విద్యుత్‌ ఛార్జీలతో సామాన్యుల గుండె ఆగిపోతోంది

హైదరాబాద్, 12 జనవరి 2013: విద్యుత్‌ ఛార్జీల భారంతో రాష్ట్ర ప్రజల గుండె ఆగిపోతోందని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఆవేదన వ్యక్తం చేసింది. మూడు సంవత్సరాల్లో రాష్ట్ర ప్రజలపై రూ. 32 వేల కోట్ల భారాన్ని కాంగ్రెస్‌ ప్రభుత్వం మోపిందని ఆందోళన వ్యక్తం చేసింది. సంక్రాంతి పండుగ పేరుతో ప్రజల నుంచి ప్రైవేటు బస్సుల కన్నా ఎక్కువగా ఆర్టీసీ దోపిడీ చేస్తోందని దుయ్యబట్టింది. ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్న కాంగ్రెస్‌ ప్రభుత్వానికి ప్రజలు గుణపాఠం చెప్పే రోజు త్వరలోనే వస్తుందని హెచ్చరించింది. వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ శాసన సభా పక్షం ఉప నాయకురాలు భూమా శోభా నాగిరెడ్డి శనివారం పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో‌ ఛార్జీల భారం మోపుతున్న కిరణ్ ప్రభుత్వం తీరుపైన, దానిని పైకి విమర్శిస్తూనే పరోక్షంగా మద్దతు ఇస్తున్న చంద్రబాబు నాయుడిపైన విమర్శనాస్త్రాలు సంధించారు.

ఛార్జీలు పెంచే హక్కు కిరణ్‌ ప్రభుత్వానికి లేదు:
ప్రజలకు సౌకర్యాలు కల్పించలేని రాష్ట్ర ప్రభుత్వానికి చార్జీలు పెంచే హక్కు ఎక్కడ ఉందని శోభా నాగిరెడ్డి నిలదీశారు. సొంత ఊళ్ళు వెళ్ళి తమ కుటుంబాలతో కలిసి ఆనందంగా గడుపుదామనుకున్న ప్రజలకు కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రభుత్వం సంక్రాంతి పండుగ సంతోషం లేకుండా చేసిందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఆర్టీసీ ప్రభుత్వ సంస్థా? లేక ప్రైవేటు సంస్థా అర్థం కావడంలేదన్నారు. బస్సు టిక్కెట్ల కోసం క్యూలో నిలబడిన ప్రజలపై పోలీసులతో లాఠీ చేయించే దుర్మార్గానికి కిరణ్‌ ప్రభుత్వం ఒడిగట్టిందని శోభా నాగిరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఏదైనా పండుగ వస్తుందంటే చాలు కాంగ్రెస్‌ ప్రభుత్వం ప్రజలపై విద్యుత్, గ్యాస్‌, బస్సు ఛార్జీల ధరలు ఇలా ఏదో ఒకటి పెంచేసి ప్రజలను ఇబ్బందుల పాలు చేస్తోందని ఆమె దుయ్యబట్టారు. టోల్‌ ప్లాజాల వద్ద కిలో మీటర్ల మేర ట్రాఫిక్‌ నిలిచిపోయిన దుస్థితి శనివారం నెలకొన్న వైనాన్ని శోభా నాగిరెడ్డి వెల్లడించారు.

