రైతన్నకు ఏం చేశారని మీ సంబరాలు?

హైదరాబాద్‌, 5 ఫిబ్రవరి 2013: రాష్ట్రంలోని రైతులకు మీరేం ఒరగబెట్టారని సంబరాలు చేసుకుంటున్నారని కిరణ్ కుమార్‌రెడ్డి సారథ్యంలోని కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని వైయస్‌ఆర్‌సిపి గౌరవ అధ్యక్షురాలు శ్రీమతి వైయస్‌ విజయమ్మ నిలదీశారు. సహకార సంఘాలకు తాజాగా జరిగిన ఎన్నికలు అప్రజాస్వామికంగా, అధికార దుర్వినియోగానికి పరాకాష్టగా జరిగాయని ఆమె విమర్శించారు. ప్రజాస్వామ్య కోణం ఏమాత్రం లేని ఈ ఎన్నికలు రైతు శ్రేయస్సును ఉద్దేశించినవి కావని శ్రీమని విజయమ్మ అభిప్రాయపడ్డారు. కేవలం కాంగ్రెస్‌ పార్టీ గెలిచిందని చెప్పుకునేందుకు మాత్రమే వీటి ప్రయోజనం అని ఆమె వ్యాఖ్యానించారు. సహకార ఎన్నికలలో కాంగ్రెస్‌ పార్టీ విజయం సాధించిందని సిఎం కిరణ్‌ ఢిల్లీ పెద్దలకు చెప్పుకుని మురిసిపోవడాన్ని శ్రీమతి విజయమ్మ మంగళవారం విడుదల చేసిన పత్రికా ప్రకటనలో ఎద్దేవా చేశారు.

సహకార సంఘాల్లో సభ్యత్వ నమోదు మొదలు ఎన్నికలు జరిగేంత వరకూ అధికార కాంగ్రెస్‌ అంతులేని అక్రమాలకు పాల్పడిందని శ్రీమతి విజయమ్మ ఆరోపించారు. అయితే, సహకార ఎన్నికల్లో అత్యధిక స్థానాల్లో కాంగ్రెస్‌ గెలిచిందని ఆ పార్టీ నాయకులు గొప్పలు చెప్పుకుంటూ, ఢిల్లీ స్థాయిలో నివేదికలు ఇచ్చి సంబరపడుతున్నారని ఆమె విమర్శించారు. రాష్ట్రంలోని సహకార సంఘాల్లో 39 లక్షల మంది సభ్యులుండగా వారిని కాంగ్రెస్‌ నాయకులు 51 లక్షలకు పెంచుకున్న వైనాన్ని శ్రీమతి విజయమ్మ తన ప్రకటనలో ప్రస్తావించారు. తమ వందిమాగధులకు మాత్రమే సొసైటీల్లో స్థానం కల్పించుకున్నారని తెలిపారు.

విపక్షాల సభ్యులు ఓట్ల నమోదు కోసం వెళితే కనీసం సభ్యత్వ పుస్తకాలు కూడా ఇవ్వలేదని ఆమె ఆరోపించారు. తమ ఓట్లు ఏవి అని అడిగిన రైతులపై కాంగ్రెస్‌ నాయకులు కేసులు కూడా పెట్టి వేధించారని విమర్శించారు. తమ పార్టీ అభ్యర్థులు తప్పకుండా ఓడిపోతారనుకున్న 150 సొసైటీల ఎన్నికలను వాయిదా వేయించిన విషయాన్ని శ్రీమతి విజయమ్మ పేర్కొన్నారు. ఇలా మీరు ఇన్ని అక్రమాలు, అవకతవకలకు పాల్పడి తర్వాత కూడా వాటిని ఎన్నికలని, వాటిలో విజయం సాధించామని ఎలా మురిసిపోతారని శ్రీమతి విజయమ్మ ప్రశ్నించారు.

800 శాతం వరకూ పెరిగిన ఎరువుల ధరలు, జాడే లేని వడ్డీ లేని రుణాలు, పంటకు గిట్టుబాటు ధర లభించని తీరు, విద్యుత్‌ లేక ఎండిపోయిన పంటలు, ఇష్టానుసారంగా పెరిగిపోతున్న డీజిల్ ధరలను చూసి అన్నదాత ఆనందంతో మీకు ఓట్లు వేశారని సంబరపడుతున్నారా? అని శ్రీమతి విజయమ్మ ఎద్దేవా చేశారు. సహకార సంఘాల ఎన్నికల్లో ప్రజాస్వామ్య కోణం ఏ కోశాన అయినా కనిపిస్తోందా? రైతన్న శ్రేయస్సు స్ఫురిస్తోందా? అని ఆమె నిలదీశారు.

