప్రత్యర్థి పార్టీలకు చెందిన వారి పట్ల కూడా గౌతమ్‌రెడ్డి ఎంతో హుందాగా ఉండేవారని టీడీపీ ఎమ్మెల్సీ దీపక్‌రెడ్డి తెలిపారు. హుందాతనానికి నిలువెత్తు నిదర్శనం గౌతమ్‌రెడ్డి అని బీజేపీ ఎమ్మెల్సీ పీవీఎన్‌ మాధవ్‌ కొనియాడారు. రాష్ట్రంలో ఏర్పాటవుతున్న 2 స్కిల్‌ డెవలప్‌మెంట్‌ వర్సిటీలు గౌతమ్‌రెడ్డి కృషి ఫలితమేనని ఎమ్మెల్సీలు లక్ష్మణరావు, బాలసుబ్రహ్మణ్యం, శ్రీనివాసులరెడ్డి, వెంకటేశ్వర్లు, వాకాటి నారాయణరెడ్డి, నరసింహారెడ్డి పేర్కొన్నారు. 

కల్లాకపటం లేని మనిషి
గౌతమ్‌రెడ్డి కల్లాకపటం లేని మనిషి. 2009 ఎన్నికల సమయం నుంచి నాకు ఆయనతో సాన్నిహిత్యం ఉంది. 2014 ఎన్నికల్లో కూడా కలిసి పని చేశాం. ఆయన ఏనాడూ వివాదాల జోలికి పోలేదు. అరుదైన వ్యక్తిత్వం, మనస్తత్వం కలిగిన వ్యక్తి. 
    – కాకాణి గోవర్ధన్‌రెడ్డి, వైయ‌స్ఆర్‌సీపీ ఎమ్మెల్యే

తోబుట్టువులా చూసేవారు
రెండేళ్లు నేను ఏపీఐఐసీ చైర్‌పర్సన్‌గా ఉన్నాను. గౌతమ్‌రెడ్డి నన్ను ఎప్పుడూ తోబుట్టువులా చూసేవారు. గైడ్‌ చేసే వారు. సీఎం జగన్‌ కేబినెట్‌లోని మంత్రులు, నా తోటి ఎమ్మెల్యేలు ఆయన్ను బాహుబలి, ఆరడుగుల బుల్లెట్‌ అని, జిల్లా ప్రజలు నెల్లూరు టైగర్‌ అని పిలిచేవారు. ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ, క్రమ శిక్షణ కలిగిన గౌతమ్‌ అన్న లేరు అంటుంటే నమ్మశక్యం కావడం లేదు.     
– ఆర్‌.కె.రోజా, ఎమ్మెల్యే

జిల్లా అభివృద్ధిపై చర్చించారు
నెల్లూరు జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి చేయాలని గౌతమ్‌రెడ్డి నిరంతరం పరితపించేవారు. ఈ అంశంపై జనవరి 3, 4 తేదీల్లో కూడా నాతో చర్చించారు. దుబాయ్‌ నుంచి తిరిగి రాగానే జిల్లా ప్రజాప్రతినిధులు సీఎంను కలుద్దాం అన్నారు. ఇంతలోనే ఆయన మరణించడం బాధ కలిగిస్తోంది. ఆత్మకూరు నియోజకవర్గంలో ఎంఎస్‌ఎంఈ కంపెనీల ఏర్పాటుపై దృష్టి పెట్టారు. ఆ పనులు పురోగతిలో ఉండగానే ఆయన ఈ లోకం వీడారు.  
    – ఆనం రామనారాయణరెడ్డి,  ఎమ్మెల్యే

విదేశీ పెట్టుబడులకు ఎనలేని కృషి
రాజకీయాల్లో హుందాగా వ్యవహరించడంలో గౌతమ్‌రెడ్డికి ఎవరూ సాటిరారు. ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌లో రాష్ట్రాన్ని నంబర్‌–1గా నిలపడం, రాష్ట్రానికి విదేశీ పెట్టుబడులు తీసుకురావడంలో ఆయన కృషి ఎనలేనిది. 
    – అబ్బయ్య చౌదరి,  ఎమ్మెల్యే

