షర్మిల పాదయాత్ర రాజకీయాల్లో చారిత్రక ఘట్టం

హైదరాబాద్, 23 మార్చి 2013 : చంద్రబాబు పాదయాత్రతో ప్రజలకు ఎలాంటి ప్రయోజనం లేదని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీకి చెందిన తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌రెడ్డి అన్నారు. గత మూడున్నరేళ్ళుగా రాష్ట్రంలో పరిపాలన కొనసాగిస్తున్న ప్రజాకంటక ప్రభుత్వానికి మద్దతుగా నిలిచి బాధ్యతాయుతంగా వ్యవహరించకుండా, ప్రతిపక్ష పాత్ర పోషించకుండా, అడుగడుగునా ఈ ప్రజా వ్యతిరేక ప్రభుత్వానికి చంద్రబాబు నాయుడి పార్టీ టిడిపి కొమ్ముకాస్తున్నదని ఆయన విమర్శించారు. మన రాష్ట్రాన్ని అధోగతికి తీసుకువెళుతున్న కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రభుత్వానికి వత్తాసు పలుకుతూ.. దాన్ని నిలబెట్టడమే లక్ష్యంగా పనిచేస్తున్నదన్నారు. ఆ రెండు పార్టీల విధానాలను ఎండగడుతూ, వాటి బాధ్యతా రాహిత్య చర్యలకు నిరసనగా శ్రీమతి షర్మిల చారిత్రక సుదీర్ఘమైన మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర చేస్తున్నారన్నారు. ప్రపంచ రాజకీయ యవనికలోనే ఒక మహిళ ఇంతవరకూ చేయలేని ఇంత పెద్ద సాహసం చేసి, ప్రజల ఆదరాభిమానాలు చూరగొంటూ రేపటికి శ్రీమతి షర్మిల వంద రోజుల మరో ప్రజాప్రస్థానం పాదయాత్రను పూర్తిచేసి రికార్డు సృష్టిస్తున్నారని అన్నారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో భూమన శనివారం మధ్యాహ్నం మీడియాతో మాట్లాడారు. శ్రీమతి షర్మిల పాదయాత్ర రాజకీయాల్లో చారిత్రక ఘట్టంగా నిలుస్తుందని ఆయన అభివర్ణించారు.

మహానేత డాక్టర్‌ వైయస్‌ రాజశేఖరరెడ్డి చేసిన ప్రజాప్రస్థానాన్ని స్ఫూర్తిగా తీసుకుని శ్రీమతి షర్మిల మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర చేస్తున్నారని ఆయన చెప్పారు. ప్రజల కష్టసుఖాలను శ్రీమతి షర్మిల తెలుసుకుంటూ పాదయాత్ర సాగిస్తున్నారని భూమన తెలిపారు. ఐదేళ్ళపాటు ప్రజారంజకంగా పరిపాలన చేసి, ప్రజలకు అనుకూల నిర్ణయాలు తీసుకుంటూ అభివృద్ధి, సంక్షేమాలను రెండు కళ్ళుగా పరిపాలన సాగించి ప్రజలందరి చేత దేవుడిగా జేజేలందుకున్న మహానేత తనయ శ్రీమతి షర్మిల ఈ పాదయాత్రను కొనసాగిస్తున్నారన్నారు. 2003లో మహానేత పాదయాత్రకు ప్రజల నుంచి వచ్చినంగానే శ్రీమతి షర్మిల పాదయాత్రకు ఆదరాభిమానాలు వస్తున్నాయన్నారు.

ప్రజలకు ఒక దిశ, దశా నిర్దేశించగల సత్తా ఒక్క శ్రీ వైయస్‌ జగన్మోహన్‌రెడ్డిని అన్యాయంగా, అక్రమంగా జైలులో నిర్బంంధించి, రాక్షసానందం పొందుతున్న కాంగ్రెస్‌, టిడిపిల చర్యలకు నిరసనగా శ్రీమతి షర్మిల పాదయాత్ర కొనసాగుతోందని భూమన పేర్కొన్నారు. శ్రీమతి షర్మిల పాదయాత్ర ప్రజలందరి జేజేలు, నీరాజనాలు అందుకుంటూ అప్రతిహతంగా కొనసాగుతోందన్నారు.

మహానేత తనయుడు తన రక్తంలోని ఆవేశం వల్ల, తన వ్యక్తిత్వంలోని ఔన్నత్యం వల్ల, తన వాక్కులోని పదును వల్ల ప్రజలందరి అభిమానాన్ని చూరగొని, ఏ ఒక్క రోజున కూడా అధికారంలో లేకపోయినా ప్రజలకు ఇచ్చిన వాగ్దానం మేరకు ఓదార్పు చేయడానికే సోనియా ఆదేశాలను ధిక్కరించారన్నారు. అందుకు ఆయన మీద కక్ష పూరితంగా కాంగ్రెస్‌ పార్టీ వ్యవహరిస్తోందని దుయ్యబట్టారు. ఈ కుట్రలను ప్రజలంతా తీవ్రంగా అసహ్యించుకుంటున్నారన్నారు. శ్రీ జగన్‌ను జనంలోకి రానివ్వకుండా చేసినందుకు నిరసనగా అన్న ఆశయాలను, లక్ష్యాలను పుణికిపుచ్చుకుని శ్రీమతి షర్మిల ప్రజల కోసం నేనున్నానంటూ పాశుపతాస్త్రంగా జనంలోకి వచ్చారన్నారు.

ఇప్పటికి 1,374 కిలోమీటర్ల దూరాన్ని ఆమె నడిచారన్నారు. మొత్తం 43 మున్సిపాల్టీలు, మూడు కార్పొరేషన్లు, 700 గ్రామాలు నడిచారన్నారు. దాదాపు 75 లక్షల మంది శ్రీమతి షర్మిలతో పాటు పాదయాత్రలో ప్రత్యక్షంగా పాల్గొన్నారని వివరించారు. రేపటికి వంద రోజులు పూర్తవుతున్నది ఒక మైలు రాయి మాత్రమే అని, మరిన్ని మైలురాళ్ళను ఆమె దాటుతారన్నారు. మూడువేల కిలోమీటర్ల పాదయాత్రను దిగ్విజయవంతంగా పూర్తిచేస్తారన్నారు. జగనన్న నేతృత్వంలో భవిష్యత్తులో మహానేత రాజన్న సువర్ణ రాజ్యం వస్తుందని, అందరి బతులకు బాగవుతాయని భరోసా కల్పిస్తూ శ్రీమతి షర్మిల పాదయాత్ర కొనసాగుతుందన్నారు.

రైతుల కన్నీరు పట్టించుకోకుండా చంద్రబాబు పాదయాత్ర కొనసాగిస్తున్నారని భూమన ఆక్షేపించారు. ఆయన యాత్ర రసహీన యాత్రగా, సాయంకాలపు వాహ్యాళిగా మిగిలిపోతుందని ఎద్దేవా చేశారు. ప్రజల కష్టాలు కడగండ్లు చూడకుండా అర్ధరాత్రి వరకూ చేస్తున్న చంద్రబాబు పాదయాత్ర వల్ల ఎలాంటి ఉపయోగమూ లేదన్నారు.
Back to Top