న్యూఢిల్లీ :
అసెంబ్లీలో తీర్మానం కూడా లేకుండానే ఆంధ్రప్రదేశ్‌ను విభజించాలన్న కేంద్ర మంత్రివర్గం నిర్ణయం నేపథ్యంలో.. రాష్ట్రాల విభజనకు సంబంధించి రాజ్యాంగంలోని మూడవ అధికరణ (ఆర్టికల్-3)ని కాంగ్రెస్ పార్టీ దుర్వినియోగం చేయటాన్ని పార్లమెంటులో కలసికట్టుగా ప్రశ్నించటానికి కీలకమైన ప్రతిపక్షాలు సిద్ధమయ్యాయి. ఆంధ్రప్రదేశ్‌ను ఏకపక్షంగా విభజించాలన్న కాంగ్రెస్ నిర్ణయం.. ఆర్టికల్-3 దుర్వినియోగమవుతున్న తీరును.. ఆ అధికరణను సవరించాల్సిన ఆవశ్యకతను.. వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శ్రీ వైయస్ జగన్మోహన్‌రెడ్డి గత కొద్ది రోజులుగా ఆయా పార్టీలను కలసి వివరించి, దీనిపై కీలక విపక్షాలను ఏకతాటిపైకి తీసుకువచ్చారు.
ఈ నేపథ్యంలో.. ఆంధ్రప్రదేశ్ ఏకపక్ష విభజన, ఆర్టికల్-3 దుర్వినియోగం అంశాలను పార్లమెంటులో వాయిదా తీర్మానాల ద్వారా లేవనెత్తాలని ఆయా పార్టీలు నిర్ణయించాయి. సమాజ్‌వాది పార్టీ, తృణమూల్ కాంగ్రెస్, బిజూ జనతాదళ్, అసోం గణపరిషత్, జనతాదళ్-యునెటైడ్‌లు వాయిదా తీర్మానం ఇవ్వాలన్న నిర్ణయానికి వచ్చాయి. సీపీఎం, జనతాదళ్-సెక్యులర్ పార్టీలు కూడా ఆర్టికల్-3 దుర్వినియోగంపై పార్లమెంటులో ప్రభుత్వాన్ని నిలదీయాలన్న ఆలోచనలో ఉన్నాయి.
ఆంధ్రప్రదేశ్ విభజన ప్రక్రియలో ఎలాంటి పద్ధతులు, ప్రాతిపదికను అనుసరించటం లేదనీ, సంప్రదాయాలను తుంగలో తొక్కేసి, అసెంబ్లీ తీర్మానం చేయకుండా ఆ తీర్మానంతో పనిలేకుండా కాంగ్రెస్ పార్టీ, కేంద్ర ప్రభుత్వం ఇష్టానుసారంగా విభజిస్తోందని.. అది కూడా ఎన్నికల సమయంలో కేవలం రాజకీయ ప్రయోజనాల కోసం, ఓట్లు, సీట్ల కోసం ఇలాంటి ప్రయత్నాలు చేస్తోందని.. ఇందుకోసం ఆర్టికల్-3ను దుర్వినియోగం చేస్తోందని శ్రీ వైయస్ జగన్మోహన్‌రెడ్డి ఆయా పార్టీల నేతలను కలిసిన సందర్భంగా వివరించారు.
ఏదైనా రాష్ట్రాన్ని విభజించాలంటే సంబంధిత అసెంబ్లీలో 2/3 వంతుల మెజారిటీతో విభజన తీర్మానాన్ని ఆమోదించటం, ఆ విభజనకు పార్లమెంటు ఉభయ సభల్లోనూ 2/3 వంతుల మెజారిటీ ఆమోదం తప్పనిసరి చేస్తూ రాజ్యాంగంలోని ఆర్టికల్-3ను సవరించాలని, అందుకు మద్దతు ఇవ్వాలని ఆయా పార్టీల అధినేతలను కలిసిన సందర్భంగా శ్రీ జగన్ కోరిన విషయం తెలిసిందే. లేనిపక్షంలో.. లోక్‌సభలో 272 మంది మద్దతు ఉన్న ఏ పార్టీ అయినా సరే.. తన రాజకీయ ప్రయోజనాల కోసం ఏ రాష్ట్రాన్నయినా ఇష్టానుసారం విభజించుకుంటూ పోతుందని.. ఇది ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయటమేనని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.
