అసెంబ్లీని వెంటనే సమావేశపరచాలి

హైదరాబాద్, 26 సెప్టెంబర్ 2013:

అసెంబ్లీని వెంటనే సమావేశపరిచి, సమైక్యాంధ్రకు మద్దతుగా తీర్మానం పెట్టాలని స్వయంగా కలిసి విజ్ఞప్తి చేసేందుకు అనుమతించాలని వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు శ్రీ జగన్మోహన్‌రెడ్డి గవర్నర్‌ ఈఎస్‌ఎల్‌ నర్శింహన్‌కు ‌లేఖ రాశారు. ఇదే విషయమై సిఎంకు కూడా లేఖ రాయాలని పార్టీ నిర్ణయించింది. సమైక్య తీర్మానం ఆమోదం పొందిన తరువాతే తమ రాజీనామాలు ఆమోదింపజేసుకోవాలని పార్టీ శాసనసభా పక్షం ఉపనాయకురాలు భూమా శోభా నాగిరెడ్డి తెలిపారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో  పార్టీ ఎమ్మెల్యేలు జి. శ్రీకాంత్‌రెడ్డి, కొరముట్ల శ్రీనివాసులు, కాపు రామచంద్రారెడ్డి, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, నాయకులు ప్రవీణ్‌కుమార్‌రెడ్డి, కాటసాని రామిరెడ్డి తదితరులతో కలిసి గురువారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. అసెంబ్లీని వెంటనే సమావేశపరచాలని, సమైక్యాంధ్రకు మద్దతుగా తీర్మానం పెట్టాలని ఈ మధ్యనే జరిగిన వైయస్ఆర్‌ కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో కూడా‌ తీర్మానించిన వైనాన్ని శోభా ప్రస్తావించారు.

రాష్ట్ర విభజన విషయంలో టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు, ముఖ్యమంత్రి కిరణ్‌ కుమార్‌రెడ్డి, పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ తమ విధానం ఏమిటో స్పష్టం చేయాలని శోభా నాగిరెడ్డి డిమాండ్‌ చేశారు. ఈ విషయంలో దొంగలెవరో, సమైక్యాంధ్ర కోసం ఎవరు నిజాయితీగా ఉన్నారో అసెంబ్లీ సాక్షిగా తేలిపోతుందని ఆమె వ్యాఖ్యానించారు.

విభజన ప్రక్రియను ఒక వైపున కొనసాగిస్తూనే.. మరో వంక రాజీనామాలు చేయవద్దంటూ కాంగ్రెస్‌ పార్టీ చెబుతోందని శోభా నాగిరెడ్డి విమర్శించారు. సమైక్యాంధ్ర కోసం ఎవరూ తొందరపడి రాజీనామాలు చేయవద్దని చెబుతున్న కిరణ్‌కుమార్‌రెడ్డి విభజన ప్రక్రియను ఏ విధంగానూ నిలువరించలేకపోతున్నారని ఎద్దేవా చేశారు. ఒక పక్కన విభజన నోట్‌ తయారైపోతోందని కేంద్రం మంత్రులు అధికారికంగానే చేబుతున్నారని, ఆ ప్రాసెస్‌ను ఆపడానికి ప్రయత్నాలు జరగడంలేదని, ఆగడం లేదని శోభా నాగిరెడ్డి వ్యాఖ్యానించారు. అధిష్టానం ఏ నిర్ణయం తీసుకున్నా కట్టుబడి ఉంటానని చెప్పిన సిఎం కిరణ్‌ ఇప్పుడు తాను సమైక్యవాదిని అంటూ కొత్త పల్లవి పాడుతున్నారని ఆరోపించారు. సిఎం కిరణ్‌ కుమార్‌ రెడ్డి కేంద్రాన్ని ముందే నిలదీసి ఉంటే విభజన నిర్ణయం జరిగేది కాదన్నారు. ముఖ్యమంత్రిలా ఆయన వ్యవహరించడంలేదని శోభా నాగిరెడ్డి ఎద్దేవా చేశారు. కిరణ్‌కుమార్‌ రెడ్డి ఆడే డ్రామాలు ప్రజలకు అర్థం కావడంలేదనుకుంటున్నారా? అని ప్రశ్నించారు.

రాష్ట్ర విభజనను తాము ఆపలేమని ఆనాడే కాంగ్రెస్‌ నాయకులు చెప్పి ఉంటే సమైక్య ఉద్యమాన్ని ప్రజలు అప్పుడే చేసి ప్రక్రియ జరగకుండా నిలువరించుకుని ఉండేవారని శోభా నాగిరెడ్డి అన్నారు. విభజన జరగనీయం అని చెబుతూ కాంగ్రెస్‌ నాయకులు ప్రజలందరినీ మోసగించారని ఆమె ఆరోపించారు. కేబినెట్‌లో నోట్‌ తయారై రాష్ట్రానికి వచ్చేంత వరకూ ఎందుకు ఆగాలని ప్రశ్నించారు. సమైక్యాంధ్ర కోసం ఎవరు నిజాయితీగా కృషి చేస్తున్నారు.. ఎవరు డ్రామాలాడుతున్నారో ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉందన్నారు. రాష్ట్ర విభజనకు కారణం కాంగ్రెస్‌ పార్టీ అయితే.. విభజన చేయమని లేఖ ఇచ్చింది చంద్రబాబు నాయుడు అని శోభా నాగిరెడ్డి అన్నారు. వీళ్ళిద్దరే దొంగలని మళ్ళీ వీళ్ళే దొంగా.. దొంగా అని అరుస్తున్నారన్నారు.

