వైయస్ఆర్‌సీపీ నేతలపై కూటమి కుట్రలు

వైయస్ఆర్‌సీపీ పబ్లిసిటీ వింగ్ అధ్యక్షుడు కాకుమాను రాజశేఖర్‌

పొదిలి పర్యటనలో పక్క ప్రణాళిక ప్రకారమే టీడీపీ గూండాల రాళ్ళ దాడి

దాడి చేసిన వారికి కొమ్ముకాస్తున్న కూటమి ప్రభుత్వం

రాళ్ళ దాడిలో గాయపడిన వైయస్‌ఆర్‌సీపీ కార్యకర్తలపై ఎదురు కేసులు

తప్పుడు కేసులతో భయపెట్టాలనుకోవడం అవివేకం: కాకుమాను రాజశేఖర్‌

తాడేపల్లి వైయస్ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన పార్టీ పబ్లిసిటీ వింగ్ అధ్యక్షుడు కాకుమాను రాజశేఖర్‌

తాడేపల్లి: పొగాకు రైతులకు అండగా నిలిచేందుకు పొదిలిలో పర్యటించిన వైయస్ జగన్ కాన్వాయిపై దాడి చేసిన టీడీపీ గూండాలకు కూటమి ప్రభుత్వం కొమ్ము కాస్తోందని వైయస్ఆర్‌సీపీ పబ్లిసిటీ వింగ్ అధ్యక్షుడు కాకుమాను రాజశేఖర్‌ మండిపడ్డారు. తాడేపల్లి వైయస్ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ టీడీపీ గూండాల రాళ్ళ దాడిలో గాయపడిన వైయస్ఆర్‌సీపీ కార్యకర్తలపై పోలీసులు ఎదురు కేసులు బనాయించి, అరెస్ట్‌లు చేయడం దారుణమన్నారు. కూటమి ఏడాది పాలనకు వ్యతిరేకంగా ప్రజలు వైయస్ జగన్ పక్షాన నిలవడాన్ని జీర్ణించుకోలేక, కడుపుమంటతో పోలీసులను ఉసికొల్పి అక్రమ అరెస్ట్‌లకు తెగబడుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసులతో వైయస్ఆర్‌సీపీని భయపెట్టాలనుకోవడం వారి అవివేకమన్నారు. 

ఇంకా ఆయ‌న ఏమ‌న్నారంటే..

ఈనెల నాలుగో తేదీన వెన్నుపోటు దినం కార్యక్రమం సందర్భంగా ప్రజలు కూటమి ప్రభుత్వ ఏడాది పాలనపై తమ నిరసనలను పెద్ద ఎత్తున ప్రకటించారు. దీనితో భయంతో ఉన్న కూటమి ప్రభుత్వం ఏదో ఒక రకంగా వైయస్ఆర్‌సీపీ నాయకులను కట్టడి చేయాలనే కుట్రకు తెరతీసింది. దీనిలో భాగంగానే జూన్ 11న పొగాకు రైతులకు గిట్టుబాటుధర కల్పించాలని ప్రతిపక్ష నేత వైయస్ జగన్  పొదిలిలో పర్యటించి, రైతులను కలిశారు. ఈ పర్యటనను ఒక పథకం ప్రకారం అడ్డుకునేందుకు తెలుగుదేశం పార్టీ కుట్ర చేసింది. వైయస్ జగన్ పర్యటిస్తున్న మార్గంలో టీడీపీ గూండాలు మహిళలను అడ్డం పెట్టకుని దాడి చేశారు. రాళ్ళు రువ్వి అలజడి సృష్టించే ప్రయత్నం చేశారు. ఈ దాడిలో వైయస్ఆర్‌సీపీ కార్యకర్తలతో పాటు పోలీసులు కూడా గాయపడ్డారు. జడ్‌ప్లస్ కేటగిరి భద్రత ఉన్న వైయస్ జగన్ కాన్వాయ్‌లోకి ఈ అరాచకశక్తులు ఎలా ప్రవేశించాయి? ప్రభుత్వ అండతోనే టీడీపీ గూండాలు ఈ దాడికి తెగబడ్డారనేది సుస్పష్టం. కానీ విచిత్రంగా పోలీసులు దాడికి పాల్పడిన వారిని వదిలిపెట్టి, గాయపడిన వైయస్ఆర్‌సీపీ నాయకులు, కార్యకర్తలపై అక్రమంగా కేసులు నమోదు చేశారు. కూటమి పాలనలో అరాచకం రాజ్యమేలుతోందనేందుకు ఇది నిదర్శనం. 

