ఒంటరిగా పోటీ చేసే సత్తా వైయస్‌ జగన్‌కు ఉంది

– వైయస్‌ఆర్‌సీపీ సీనియర్‌ నాయకుడు బాలశౌరి

– ఎన్ని హామీలు అమలు చేశారో శ్వేతపత్రం విడుదల చేయాలి
– 23 మంది ఎమ్మెల్యేల కొనుగోలుపై శ్వేతపత్రం విడుదల చేయాలి
– హైకోర్టు విభజనపై టీడీపీ సర్కార్‌ అఫిడవిట్‌ ఇచ్చింది
– కేంద్రం డబ్బులిచ్చినా హైకోర్టు భవనాలు కట్టలేదు
– ధర్మ పోరాట దీక్షలో ధర్మం లేదు..పోరాటం లేదు
– చంద్రబాబు ఒంటరిగా ఎన్నికలకు  వెళ్లింది లేదు
– జేసీ భాష విని నవ్వుకుంటూ కూర్చున్నప్పుడు బాబు విజ్ఞత ఏమైంది?
–వైయస్‌ఆర్‌సీపీ ఆవిర్భావం నుంచి ఏ పార్టీతో పొత్తు పెట్టుకోలేదు

హైదరాబాద్‌: వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఆవిర్భావం నుంచి ఏ పార్టీతో పొత్తు పెట్టుకోలేదని పార్టీ సీనియర్‌ నాయకులు బాలశౌరి స్పష్టం చేశారు. ఒంటరిగా పోటీ చేసే సత్తా వైయస్‌ జగన్‌కు ఉందని వెల్లడించారు. చంద్రబాబు ఇంతవరకు ఒంటరిగా ఎన్నికలకు వెళ్లింది లేదన్నారు. కేసీఆర్‌ ఏదో అన్నారని చంద్రబాబు గింజుకుంటున్నారని, అదే జేసీ దివాకర్‌రెడ్డి భాష విని పబ్లిక్‌ మీటింగ్‌లో నవ్వుకుంటూ కూర్చున్నప్పుడు చంద్రబాబు విజ్ఞత ఏమైందని ప్రశ్నించారు. సోమవారం హైదరాబాద్‌లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో బాలశౌరి మీడియాతో మాట్లాడారు. 
ఉమ్మడి హైకోర్టు విభజనపై చంద్రబాబు సర్కార్‌ అఫిడవిట్‌ ఇచ్చిందని గుర్తు చేశారు. కేంద్రం డబ్బులిచ్చినా హైకోర్టు భవనాలు కట్టలేదన్నారు. హైకోర్టు భవన నిర్మాణంలో చంద్రబాబు పూర్తిగా విఫలమయ్యారని మండిపడ్డారు. ఇవాళ వేరేవాళ్లపై సాకులు చూపుతున్నారని విమర్శించారు. చంద్రబాబు చేసిన ధర్మా పోరాట దీక్షలో ధర్మం లేదు..పోరాటం లేదని ఎద్దేవా చేశారు. చెన్నైలో కరుణానిధి విగ్రహావిష్కరణ సభలో చంద్రబాబు పాల్గొన్నారని, ఆ సభకు సోనియాగాంధీ కూడా హాజరయ్యారన్నారు. ఆ సభలో ఆమె వైపు చూసి ఓ చిరునవ్వు నవ్వారన్నారు. ఏడాది క్రితం సోనియా గాంధీని ఇటలీ దయ్యం అన్న చంద్రబాబుకు ఈ మాటలు గుర్తు లేవా అని ప్రశ్నించారు. ఈ రోజు సోనియా గాంధీ చెవిలో ఏం చెప్పారో ప్రజలకు చెప్పాలన్నారు. ఆమె దయ్యామా? దేవతా? ఈ విషయంపై వివరణ ఇవ్వాలని డిమాండు చేశారు. నిన్న పొత్తుల విషయంలో చంద్రబాబు మాట్లాడిన మాటలను ఖండిస్తున్నామన్నారు. మేం ఏ పార్టీతో కూడా పొత్తు పెట్టుకోలేదన్నారు. ఇంతవరకు ఏ పార్టీతో కూడా పొత్తు పెట్టుకొని ఏకైక పార్టీ వైయస్‌ఆర్‌సీపీ అని గుర్తు చేశారు.