సమైక్యాంధ్రకు మద్దతుగా అందరి కంటే ముందుగా స్పందించిన పార్టీ వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ అని శోభా నాగిరెడ్డి స్పష్టంచేశారు. ఎన్జీవోలు డిమాండ్‌ చేయక ముందే రాజీనామాలు చేసిన పార్టీ వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ అని గుర్తుచేశారు. సమైక్యాంధ్రకు మద్దతుగా ఇంతవరకూ ఏ పార్టీ అధ్యక్షుడూ రాజీనామా చేయలేదని, అయితే.. వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు శ్రీ జగన్మోహన్‌రెడ్డి, గౌరవ అధ్యక్షురాలు శ్రీమతి విజయమ్మ తమ పదవులకు రాజీనామా చేసిన వైనాన్ని ప్రస్తావించారు. రాజీనామాలే కాకుండా వారం రోజుల పాటు సమైక్యాంధ్రకు మద్దతుగా వారిద్దరూ నిరవధిక నిరాహార దీక్షలు కూడా చేశారన్నారు. అలాంటి తమ పార్టీని ప్రశ్నించే హక్కు ఏ రాజకీయ పార్టీకీ లేదన్నారు.

రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలంటే.. సమర్థవంతుడైన నాయకుడు కావాలని.. అలాంటి నాయకుడు శ్రీ జగన్మోహన్‌రెడ్డే అని ప్రజలంతా నమ్ముతున్నారని శోభా అన్నారు. అందుకే ఆయనకు ప్రజలు అంతగా నీరాజనాలు పలుకుతున్నారన్నారు. గవర్నర్‌ అనుమతి రాగానే శ్రీ జగన్మోహన్‌రెడ్డితో పాటు పార్టీ నాయకులు కూడా వెళ్ళి సమైక్యాంధ్ర తీర్మానం కోసం డిమాండ్‌ చేస్తామన్నారు. పార్టీ అధ్యక్షుడు శ్రీ జగన్మోహన్‌రెడ్డి, మరో ఎం.పి. మేకపాటి రాజమోహన్‌రెడ్డి తమ పదవులకు రాజీనామాలు చేయడమే కాకుండా రాజమోహన్‌రెడ్డి ఢిల్లీ వెళ్ళి లోక్‌సభ స్పీకర్‌ను కలిసి రాజీనామాలను ఆమోదించాలని డిమాండ్‌ చేశారన్నారు.

చంద్రబాబు నాయుడు తెలంగాణ టిడిపి నాయకులతో ఒక మాట, సీమాంధ్ర నాయకులతో మరో మాట మాట్లాడిస్తున్నారని, రెండు ప్రాంతాల నాయకులను ఢిల్లీ తీసుకువెళ్ళి డ్రామాలాడుతున్నారని శోభా నాగిరెడ్డి ఒక మీడియా ప్రతినిధి ప్రశ్నకు సమాధానం ఇచ్చారు. ఒక పార్టీ అధ్యక్షుడిగా చంద్రబాబు నాయుడు‌ విధానం ఏమిటో తెలియాలన్నారు. అసెంబ్లీ తీర్మానం తరువాత అన్ని పార్టీల ప్రజాప్రతినిధులు ఇచ్చిన రాజీనామాలను ఆమోదింపచేసుకోవాలని ఆమె అన్నారు. అందుకే తాము అసెంబ్లీని సమావేశపరచాల‌ని డిమాండ్ చేస్తున్నామన్నారు. కొన్ని వేల మంది ఉద్యోగులు తమ జీతాలు, జీవితాలను పణంగా పెట్టి రోడ్ల మీదికి వచ్చి, సమైక్యాంధ్ర కోసం ఉద్యమిస్తుంటే.. కేంద్రం నోట్‌ రావాలంటూ కాంగ్రెస్‌ నాయకులు, కేంద్ర, రాష్ట్ర మంత్రులు, సిఎం ఇంకా తాత్సారం చేస్తూ.. అధికారం అనుభవిస్తున్నారని విమర్శించారు. రాష్ట్ర విభజన కోసం చంద్రబాబు ఇచ్చిన లేఖను వెనక్కి తీసుకోవాలని సమైక్యాంధ్ర జెఎసి డిమాండ్‌ చేయాలని శోభా నాగిరెడ్డి పిలుపునిచ్చారు.

Back to Top