శ్రీ వైయస్ జగన్మోహన్‌రెడ్డి వాదనతో ఏకీభవించిన ఆయా పార్టీలు.. కాంగ్రెస్ పార్టీ వైఖరిని ఎండగడుతూ రాష్ట్రాన్ని విభజించడానికి ఆర్టికల్-3 ను దుర్వినియోగం చేస్తున్న తీరును ప్రశ్నించాలని, అందుకు అవసరమైన రీతిలో రాజ్యాంగ సవరణకు పార్లమెంటులో పట్టుబట్టాలని నిర్ణయానికి వచ్చాయి. ఈ మేరకు మంగళవారం ఉభయసభల్లోనూ వాయిదా తీర్మానం ఇచ్చి చర్చకు పట్టుపడతామని ఆయా పార్టీలు తెలిపాయి.
కీలక పార్టీల సానుకూల స్పందన :
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని విభజించవద్దని కేంద్రాన్ని గట్టిగా కోరతామని సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యుడు సీతారాం ఏచూరి తమ పార్టీ తరఫున శ్రీ జగన్‌కు సంపూర్ణ మద్దతు ప్రకటించిన విషయం తెలిసిందే. తెలంగాణకు మద్దతు పలికిన సీపీఐ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్‌రెడ్డి సైతం ఆర్టికల్-3 దుర్వినియోగంపై పార్టీలో చర్చిస్తామని తెలిపారు. ఇదే అంశంతో పాటు సీమాంధ్ర సమస్యలపై చర్చిస్తామని బీజేపీ అధినేత రాజ్‌నాథ్‌సింగ్ పేర్కొన్నారు. అసెంబ్లీలో తీర్మానం ఆమోదించకుండా రాష్ట్రాన్ని విభజించాలని చేస్తున్న ప్రయత్నాన్ని గట్టిగా అడ్డుకుంటామని మమతా బెనర్జీ హామీ ఇచ్చారు. జేడీయూ అధ్యక్షుడు శరద్‌యాదవ్, ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ సైతం శ్రీ జగన్మోహన్‌రెడ్డి వాదనకు అనుకూలంగా అభిప్రాయాలు వ్యక్తం చేశారు.
తొమ్మిదేళ్ల క్రితం తెలంగాణకు అనుకూలంగా తమ పార్టీ నిర్ణయం తీసుకున్నప్పటికీ రాజ్యాంగంలోని మూడవ అధికరణపై శ్రీ జగన్ లేవనెత్తిన అంశాలు చాలా కీలకమైనవన్న ఎన్‌సీపీ అధినేత శరద్‌పవార్ వాటిని నిశితంగా పరిశీలిస్తామని హామీ ఇచ్చారు. తెలంగాణ బిల్లు పార్లమెంటు ముందుకు వచ్చినప్పుడు గట్టిగా నిరసిస్తామని శివసేన అధ్యక్షుడు ఉద్ధవ్‌ఠాక్రే హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేశ్‌యాదవ్ పార్లమెంటులో తెలంగాణ బిల్లును గట్టిగా వ్యతిరేకిస్తామని భరోసా ఇచ్చారు.
బీజేపీ మినహాయిస్తే ఈ పార్టీలకు లోక్‌సభలో వందకు పైగా స్థానాలున్నాయి. ఎస్‌పీ 22, టీఎంసీ 17, జేడీ(యూ) 19, సీపీఎం 16, శివసేన 11, బీజేడీ 14, జనతాదళ్ (ఎస్), ఏజీపీలకు ఒక్కో స్థానం ఉన్నాయి. వీరితో పాటు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ముగ్గురు ఎంపీలు సైతం పార్లమెంటులో నిరసన గళం వినిపించనున్నారు.