అర్థరాత్రి అరెస్ట్‌లతో గ్రామాల్లో భయాందోళనలు

పొదిలిలో రాళ్ళ దాడి పేరుతో వైయస్ఆర్‌సీపీ వారిపై పోలీసులు బనాయించిన కేసుల్లో అర్ధరాత్రి సమయాల్లో ఇళ్ళపైకి వెళ్ళి కరుడుకట్టిన నేరస్తులను పట్టుకున్నట్లుగా  అరెస్ట్‌లు చేస్తున్నారు. వైయస్ జగన్ పై అభిమానంతో ఆయన పర్యటన కోసం వెళ్ళిన వారిని ఇంత దారుణంగా ఎలా అరెస్ట్ చేస్తున్నారు? ఒక వైపు అక్రమ కేసులు పెట్టడం, మరోవైపు అర్థరాత్రి గ్రామాల్లో భయాందోళనలను సృష్టించేలా పోలీస్ యంత్రాంగాన్ని ఇష్టం వచ్చినట్లు వాడుకుంటున్నారు. ఇలా అరెస్ట్ చేసిన వారిని పరామర్శించేందుకు పోలీస్ట్ స్టేషన్ వద్దకు వెళ్ళిన చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డిపై సీఐ ఎలా దౌర్జన్యం చేశారో రాష్ట్రం అంతా చూశారు. అలాగే స్థానిక ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డికి నోటీస్ పంపడం చూస్తే మరో కుట్రకు తెరతీస్తున్నారా అనే అనుమానం కలుగుతోంది. శాంతిభద్రతలు కాపాడాల్సింది ఎమ్మెల్యేనా? పోలీసులా? దీనిపై   
ఎమ్మెల్యేకు ఎలా నోటీస్ ఇస్తారు? 

పచ్చ చొక్కాలు వేసుకున్న కార్యకర్తల్లా పోలీసులు

ఏపీలో పోలీసులు పచ్చచొక్కాలు వేసుకున్న టీడీపీ కార్యకర్తల మాదిరిగా పనిచేస్తున్నారు. పోలీస్ వ్యవస్థకే మచ్చ తెచ్చేలా కొందరు అధికారులు పనిచేస్తున్నారు. పొగాకు రైతులకు మద్దతుగా వైయస్ జగన్ తలపెట్టిన ర్యాలీలో పాల్గొనడమే నేరంగా కూటమి ప్రభుత్వం భావిస్తోంది. ఇటువంటి విధానాలనే కొనసాగిస్తే రాబోయే రోజుల్లో తగిన మూల్యం చెల్లించకతప్పుదు. వైయస్ జగన్ వెంట నడుస్తున్న వారిని చూసి తట్టుకోలేకపోతున్నారు. కడుపుమంటతో రగిలిపోతున్నారు. పోలీసులను ప్రయోగించి వేధించాలని చూస్తున్నారు. రాబోయే రోజుల్లో మళ్ళీ వైయస్ జగన్ అధికారంలోకి వస్తారు. ఈ అరాచక పాలనకు ముగింపు పలుకుతారు. కూటమి ప్రభుత్వం ఎన్ని అవాంతరాలు కల్పించినా కార్యకర్తలు వైయస్ఆర్‌సీపీ నేతృత్వంలో తమ పోరాటాన్ని కొనసాగిస్తారు, ప్రజల పక్షాన నిలబడతారు. చంద్రబాబు అంటేనే రైతులకు వ్యతిరేకి. వ్యవసాయమే దండుగ అన్న వ్యక్తి. 1999లో బషీర్‌బాగ్‌లో విద్యుత్ ఉద్యమంలో రైతుల ప్రాణాలను బలితీసుకున్నారు. అలాంటి చంద్రబాబుకు రైతు అంటేనే చులకనభావన. రాజధాని ప్రాంతంలోనూ మూడు పంటలు పండే భూములను అక్రమంగా గుంజుక్కున్న వ్యక్తి చంద్రబాబు.

Back to Top