సహకార ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ఓటు వేయకపోతే రుణాలు ఇవ్వబోమని, కేసులు పెడతామంటూ అధికార పార్టీ నాయకులు బెదరింపులకు దిగిన విషయం అందరికీ తెలిసిందే అని శ్రీమతి విజయమ్మ పేర్కొన్నారు. ఇంత దుర్మార్గంగా, అప్రజాస్వామికంగా, నిరంకుశంగా నిర్వహించిన మీరు ఏ ముఖంతో సంబరాలు చేసుకుంటారని శ్రీమతి విజయమ్మ సూటిగా ప్రశ్నించారు. మీ ప్రభుత్వం అసమర్థ, ప్రజా కంటక విధానాల కారణంగా ఒక వైపున రాష్ట్రంలో ప్రజలు అష్టకష్టాలు పడుతున్నారని, బ్రతకు పోరాటం చేయాల్సిన దుస్థితిలో వారంతా ఉన్నారని, ఇలాంటి దుస్థితిలోకి తమను నెట్టేసిన మీకు రైతులు సహకార ఎన్నికల్లో పట్టం కట్టారని ఏ విధంగా భావిస్తున్నారని ఆమె ఎద్దేవా చేశారు.

2004- 09 మధ్య కాలం ధరలతో పోలిస్తే 2009- 13 మధ్యన ఎరువుల ధరలు రెట్టింపయిన వైనాన్ని శ్రీమతి విజయమ్మ తన ప్రకటనలో పేర్కొన్నారు. అన్ని రకాల ఎరువుల ధరలు నింగిని అంటాయని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఆ ధరకు కొందామన్నా రైతులకు అసలు ఎరువులే దొరకని దుస్థితిని ఆమె ప్రస్తావించారు. రాత్రింబవళ్ళు నిద్రాహారాలు మాని చాంతాడంత క్యూలలో వేచిన రైతులకు కాంగ్రెస్‌ ప్రభుత్వం యూరియా ఇవ్వలేదని శ్రీమతి విజయమ్మ నిప్పులు చెరిగారు. ఇంతటి ఘోరమైన దుస్థితిని కల్పించినందుకే రైతులు మీకు మద్దతు ఇచ్చారని అనగలరా? అని ఆమె కాంగ్రెస్‌ నాయకులను సూటిగా ప్రశ్నించారు.

దివంగత మహానేత డాక్టర్‌ వైయస్‌ రాజశేఖరరెడ్డి జీవించి ఉన్నప్పుడు రైతులకు ప్రతి రోజూ 7 గంటల పాటు విద్యుత్‌ను సరఫరా చేశారని, ఇప్పుడు మీరు కనీసం మూడు గంటలైనా ఇస్తున్నారా? అని ప్రశ్నించారు. కరెంటు ఇవ్వలేని మీ పాలకు అన్నదాతలు మద్దతు ఇచ్చారని సంబరాలు చేసుకుంటున్నారా? అని శ్రీమతి విజయమ్మ ఎద్దేవా చేశారు. లైలా తుపాను బాధితులకు ఈ రోజు వరకూ మీరు నష్టపరిహారం చెల్లించగలిగారా? అని ఆమె నిలదీశారు. నష్ట పరిహారం పెంచినట్లే పెంచి, లబ్ధిదారుల జాబితాలో తమ పేర్లు లేకుండా చేసినందుకే మీకు రైతులు మద్దతిచ్చారని గొప్పలకు పోతున్నారా? అన్నారు.

రైతులకు పంటరుణాలివ్వలేదని, కౌలు రైతులకు 10 శాతమైనా రుణాలు ఇప్పించగలిగారా? అని శ్రీమతి విజయమ్మ కాంగ్రెస్‌ పెద్దలను సూటిగా ప్రశ్నించారు. రైతులు తీసుకున్న వడ్డీ లేని రుణాలకు గాను బ్యాంకులకు ఇప్పటి వరకూ కాంగ్రెస్‌ ప్రభుత్వం ఒక్క రూపాయైనా బ్యాంకులకు సబ్సిడీగా చెల్లించని వైనాన్ని ఆమె ప్రస్తావించారు.

