రైతు సమస్యలపై ఉద్యమం తీవ్రతరం

హైదరాబాద్, 12 డిసెంబర్ 2012:

రాష్ట్రంలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై ఉద్యమించాలని నిర్ణయిస్తూ వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమావేశం తీర్మానించింది. పార్టీ కేంద్ర కార్యాలయంలో బుధవారం విస్తృత స్థాయి సమావేశం ఏర్పాటైంది. ఈ సమావేశంలో పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ముఖ్యనేతలు పాల్గొన్నారు. సమావేశానంతరం పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సమన్వయ కర్త కొణతాల రామకృష్ణ, పార్టీ నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు విలేకరులతో మాట్లాడారు.

    నీలం తుపాను సహాయక చర్యల్లో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది. బాధిత రైతులకు, ప్రజలకు పునరావాసం కల్పించడంలోనూ నిర్లక్ష్యం చూపిందని పార్టీ ధ్వజమెత్తింది. పంటలు నష్టపోయిన రైతులకు రుణాలు, సబ్సిడీలు ఇవ్వడంలేదని విమర్శించింది. రాష్ట్రంలో 20 లక్షల మంది రైతులు ఉంటే 5 లక్షల మందికే రుణ కార్డులు ఇచ్చారని కొణతాల చెప్పారు. అందులో కేవలం లక్ష మంది రైతులకు మాత్రమే రుణాలు ఇవ్వాలని ప్రభుత్వం చూస్తోందన్నారు.

   భీభత్సం సృష్టించిన నీలం తుపానులో పంట నష్ట పోయిన కౌలు రైతులను ఆదుకోవడంలోనూ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందనీ కొణతాల విమర్శించారు. వారికి రుణాలు, సబ్సిడీలు ఇవ్వడంలేదన్నారు. రైతులకు పావలా వడ్డీ రుణాలు ఇస్తామని హామీ ఇచ్చిన కిరణ్ కుమార్ రెడ్డి అమలులో మాత్రం నిలబెట్టుకోలేదన్నారు. వ్యవసాయం దండగన్న ప్రతిపక్ష నేత చంద్రబాబు అడుగుజాడల్లో కిరణ్ నడుస్తున్నారని కొణతా ధ్వజమెత్తారు. ప్రభుత్వ నిర్లక్ష్యం రైతుల పాలిట శాపంగా మారిందన్నారు. ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లును పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యుడిగా శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి నియమించారని కొణతాల చెప్పారు.

సహకార ఎన్నికల్లో అర్హులందరికీ సభ్యత్వం ఇవ్వాలి


     సహకార ఎన్నికల సభ్యత్వ నమోదులో ప్రభుత్వం నిష్పక్షపాతంగా వ్యవహరించాలని కొణతాల రామకృష్ణ డిమాండ్ చేశారు. అర్హులందరికీ సభ్యత్వం ఇచ్చేలా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి చర్యలు తీసుకోవాలన్నారు. రాష్ర్టంలోని సహకార సంఘాల కార్యాలయాల్లో అధికారులు అందుబాటులో ఉండటంలేదన్నారు. దాంతో సభ్యత్వం కోసం వెళ్లిన అర్హులందరూ నిరాశతో వెళ్లిపోతున్నారని అన్నారు. అధికారులు ఉన్నచోట ప్రజలకు సహకరించడంలేదన్నారు. సహకార ఎన్నికలను నిర్వీర్యం చేసే విధంగా ప్రభుత్వం వ్యవహరిస్తోందన్నారు.

రవిశంకర్‌కు నివాళులు

     ప్రముఖ సితార్ విద్వాంసుడు పండిట్ రవిశంకర్ మరణం దేశానికి తీరని లోటని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పేర్కొంది. పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన విస్తృత స్థాయి సమావేశంలో నివాళులు అర్పిస్తూ తీర్మానం చేసింది.

Back to Top