మేనిఫెస్టోలోని ప్రతి అంశాన్ని అమలు చేస్తాం

మేనిఫెస్టో కమిటీ అధ్యక్షుడు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు

పాదయాత్రలో వైయస్‌ జగన్‌ దృష్టికొచ్చిన సమస్యలు మేనిఫెస్టోలో పొందుపరుస్తాం

300కు పైగా అర్జీలు ప్రజల నుంచి అందాయి

12న విజయవాడలో మరో సమావేశం

ఎవరైనా సలహాలు, సూచనలు కమిటీకి అందించవచ్చు

కౌలు రైతులకు న్యాయం జరిగేలా ఫార్ములా

హైదరాబాద్‌: మేనిఫెస్టోలో పొందుపరిచిన ప్రతి అంశాన్ని తప్పకుండా అమలు చేస్తామని వైయస్‌ఆర్‌సీపీ మేనిఫెస్టో కమిటీ అధ్యక్షుడు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. బుధవారం హైదరాబాద్‌లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి అధ్యక్షతన మేనిఫెస్టో కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అధినేత మేనిఫెస్టో కమిటీకి పలు సలహాలు,సూచనలు ఇచ్చారు. ఆ వివరాలను ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు మీడియాకు వివరించారు.

గత నెల 26న మొదటి సమావేశం విజయవాడలో నిర్వహించామన్నారు. 3వ తేదీన అన్ని జిల్లాల్లో పార్టీ నాయకులు, అనుబంధ సంఘాల సభ్యులతో చర్చించామన్నారు. ఎన్నికల మేనిఫెస్టోలో పొందుపరిచేందుకు ఏయే అంశాలు ఉన్నాయో చర్చించామన్నారు. 13 జిల్లాల్లో కూడా సమావేశాలు నిర్వహించామన్నారు. జిల్లాలో చర్చించిన అంశాలను ఈ రోజు సమావేశంలో చర్చించామని చెప్పారు. పార్టీ అధ్యక్షులు వైయస్‌ జగన్‌ కొన్ని ముఖ్యమైన సూచనలు చేశారన్నారు. ఈ రోజు చర్చల్లో నాలుగు అంశాలు తీసుకున్నామన్నారు. నవరత్నాల్లో వివరించిన 9 అంశాలపై ఇప్పటికే ప్రజల్లోకి తీసుకెళ్లామన్నారు.

ఎన్నికల మేనిఫెస్టోలో ప్రముఖంగా ప్రస్ఫూటించేలా రూపొందించాలని చర్చించామన్నారు. పార్టీ అధ్యక్షులు వైయస్‌ జగన్‌ 2017 నవంబర్‌ 6 నుంచి 2019 జనవరి 9వ తేదీ వరకు ప్రజా సంకల్ప యాత్ర  చేశారన్నారు. ఈ పాదయాత్రలో ఆయా వర్గాల ప్రజలు తమ బాధలు వైయస్‌ జగన్‌తో చెప్పుకున్నారన్నారు. ఆ అంశాలన్నీ కూడా క్రోడికరించామన్నారు. అందులో వైయస్‌ జగన్‌ చేసిన వాగ్ధానాలు ఎన్నికల మేనిఫెస్టోలో చేర్చాలని చర్చించామన్నారు. 3వ తేదీన ప్రతి జిల్లాల్లో జరిగిన సమావేశాల్లో చర్చించిన సమస్యలు కూడా స్టడీ చేస్తున్నామన్నారు. విజయవాడలో గత నెల 26న సమావేశమై మెయిల్‌ నంబర్‌ఇచ్చామన్నారు. ఎన్నికల మేనిఫెస్టోలో ఎవరైనా తమ సలహాలు చెప్పవచ్చు అని చెప్పామన్నారు. ఇప్పటి వరకు 300పైగా సమస్యలు, సలహాలు వచ్చాయన్నారు. వాటిని కూడా ఆధ్యాయనం చేస్తున్నామన్నారు. ఆ సమస్యల పరిష్కారం కోసం ఎంతవరకు మేనిఫెస్టోలో చేర్చాలన్నది చర్చించామన్నారు.

మేనిఫెస్టోలో పొందుపరిచే ప్రతి అంశాన్ని నూటికి నూరుపాళ్లు అమలు చేసేలా చర్చించామన్నారు. అన్నింటిని అధ్యాయనం చేసి క్లుప్తంగా తయారు చేయాలని పార్టీ అధ్యక్షులు సూచించారన్నారు. చేసిన వాగ్ధానాలు, ఆర్థిక అంశాలు కూడా అధ్యాయనం చేయాలని, ప్రభుత్వంపై ఎంత భారం ఉందో చర్చించాలని తమకు సూచించారని తెలిపారు. ప్రతి అంశాన్ని నెరవేర్చేవిధంగా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారన్నారు. తదుపరి సమావేశం మార్చి 12న విజయవాడ పార్టీ కార్యాలయంలో నిర్వహిస్తామన్నారు. ఆ సమావేశంలో కూడా ఎవరైనా కూడా సలహాలు ఇవ్వవచ్చు అన్నారు. రాష్ట్రంలో 70 శాతం మంది కౌలు రైతులు ఉన్నారన్నారు. కౌలు రైతులు, రైతులకు న్యాయం జరిగేలా ఫార్ములా రూపొందించాలని అధినేత సలహా ఇచ్చినట్లు ఉమ్మారెడ్డి తెలిపారు. 
 

Back to Top