రైతన్న దగ్గర ఉన్నప్పుడు పంటకు ధర లేని వైనం, ఆ పంట దళారుల చేతిలోకి వెళ్ళగానే ఒక్కసారిగా పెరిగిపోయిన విషయం తెలియదా? అని శ్రీమతి విజయమ్మ తన ప్రకటనలో తెలిపారు. రైతుల నుంచి పత్తి క్వింటాలుకు రూ. 2,500 నుంచి రూ. 3,000కు కొంటే, పంట దళారుల వద్దకు వెళ్ళగానే క్వింటాలుకు రూ.4,500 నుంచి రూ.5,000కు పెరిగిన వైనాన్ని ఆమె ఉటంకించారు. కాటన్‌ కార్పోరేషన్‌ ఇండియా పత్తిరైతులకు అండగా నిలబడేలా మీరు కనీస ప్రయత్నం చేశారా? అని కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని శ్రీమతి విజయమ్మ నిలదీశారు. 2009లో రూ. 40 ఉన్న డీజిల్‌ 2013లో రూ.51కి చేరిందని, చమురు ధరలపై నియంత్రణ ఉంచుకోకుండా చమురు కంపెనీలకు స్వేచ్ఛనిచ్చినందుకే మీకు రైతులు మద్దతు నిలిచారనుకుంటున్నారా? అని ఆమె ప్రశ్నించారు. గ్యాస్‌ సిలెండర్లకు లేని పరిమితి విధించి, సబ్సిడీలో కోత విధించినందుకే రైతులు మీ బ్యాలట్ బాక్సులు నింపేశారని లెక్కలు కట్టుకుంటున్నారా? అని నిలదీశారు.

గడచిన మూడేళ్ళలో మన రాష్ట్రంలో ఒక్క కొత్త ఇల్లు అయినా నిర్మించగలిగారా? అని శ్రీమతి విజయమ్మ వేలెత్తి చూపారు. కొత్త పింఛన్‌ ఒక్కటైనా మంజూరు చేశారా? గ్రామాల్లో తాగునీరైనా ఇవ్వగలిగారా? ఆపద్బంధు లాంటి 104 వాహనం ఒక్కటైనా కనిపిస్తోందా? 108 వాహనం జాడైనా ఉందా? ఫీజు రీయింబర్సుమెంటు లేక విద్యార్థులు మధ్యలోనే చదువులకు స్వస్తి చెబుతున్నారు కదా అని శ్రీమతి విజయమ్మ ఆవేదన వ్యక్తంచేశారు.

ఏం చేస్తున్నావ్.. బాబూ :
అధికార పక్షాన్ని నిలదీసి, నిగ్గదీసి పనిచేయించాల్సిన ప్రధాన ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు ప్రజాకంటకంగా మారిన కిరణ్‌ ప్రభుత్వానికి పరోక్షంగా కొమ్ముకాస్తున్నారని శ్రీమతి విజయమ్మ ఆగ్రహం వ్యక్తంచేశారు. అధికార కాంగ్రెస్‌తో ప్రధాన ప్రతిపక్షం కుమ్మక్కయిందని తన ప్రకటనలో ఆమె తూర్పారపట్టారు. చిల్లర వర్తకంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడు (ఎఫ్‌డిఐ)లకు తలుపులు బార్లా తెరిచేందుకు ప్రభుత్వానికి పరోక్షంగా మద్దతు తెలిపి చంద్రబాబు రైతులు, చిరు వ్యాపారులకు వెన్నుపోటు పొడిచారని ఆమె ఆరోపించారు. తనపై ఉన్న అవినీతి కేసులను మాఫీ చేసుకునేందుకే ఆయన కేంద్రంలోను, రాష్ట్రంలోనూ కాంగ్రెస్‌తో అంటకాగుతున్నారని, చిదంబరాన్ని చీకట్లో కలిసి కుమ్మక్కయ్యారని ఆరోపించారు. అసమర్థ కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని అవిశ్వాస తీర్మానంతో పడగొట్టగల సభ్యుల బలం ఉన్నప్పటికీ చంద్రబాబు పాదయాత్ర నెపంతో ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నట్లు నటిస్తూ మొసలి కన్నీరు కారుస్తున్నారని తెలిపారు. అధికార, ప్రతిపక్షాల కుమ్మక్కు రాజకీయాల వల్లే రాష్ట్ర ప్రజలు చెప్పలేనన్ని కష్టాలు పడుతున్నారని శ్రీమతి విజయమ్మ ఆవేదన వ్యక్తం చేశారు.

హే రామ్‌... హే దేవా.. హే అల్లా.. ఈ రాష్ట్రాన్ని మీరే కాపాడాలని శ్రీమతి విజయమ్మ ప్రార్థించారు.
Back to Top