కష్టకాలంలో అండగా నిలిచారు
ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కర్నూలు జిల్లా పార్టీ ఇన్‌చార్జిగా గౌతమ్‌రెడ్డి వ్యవహరించారు. అప్పట్లో నేను కష్టకాలంలో ఉన్నప్పుడు అండగా నిలిచారు. పార్టీ క్యాడర్‌లో ధైర్యాన్ని నింపారు.         
    – హఫీజ్‌ ఖాన్,  ఎమ్మెల్యే

అగాధం లాంటిదే
మంత్రి పదవిని బాధ్యతలను అర్థం చేసుకుని, తనకు కేటాయించిన శాఖల్లో ప్రతిభ కనబరిచిన వ్యక్తి గౌతమ్‌రెడ్డి. ఆయన లేని లోటు పార్టీకి, ప్రభుత్వానికి అగాధం లాంటిదే.  
    – ధర్మాన ప్రసాదరావు,  ఎమ్మెల్యే

సైనికుడిలా పనిచేశారు
సీఎం వైఎస్‌ జగన్‌ ఆశయ సాధన కోసం గౌతమ్‌ రెడ్డి సైనికుడిలా పనిచేశారు. తండ్రి వారసత్వంగా గౌతమ్‌ రెడ్డి రాజకీయాల్లోకి రాలేదు. జగనన్న సైనికుడిగానే వచ్చారు. 
    – కిలివేటి సంజీవయ్య,  ఎమ్మెల్యే

జ్ఞాపకాలు అనేకం
సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆశయసాధన కోసం నిరంతరం పరితపించిన వ్యక్తి గౌతమ్‌రెడ్డి. ఆయన నియోజకవర్గంలో జగన్‌ పర్యటన సమయంలో నన్ను సంప్రదించారు. చాలా గొప్పగా నిర్వహించడానికి నన్ను వెంటబెట్టుకుని వెళ్లారు. వారం రోజులు ఆయనతోనే ఉండి ఆ పర్యటన దిగ్విజయంగా పూర్తి చేశాం. ఇలాంటి జ్ఞాపకాలు అనేకం ఉన్నాయి.     
– చెవిరెడ్డి భాస్కర్‌ రెడ్డి,  ఎమ్మెల్యే

కలా.. నిజమా అనుకున్నా
గౌతమ్‌రెడ్డి మృతి చెందారనే విషయం తెలిశాక.. ఇది కలా నిజమా అనుకున్నా. చాలా బాధపడ్డాం. విధేయత, వినయం కలిగిన మంచి వ్యక్తి. ఆయన అలంకరించిన ఉన్నత పదవికే వన్నె తెచ్చిన వ్యక్తి. కొప్పర్తి పారిశ్రామికవాడని గొప్ప విజన్‌గా ఆయన చెప్పేవారు. 
    – కొరుముట్ల శ్రీనివాసులు, ఎమ్మెల్యే 
పెద్దలను గౌరవించేవారు
గౌతమ్‌రెడ్డి ఎంతో సంస్కారవంతుడు. పెద్దలను ఎంతో గౌరవించేవారు. నన్ను ఎంతో ఆప్యాయంగా పలకరించేవారు. వారి కుటుంబ సభ్యులకు మనోధైర్యాన్ని ఇవ్వాలని కోరుకుంటున్నా.    
– వరప్రసాద్, ఎమ్మెల్యే 

మా కుటుంబానికి పెద్దబ్బాయి
మా కుటుంబానికి పెద్దబ్బాయి గౌతమ్‌రెడ్డి. ఇద్దరం స్నేహితుల్లా ఉండేవాళ్లం. మా అబ్బాయి ఏం చెబితే అది కుటుంబంలో ఆచరించేవాళ్లం. మేం వైఎస్సార్‌ కుటుంబానికి భక్తులం. గౌతమ్‌ కూడా అంతే. సీఎంకు తోడు నీడగా ఉండేవాడు. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయమంటే అలాగే బాబూ అని చేశాను. మా అబ్బాయి సంతాప సభ అసెంబ్లీలో జరుగుతుందని ఎప్పుడు అనుకోలేదు.  
    – మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి, ఎమ్మెల్యే 

 

Back to Top