అక్షరాలా అమరజీవి!!

కొన్ని మాటలు వాడుకలో అరిగిపోయి, వాటి అసలు అర్థాన్ని కోల్పోతూ ఉంటాయి. కొంతకాలం తర్వాత ఎవరో వ్యక్తులు ఆ పదాలకు అసలయిన అర్థమిదీ అన్నట్లుగా జీవించి చూపించి వాటి సార్థకతను నిలబెడుతుంటారు. సోమవారం నాడు , 97 సంవత్సరాల పండు వయసులో కన్నుమూసిన క్యాప్టెన్ లక్ష్మీ సెహ్‌గల్ అలాంటి మనిషి. 1914 అక్టోబర్ 24న జన్మించి- 2012, జులై 23న కాన్పూర్‌లో మరణించిన లక్ష్మీ సెహ్‌గల్ అమరజీవి అన్న పదానికి నైఘంటికార్థంగా నిలబడతారు. స్వాతంత్య్రోద్యమ కాలం నాటి సత్సంప్రదాయాలకూ, చిత్తశుద్ధికీ, త్యాగనిరతికీ, సేవాప్రవృత్తికీ ప్రతీకగా ఆమె కలకాలం నిలిచేఉంటారు.

1938 నాటికి ఎంబీబీఎస్ చేసిన మహిళల సంఖ్య అతి తక్కువ. అందునా, లక్ష్మీ సెహ్‌గల్ మాదిరిగా ఒక సంవత్సరం గైనకాలజీలో డిప్లమా కూడా కలిగి ఉన్న మహిళలు మరీ అరుదు. కావాలనుకుంటే లక్ష్మీ సెహ్‌గల్ (అప్పటికి లక్ష్మీ స్వామినాథన్) మద్రాసు మహానగరంలో ఓ అత్యాధునిక వైద్యశాలను నిర్మించుకుని లక్షల రూపాయలు ఆర్జించగలిగి ఉండేవారు. కానీ, ఆమె అలా అనుకోలేదు.

కడుపు చేతపట్టుకుని కూలిపనులకోసం సింగపూర్‌కు తరలిపోయిన భారతీయ నిరుపేదల వాడలో ఓ క్లినిక్ ప్రారంభించి వైద్య సేవలందించాలనే కృతనిశ్చయంతో 1940లో ఆమె విదేశాలకు పయనమయ్యారు. లక్ష్మీ సెహ్‌గల్ ఇలా నిర్ణయించడం వెనక ఆమె తల్లి -అమ్ము స్వామినాథన్- ప్రోత్సాహం కచ్చితంగా ఉండిఉంటుంది. ఆరోజుల్లో అమ్ముకుట్టి, మద్రాసులోని ప్రముఖ సంఘసేవికలలో ఒకరు.

లక్ష్మీ సెహ్‌గల్ సింగపూర్ చేరే నాటికే, రెండో ప్రపంచ యుద్ధం హోరాహోరీగా సాగుతోంది. రెండేళ్ల తర్వాత, 1942లో, బ్రిటన్ సింగపూర్‌ను జపాన్‌కు ధారాదత్తం చేసింది. ఆ యుద్ధంలో అనేకమంది ఆసియాదేశాల పేదలు తీవ్రంగా గాయపడ్డారు. లక్ష్మీ సెహ్‌గల్ వారికి సేవలందించి ప్రాణాలు నిలబెట్టారు. ఆ నిరుపేద సైనికులు స్వతంత్ర భారత సైన్యాన్ని సింగపూర్‌లో నిర్మించాలని తలపెట్టినందుకు లక్ష్మీ సెహ్‌గల్ వారిని అభినందించారు. మరసటి సంవత్సరం, నేతాజీ సుభాస్ చంద్ర బోస్ మార్గదర్శకత్వంలో ఈ దళాలే ‘ఆజాద్ హింద్ ఫౌజ్’గా ఏర్పడ్డాయి. లక్ష్మీ సెహ్‌గల్ మహిళాదళాల్లో చేరి, క్యాప్టెన్ హోదా పొంది, డాక్టర్‌గా వైద్యసేవలు కూడా అందచేశారు.


భారతదేశ విభజన దశలో లక్ష్మీ సెహ్‌గల్, ప్రేమ్ కుమార్ సెహ్‌గల్‌ను -లాహోర్‌లో- వివాహమాడారు. పాక్ శరణార్థిగా భారతదేశానికి వచ్చి, భర్తతో కలిసి కాన్పూర్‌లో స్థిరపడ్డారు. అనేక దశాబ్దాల పాటు ఆమె కాన్పూర్ ప్రజలకు వైద్యసేవలందించారు. ప్రత్యక్షంగా రాజకీయ కార్యకలాపాల్లో పాల్గొనక పోయినా, లక్ష్మీ సెహ్‌గల్ ఎల్లెప్పుడూ పేదసాదల అభ్యున్నతి కోసం కృషిచేసే శక్తులకు చేయూత అందిస్తూనే వచ్చారు.

1971లో, సీపీఎం తరఫున లక్ష్మీ సెహ్‌గల్ రాజ్యసభ సభ్యురాలిగా ఎన్నికయ్యారు. 1998లో భారత ప్రభుత్వం ఆమెకి పద్మ విభూషణ్ పురస్కారం ప్రకటించింది. 2002లో జరిగిన రాష్ట్రపతి ఎన్నికల్లో ఆమె వామపక్షాల మద్దత్తుతో బరిలోకి దిగారు. (ఆ ఎన్నికల్లో అబ్దుల్ కలామ్ రాష్ట్రపతిగా ఎన్నికయ్యారు.)

మన జనాభాలో అధిక సంఖ్యాకులుగా ఉన్న పేద, దిగువ మధ్యతరగతి ప్రజలకు డాక్టర్‌గా అపారమయిన సేవలందించిన క్యాప్టెన్ లక్ష్మీ సెహ్‌గల్ జీవితమంతా ఆ వర్గాల ప్రగతికే అంకితం చేశారు. అలాంటి వ్యక్తిని ‘అమరజీవి’ అన్నమాటకు నిలువెత్తు నిర్వచనంగా ప్రపంచం గుర్తించడం సహజం. ఆమె జనహృదయాలలో కలకాలం నిలిపోయి, మనగలగడంలో వింతేముంది?

Back to Top