ఆంధ్రా ప్యారిస్‌తో మహానేత ఆత్మీయ బంధం

తెనాలి : జనహితాన్నే జీవితాంతమూ కోరిన మహానేత రాజన్న! అడగకుండానే బడుగు జీవులకు వరాలిచ్చిన దేవుడాయన! ఆ అమరశేఖరుడికి గుంటూరు జిల్లాలోని డెల్టా ప్రజలకు మధ్య అనుబంధం అజరామరం... ఆత్మీయం. ఆ మహానేతను మనసులో పదిల పరుచుకుకుని, గుండెనే గుడిగా చేసి ఆరాధిస్తున్నారు జనం. అదే అభిమానాన్ని.. తన ప్రమాణాన్ని నెరవేరుస్తూ ఓదార్పు ప్రయాణంలో వచ్చిన జననేత జగన్‌పైనా కురిపించారు వారు. ఇప్పుడు మహానేత తనయ, జననేత సోదరి శ్రీమతి షర్మిలకూ అదే తరహాలో బ్రహ్మరథం పడుతున్నారు.

శ్రీమతి షర్మిలలో తమ అభిమాన నేత రాజన్నను చూసుకుంటున్నారు. నీరాజనాలు పలుకుతున్నారు.. తోడునీడగా నిలుస్తున్నారు. ఆంధ్రాప్యారిస్ తెనాలిలో‌ అడుగడుగునా ఆమెపై అభిమానపు జల్లులు కురిపించారు. వారి అభిమాన వర్షంలో తడిసి ముద్దవుతున్న ఆ బహుదూరపు బాటసారి రెట్టించిన ఉత్సాహంతో ముందుకు సాగుతున్నారు. ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్న ప్రభుత్వాన్ని శ్రీమతి షర్మిల ఎండగడుతున్నపుడు, ప్రధాన ప్రతిపక్షం టిడిపి తీరుపై విమర్శలు గుప్పిస్తున్నపుడు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు.

‘మరో ప్రజాప్రస్థానం’ పాదయాత్ర బుధవారం వేమూరు, తెనాలి నియోజకవర్గాల్లో కొనసాగింది. వేమూరు నియోజకవర్గంలోని పెదపూడి శివారులోని బస నుంచి ఉదయం బయలుదేరిన శ్రీమతి షర్మిలకు మార్గమధ్యంలోని పంటపొలాల చెంత రైతులు, రైతుకూలీలు బారులుతీరి స్వాగతం పలికారు.
జలాశయాల్లో తగినంత నీరు లేకపోయినా, మొక్కజొన్న పంటకు చివరి తడులను ఇచ్చిన మహానేత డాక్టర్ వై‌యస్ ఔదార్యాన్ని‌ స్థానికులు గుర్తుచే‌సుకున్నారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వంలో మొక్కజొన్న ఎండిపోతోందని శ్రీమతి షర్మిలకు విన్నవించుకున్నారు. అమృతలూరు మండలం మూల్పూరు అడ్డరోడ్డు వద్ద పెద్దసంఖ్యలో వేచి ఉన్న గ్రామస్థులు డప్పువాయిద్యాలు, బాణాసంచాతో ఘన స్వాగతం పలికారు. కూచిపూడిలోకి ప్రవేశించిన ఆమెకు పూలబాట పరిచారు. అక్కడ ఏర్పాటు చేసిన పార్టీ పతాకాన్ని శ్రీమతి షర్మిల ఆవిష్కరించారు.

తెనాలిలో అపూర్వ స్వాగతం :
భోజన విరామం అనంతరం సాయంత్రం తెనాలి నియోజకవర్గంలోకి ప్రవేశించిన శ్రీమతి షర్మిలకు ప్రజలు అపూర్వ స్వాగతం పలికారు. పెదరావూరు ఊరి వెలుపల నుంచి అడుగడుగునా బారులు తీరిన ప్రజలు ఆమెను చూడగానే హర్షధ్వానాలు చేశారు. ఓపిక లేకపోయినా చేతికర్ర పట్టుకుని ఎదురుచూసిన 75 ఏళ్ల వృద్ధురాలు శ్యామల, శ్రీమతి షర్మిల పలుకరించగానే మురిసిపోయారు. గంగాడి అనిల్‌కుమార్ అనే యువకుడు‌ మహానే రాజన్న చిత్రపటాన్ని బహూకరించారు. చిన్నపల్లిలో అంబేద్కర్ విగ్రహం వద్ద శ్రీమతి షర్మిల కపోతాన్ని ఎగురవేసి, మేరుగ నాగార్జున చేత అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేయించారు.

జగ్గడిగుంటపాలెంలో పలువురు చేనేత మహిళ‌లు శ్రీమతి షర్మిలకు నేత వస్త్రాలను బహూకరించారు. తాము ఎదుర్కొంటున్న సమస్యలను శ్రీమతి షర్మిలకు చేనేత కార్మికులు చెప్పుకున్నారు. చినరావూరుతోట సెంటరులో పార్టీ జెండాను ఆవిష్కరించారు. అంబేద్కర్ కాలేజి ఎదుట ఏఈఎ‌ల్‌సీ ఫాస్టర్లు 20 మంది ప్రత్యేకంగా ప్రార్థన చేశారు. అంబేద్కర్ ఎడ్యుకేషన‌ల్ సొసైటీ కరస్పాండెంట్ మన్నవ మేరీగ్రే‌స్‌ డాక్టర్ వై‌యస్ చిత్రపటాన్ని బహూకరించారు. అక్క‌డి నుంచి బోసురోడ్డు, సత్యనారాయణ టాకీస్ రోడ్డు, వహా‌బ్‌చౌక్‌లో శ్రీమతి షర్మిలకు జనం నీరాజనం పలికారు. పాదయాత్ర కోసం వైయస్‌ఆర్ ట్రే‌డ్ యూనియ‌న్ జిల్లా కన్వీన‌ర్ అన్నాబత్తుని సదాశివరావు రూపొందించిన కాగడాను శ్రీమతి షర్మిల ఆవిష్కరించారు.

‌స్థానిక చిత్రకారుడు జయశేఖర్ చిత్రీకరించిన శ్రీమతి షర్మిల చిత్రపటాన్ని సాంస్కృతిక విభాగం జిల్లా కన్వీనర్ షే‌క్ జానీభాషా బహూకరించారు. పాదయాత్ర మార్కె‌ట్‌ సెంటరుకు చేరుకున్నాక అక్కడి అశేష జనవాహినిని ఉద్దేశించి శ్రీమతి షర్మిల ప్రసంగించారు. సభ అనంతరం ఆమె రాత్రి బసకు చేరుకున్నారు.

మార్కెట్‌ సెంటరు కిటకిట :
శ్రీమతి షర్మిల బహిరంగ సభకు వేలాదిగా జనం తరలివచ్చారు. పట్టణంలో పాదయాత్ర మార్గంలో ఇరువైపులా గుంపులుగా బారులుతీరిన జనం స్వాగతం పలికారు. ప్రధాన వీధులు జనసంద్రాన్ని తలపించాయి. శ్రీమతి షర్మిల ప్రసంగం వినేందుకు విశేష సంఖ్యలో ప్రజలు పరిసర గ్రామాల నుంచి కూడా తరలివచ్చారు. సభా ప్రాంగణంలో స్థలం సరిపోకపోవడంతో పలువురు మున్సిపల్ కార్యాలయం, సమీప భవానాలపై‌న కూడా ఎక్కి వీక్షించారు. శ్రీమతి షర్మిల సభకు మహిళలు భారీగా తరలిరావడటం విశేషం.
Back to Top