రాష్ట్ర ప్రజలను కష్టపెడుతూ, వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీని సింగిల్‌ డిజిట్‌కు దిగజార్చాలని కిరణ్‌ కుమార్‌రెడ్డి కంకణం కట్టుకున్నట్లున్నారని శోభా నాగిరెడ్డి ఎద్దేవా చేశారు. రకరకాల ఛార్జీలు పెంచుతున్న ప్రభుత్వం తీరు చూస్తుంటే ఆరిపోయే ముందు ఎక్కువగా వెలిగే దీపం చందంగా ఉందని ఆమె అభివర్ణించారు. ఐదేళ్ళు పరిపాలించిన దివంగత మహానేత డాక్టర్‌ వైయస్‌ రాజశేఖరరెడ్డి ఒక్క నయాపైస కూడా ఛార్జీలు పెంచని వైనాన్ని ఈ సందర్భంగా శోభా నాగిరెడ్డి ప్రస్తావించారు. మహానేత వైయస్‌ఆర్‌ తామే గొప్పగా పరిపాలిస్తున్నామంటూ గొప్పలు చెప్పుకుంటున్న కాంగ్రెస్‌ పాలకులు రాష్ట్ర ప్రజలను ఎందుకు ఇబ్బందుల పాలు చేస్తున్నారో తెలియడంలేదన్నారు.

వనరులున్నా వినియోగించుకోని ప్రభుత్వం:
రాష్ట్రంలో సహజ వనరులు పుష్కలంగా ఉన్నా వాటిని వినియోగించుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం దారుణంగా విఫలమైందని శోభా నాగిరెడ్డి ఆరోపించారు. పైపెచ్చు తన చేతగానితనాన్ని పక్కన పెట్టేసి రాష్ట్ర ప్రజలపై ఛార్జీల పెంపుతో ఆర్థిక భారం వేయడమేమిటని ఆమె సూటిగా ప్రశ్నించారు. వేల కోట్ల రూపాయల భారం ప్రజలపై వేసే ప్రభుత్వం సౌకర్యాలు ఎందుకు కల్పించడం లేదని నిలదీశారు. విద్యుత్‌ ఛార్జీల భారం వేయాలని చూస్తున్న కిరణ్‌ ప్రభుత్వ హయాంలో గ్రామాల్లో రోజుకు 16 గంటలు విద్యుత్‌ సరఫరా లేకుండా చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యుత్‌ సరఫరా లేక చిన్న పరిశ్రమలు మూతపడుతున్నాయని ఆయె ఆవేదన వ్యక్తం చేశారు. విద్యుత్‌ ఛార్జీల విషయంలో నాన్‌ టెలిస్కోపిక్‌ విధానాన్ని తీసుకురావాలని కిరణ్‌ ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోందని శోభా నాగిరెడ్డి తెలిపారు.

ఆరు సిలిండర్లే ఎలా సరిపోతాయి?:
సంవత్సరానికి ఒక్కో కుటుంబానికి కేవలం 6 వంట గ్యాస్‌ సిలిండర్లే సరఫరా చేయాలన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని శోభా నాగిరెడ్డి ఈ సందర్భంగా ప్రశ్నించారు. ఆరు సిలిండర్లకు పైబడి వాడిన వారికి గ్యాస్‌ సిలిండర్ ధర‌ విపరీతంగా పెంచిన వైనాన్ని ఆమె నిలదీశారు. కేంద్ర మంత్రి చిరంజీవో, సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి లాంటి వారో అధిక ధరతో సిలిండర్‌ కొనుగోలు చేయవచ్చేమో గాని రోజూ కూలి పని చేయకపోతే డొక్కాడని వారు ఏ విధంగా కొనుక్కోగరలో ఆలోచన చేయాలన్నారు. ఆరు సిలిండర్లతో ఏడాది పాటు కిరణ్‌కుమార్‌రెడ్డి గడుపుతారా అని వైయస్‌ఆర్‌సిపి గౌరవ అధ్యక్షురాలు శ్రీమతి వైయస్‌ విజయమ్మ పాదయాత్రలో నిలదీసిన విషయాన్ని ఈ సందర్భంగా శోభా నాగిరెడ్డి గుర్తుచేశారు. ఎస్సీ, ఎస్టీ కాలనీల్లో ఒక్కరు విద్యుత్‌ బిల్లు చెల్లించలేకపోయినా మొత్తం కాలనీకే సరఫరాను నిలిపివేసి కిరణ్‌ ప్రభుత్వం వేధిస్తోందని దుయ్యబట్టారు.