పార్టీల మద్దతు కూడగట్టిన వైయస్ జగన్ :
పార్లమెంటులో కీలకపాత్ర పోషిస్తున్న పార్టీలు.. బీజేపీ, సీపీఏం, సీపీఐ, తృణమూల్ కాంగ్రెస్, జనతాదళ్-యునెటైడ్, బిజూ జనతాదళ్, నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీ, శివసేన, డీఏంకే, అన్నా డీఏంకే, సమాజ్‌వాది పార్టీ, ఏఐఏడీఎంకే, డీఎంకే, జనతాదళ్-ఎస్, అస్సాం గణపరిషత్ తదితర పార్టీల నేతలను కలిసి ఆంధ్రప్రదేశ్ విభజన విషయంలో కాంగ్రెస్, కేంద్ర ప్రభుత్వ నిరంకుశ ధోరణనిని శ్రీ జగన్మోహన్‌రెడ్డి వివరించారు. శ్రీ జగన్ లేవనెత్తిన కీలక అంశాలపై దాదాపు అన్ని పార్టీలు సానుకూలంగా స్పందించాయి. అవసరమైన సమయంలో కచ్చితంగా పార్లమెంటులో లేవనెత్తుతామని హామీ ఇచ్చాయి.
నవంబర్ 16న ఢిల్లీలో సీపీఎం, సీపీఐ ముఖ్యనేతలను శ్రీ జగన్మోహన్‌రెడ్డి కలిశారు. నవంబర్ 17న బీజేపీ జాతీయ అధ్యక్షుడు రాజ్‌నాథ్‌సింగ్‌తో భేటీ అయ్యారు. అదే నెల 20న తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీతో సమావేశమయ్యారు. నవంబర్ 23న రాష్ట్రపతి ప్రణభ్ ముఖర్జీని కలిసి రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాల్సిన ఆవశ్యకతను శ్రీ జగన్ వివరించారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 143 కింద రాష్ట్రపతికి ఉండే అధికారాలను ఉపయోగించాలని, విభజనకు సంబంధించి వివిధ అంశాలపై న్యాయ సమీక్ష కోరాలని విజ్ఞప్తి చేశారు. నవంబర్ 23 సాయంత్రం జేడీయూ అధినేత శరద్‌యాదవ్‌ను కలిసి మద్దతు కోరారు. అదే నెల 24న భువనేశ్వర్ వెళ్లి ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్‌ను కలుసుకొని సమస్యను వివరించారు.
ఆ మరుసటి రోజు 25న ముంబై వెళ్లి ఎన్‌సీపీ అధినేత, కేంద్ర వ్యవసాయ మంత్రి శరద్‌పవార్, శివసేన అధినేత ఉద్ధవ్ ఠాక్రేలతో వేర్వేరుగా భేటీ అయ్యారు. డిసెంబర్ 4న తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత, డీఎంకే అధినేత కరుణానిధి, ఆయన తనయుడు స్టాలిన్, కరుణానిధి కుమార్తె కనిమొళిలను కలిసి ఆంధ్రప్రదేశ్ విభజన అన్యాయాన్ని వివరించారు. 6న లక్నో వెళ్లి ఉత్తరప్రదేశ్ సీఎం అఖిలేశ్ యాదవ్‌తో సమావేశమై విభజనను అడ్డుకోవాలని మద్దతు కోరారు. మంగళవారం ఢిల్లీలో సమాజ్‌వాది పార్టీ అధినేత ములాయం సింగ్ యాదవ్, జేడీఎస్ అధ్యక్షుడు, మాజీ ప్రధాని దేవెగౌడను కలిసి మద్దతు కోరారు.