'సుప్రీం' తీర్పును పునః సమీక్షించాలి

హైదరాబాద్, 14 జూలై 2013 :

పోలీసు లేదా జ్యుడీషియల్ కస్టడీలో ఉన్న వారు ఎన్నికల్లో పోటీ చేయడానికి అనర్హులంటూ సుప్రీంకోర్టు ఇటీవల వెలువరించిన తీర్పును పునః సమీక్షించాలని వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ విజ్క్షప్తి చేసింది. నేర చరిత్రులను ఎన్నికలలో పోటీకి అనర్హులను చేయాలన్న ఉద్దేశం మంచిదే అయినప్పటికీ అధికారంలో ఉన్న పార్టీలు దుర్వినియోగానికి పాల్పడేందుకు ఈ తీర్పు ద్వారా ఆస్కారం ఉందని పార్టీ కేంద్ర పాలక మండలి సభ్యుడు డాక్టర్‌ ఎం.వి. మైసూరారెడ్డి ఆందోళన వ్యక్తంచేశారు. ఎన్నికల సమయంలోనూ, నామినేషన్ల పర్వంలోనూ పోలీసు అధికారులు ఈ తీర్పును అడ్డం పెట్టుకుని నిజాయితీపరుల మీద కూడా కేసులు బనాయించే ప్రమాదం ఉందని ఆయన తెలిపారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆదివారం నిర్వహించిన మీడియా సమావేశంలో మైసూరారెడ్డి విలేకరులతో మాట్లాడారు. లొసుగులను సరిదిద్ది సక్రమమైన తీర్పును వెలువరించాల్సిన అవసరం ఉందన్నారు.

సుప్రీంకోర్టు ఈ నెల 11న ఇచ్చిన తీర్పును కూడా కాంగ్రెస్ ప్రభుత్వం వక్రీకరించి, దుర్వినియోగం చేసేందుకు పన్నాగం పన్నిందన్నారు. పోలీసు అధికారులు అధికార పార్టీకి అనుకూలంగా సుప్రీంకోర్టు తీర్పును దుర్వినియోగం చేసే అవకాశం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రజాస్వామ్యాన్ని మరింతగా పటిష్టం చేయడానికి తోడ్పడాలన్నారు. అయితే.. ప్రస్తుత తీర్పు అధికార పార్టీ అధికార దుర్వినియోగానికి పాల్పడి ప్రతిపక్షాలపైన, వాటి అభ్యర్థుల పైన తప్పుడు కేసులు బనాయించి రాజకీయంగా అణచివేసేందుకు ఉపయోగపడుతుందన్న ఆందోళనను మైసూరా వ్యక్తంచేశారు.

ఈ తీర్పు వల్ల నేరగాళ్ళు రాజకీయాల్లోకి, చట్ట సభల్లోకి రాకుండా ఉండేందుకు ఉపయోగపడకపోగా నిజాయితీపరులపై అక్రమ కేసులు పెట్టి ఇబ్బంది పెట్టేందుకు మార్గం వేసినట్లవుతుందని అన్నారు. అలా ఎవరి మీదనైనా అక్రమంగా కేసు బనాయించి అరెస్టు చేస్తే ఆ వ్యక్తి నామినేషన్‌ వేసే హక్కును కోల్పోతాడన్నారు. అధికార పార్టీకి వత్తాసు పలికేందుకు పోలీసు అధికారులు ఈ తీర్పును అనుకూలంగా అన్వయించుకునే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తంచేశారు. మంచివాళ్ళను జైలులో పెట్టేందుకు పోలీసు అధికారులకు స్వేచ్ఛ ఇవ్వడం మంచిది కాదని మైసూరా అభిప్రాయపడ్డారు.

స్థానిక సంస్థల ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అధికార దుర్వినియోగానికి పాల్పడుతు‌న్నదని, పంచాయతీ ఎన్నికలలో పోటీకి నామినేషన్‌ వేసిన వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ సర్పంచ్‌ అభ్యర్థులను ఆ పార్టీ నాయకులు బెదరిస్తున్నారని మైసూరారెడ్డి ఆరోపించారు. అధికారులను ఉపయోగించుకుని ఇతర పార్టీల సర్పంచ్‌ అభ్యర్థుల నామినేషన్లను ఉపసంహరించుకునేలా కాంగ్రెస్‌ పార్టీ బెదరించి వత్తిడులు చేస్తున్నట్లు తమ పార్టీ దృష్టికి వచ్చిందని ఆయన చెప్పారు. ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడే అధికారును శిక్షించాలని తాము ఎన్నికల అధికారులకు ఫిర్యాదు చేస్తామని మైసూరారెడ్డి తెలిపారు.

ప్రజా ప్రాతినిధ్య చట్టంలోని సెక్షన్‌ 62(5) కింద ఓటు హక్కుకు కొన్ని నిబంధనలకు లోబడి ఉండాలని మొన్నటి సుప్రీంకోర్టు తీర్పులో పేర్కొందని మైసూరారెడ్డి తెలిపారు. ఎవరైనా అరెస్టయి పోలీసు లేదా జ్యుడీషియల్‌ కస్టడీలో ఉంటే వారికి ఓటు హక్కు ఉండదని, అలాంటి వారికి సెక్షన్‌ 4, 5 ప్రకారం పోటీ చేసేందుకు అర్హులు కాదన్నారు. నేరపూరిత రాజకీయాలు తగ్గిపోవాలనే దాన్ని అన్ని రాజకీయ పార్టీలు హర్షిస్తాయని, ఆహ్వానిస్తాయని మైసూరారెడ్డి తెలిపారు. కానీ సుప్రీకోర్టు తీర్పును దుర్వినియోగం చేసే అవకాశం ఉందని రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాలు, ఇతరత్రా అనుమానాలు ఉన్నాయన్నారు.

కోర్టులో విచారణ నడుస్తున్నప్పడు విచారణకు అడ్డు రాకుండా ఉండాలని చెప్పి ఎఫ్ఐఆర్‌ నమోదు చేసిన తరువాత ఎవరినైనా అరెస్టు చేయవచ్చని మైసూరారెడ్డి అన్నారు. అంత మాత్రం చేత ఏ తప్పిదమూ లేని వ్యక్తిని ఎన్నికల ప్రక్రియలో పాల్గొనకుండా నిరోధించడం సరికాదని మైసూరారెడ్డి అన్నారు.

Back to Top