కాంగ్రెస్‌ పార్టీ ఏ ముఖంతో ప్రజల వద్దకు వస్తుంది?:
గ్యాస్‌, విద్యుత్, బస్సు, డీజిల్‌ ఛార్జీలు పెంచిన కాంగ్రెస్‌ ప్రభుత్వం వచ్చే ఎన్నికల్లో ఓట్లు వేయమని ఏ ముఖం పెట్టుకుని ప్రజల వద్దకు వెళ్తుందని శోభా నాగిరెడ్డి విమర్శించారు. కాంగ్రెస్‌ ప్రభుత్వానికి ప్రజలు బుద్ధి చెప్పే రోజు త్వరలోనే తప్పకుండా వస్తుందని ఆమె అన్నారు.

చంద్రబాబూ డ్రామాలు కట్టిపెట్టు:
ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్న కిరణ్‌ ప్రభుత్వం ఒక్క గంట కూడా అధికారంలో ఉండడానికి వీల్లేదని పాదయాత్రల్లో చెబుతున్న చంద్రబాబు నాయుడు అదే ప్రభుత్వాన్ని పరోక్షంగా నిలబెట్టడం లేదా అని శోభా నాగిరెడ్డి ప్రశ్నించారు. పైకో మాట చెప్పి లోన మరొకటి చేసే డ్రామాలను చంద్రబాబు కట్టిపెట్టాలని ఆమె హితవు పలికారు. చంద్రబాబు మాటలను ప్రజలు నమ్మే పరిస్థితి ఎంతమాత్రమూ లేదన్నారు. ఈ ప్రభుత్వం కూలిపోతే వైయస్‌ఆర్‌సిపి అధినేత శ్రీ జగన్మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి అవుతారన్న భయంతోనే కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని చంద్రబాబు కాపాడుతున్నారని ఒక మీడియా ప్రతినిధి ప్రశ్నకు శోభా సమాధానం చెప్పారు.

ఛార్జీలు తగ్గించండి: వైయస్‌ఆర్‌సిపి డిమాండ్‌:
పెంచిన ఛార్జీలను తగ్గించాలని ప్రభుత్వాన్ని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ తరఫున శోభానాగిరెడ్డి డిమాండ్‌ చేశారు. విద్యుత్‌ ఛార్జీలను తగ్గించకపోతే కాంగ్రెస్‌ పార్టీకి కోలుకోలేని దెబ్బ తప్పదని ఆమె హెచ్చరించారు. వైయస్‌ఆర్‌సిపిని నమ్మకపోవడం అంటే తనను తాను నమ్మకపోవడమే అవుతుందని ఒక ప్రశ్నకు జవాబు చెప్పారు. వైయస్‌ఆర్‌సిపి తమదే అని తాము పూర్తిగా భావిస్తున్నామన్నారు. వైయస్‌ఆర్‌సిపితో తమకు మానసిక సంబంధం ఉందన్నారు. శ్రీ జగన్‌ ఏ నిర్ణయం తీసుకున్నా తాము సంతోషంగా స్వీకరిస్తామని మరో ప్రశ్నకు బదులిచ్చారు. చివరికి ఆళ్ళగడ్డ నుంచి తనను పోటీలో ఉండొద్దని ఆదేశించినా శ్రీ జగన్‌ కోసం ఆనందంగా తప్పుకుంటానన్నారు. సహకార సంఘాల ఓటర్ల నమోదును కాంగ్రెస్‌ పార్టీ ఏకపక్షంగా చేసిందని శోభా నాగిరెడ్డి ఒక ప్రశ్నకు సమాధానం చెప్పారు. స్థానిక ఎన్నికలు నిర్వహించేందుకు కాంగ్రెస్‌ ప్రభుత్వం భయపడుతోందని ఎద్దేవా చేశారు.

మీడియా సమావేశంలో ముందుగా వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ తరఫున రాష్ట్ర ప్రజలకు శోభా నాగిరెడ్డి సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు.
Back to Top