అధికారం కోసం చంద్రబాబు బీజేపీతో పొత్తు పెట్టుకొని ఏడాది ముందు ఆ పార్టీతో విడిపోయి కొత్తగా కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకుని మాకు నీతులు చెప్పడం సిగ్గు చేటు అన్నారు. మాకు స్వతంత్య్రంగా పోటీ చేసే సత్తా వైయస్‌ జగన్‌కు ఉందన్నారు. కేసీఆర్‌ తనను అనరాని మాటలు అన్నారని చంద్రబాబు గింజుకుంటున్నారన్నారు. ఆ భాషలో తేడా ఉండవచ్చు కానీ, భావం మాత్రం కరెక్టుగా చెప్పారన్నారు. పబ్లిక్‌ మీటింగ్‌ల్లో జేసీ దివాకర్‌రెడ్డి చేత ఎన్నిసార్లు వైయస్‌ జగన్‌ను తిట్టించింది గుర్తు లేదా? ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న నీవు ముసిముసినవ్వులు నవ్వుతూ కూర్చున్నావే? ఏ రోజైనా నీవు జేసీని కంట్రోల్‌ చేశావా అని మండిపడ్డారు. ముఖ్యమంత్రిగా ఉండే అర్హత నీకు లేదని హెచ్చరించారు. ఇదే చంద్రబాబు ఒక సభలో మా పార్టీ ఎమ్మెల్యే ఐజయ్య ప్రాజెక్టులు కట్టించింది వైయస్‌ రాజశేఖరరెడ్డి అంటే అప్పుడు మైక్‌ గుంజుకున్నావే..ఎందుకు జేసీ దివాకర్‌రెడ్డిని అడ్డుకోలేకపోయావని ప్రశ్నించారు. ఇలాంటి ధ్వందవైఖరీ అవలంభించడం సరికాదన్నారు.

ఇటీవల ఎన్‌టీఆర్, జయలలిత, వైయస్‌ రాజశేఖరరెడ్డి బయోపిక్‌ తీస్తున్నారని, అదే చంద్రబాబు బయోపిక్‌ తీయాల్సి వస్తే ఊసరవెళ్లి, మహానగరంలో మాయగాడు అన్న పేర్లు పెట్టాలన్న అభిప్రాయలు వ్యక్తమవుతున్నాయన్నారు. ఈ రోజు మాకు ఏ పార్టీతో పొత్తు పెట్టుకోవాలనే అవసరం లేదన్నారు. ఎల్లోమీడియా ద్వారా ప్రజలను తప్పుదోవ పట్టించాలనుకుంటే ఇక మీదట చెల్లవని, ప్రజలు ఇప్పటికే డిసైడ్‌ అయ్యారని చెప్పారు. నీ జిమ్ములు నమ్మే పరిస్థితిలో ఏపీ ప్రజలు లేరని పేర్కొన్నారు. ఇటీవల తెలంగాణలో జరిగిన ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌తో పొత్తు పెట్టుకునేందుకు వెంపర్లాడింది చంద్రబాబే అన్నారు.  ఏపీలో ఇరిగేషన్‌ ప్రాజెక్టులు, భూ సేకరణ ద్వారా సంపాదించిన వందల కోట్లు తెలంగాణ ఎన్నికల్లో ఖర్చు చేసినా చంద్రబాబును ప్రజలు తిరస్కరించారని తెలిపారు. మేం ఎవరితో పొత్తు పెట్టుకోవాలో చెప్పడానికి చంద్రబాబు ఎవరని ప్రశ్నించారు. మాపై బురద జల్లె ప్రయత్నం మానుకోవాలని హితవు పలికారు. 
 

Back to Top