ప్రభుత్వంపై వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అవిశ్వాసం

హైదరాబాద్, 13 మార్చి 2013: రాష్ట్ర ప్రభుత్వంపై అసెంబ్లీలో అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాలని తమ పార్టీ నిర్ణయించినట్లు వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కేంద్ర పాలక మండలి, రాజకీయ వ్యవహారాల కమిటీల సభ్యుడు ఎం.వి. మైసూరారెడ్డి తెలిపారు. అవిశ్వాసం పెట్టాల్సిన బాధ్యత ఉన్న ప్రధాన ప్రతిపక్షం టిడిపి తీర్మానం పెడితే తమ పార్టీ తప్పకుండా మద్దతు ఇస్తుందని ఆయన స్పష్టం చేశారు. అవిశ్వాస తీర్మానానికి ముందుకు వచ్చిన అన్ని పక్షాలతోనూ సమన్వయం చేసుకుని తమ పార్టీ ఎప్పుడు తీర్మానం పెట్టాలో నిర్ణయిస్తామన్నారు. వైయస్‌ఆర్‌సిపి కేంద్ర కార్యాలయంలో బుధవారం మధ్యాహ్నం నిర్వహించిన మీడియా సమావేశంలో మైసూరారెడ్డి మాట్లాడారు. అన్ని పార్టీలూ కలిసి ఈ ప్రజా వ్యతిరేక ప్రభుత్వాన్ని ప్రజాకోర్టులో నిలబెడదామని మైసూరారెడ్డి పిలుపునిచ్చారు.

రెండు వైపులా పదును ఉన్న కత్తి అవిశ్వాసం :
అవిశ్వాసం అంటే రెండు వైపులా పదును ఉన్న కత్తి లాంటిదని మైసూరారెడ్డి అభివర్ణించారు. ప్రజా కంటకంగా మారిన కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని ప్రజల్లోకి ఈడ్చుకువెళ్ళి ప్రజా కోర్టులో దోషిగా నిలబెట్టడం ఒకటైతే, ఈ ప్రభుత్వం పనికిరానిదని చెప్పి అధికారంలో కొనసాగే అర్హత లేదని అసెంబ్లీలోనే చెప్పడం అవిశ్వాస తీర్మానంలోని రెండో అంశమన్నారు. ప్రజాకోర్టులోకి వెళితే ఈ ప్రభుత్వాన్ని ప్రజలే బంగాళాఖాతంలో కలిపేస్తారని ఆయన అన్నారు.

ప్రజా సమస్యలను కాంగ్రెస్‌ ప్రభుత్వం పరిష్కరించే పరిస్థితిలేదని, పైపెచ్చు కేబినెట్‌లో అంతర్గత కుమ్ములాటలు ఉన్నాయని, ప్రభుత్వానికి పరిపాలన మీద పట్టు లేదని మైసూరారెడ్డి వ్యాఖ్యానించారు. ఇన్ని సమస్యలు ఉన్నా, పాలించే అర్హత లేకపోయినా... కేవలం అధికారం కోసం మనుగడ సాగిస్తున్న ప్రభుత్వం ఇది అని ఎద్దేవా చేశారు. ఇలాంటి ప్రభుత్వంపై అవిశ్వాసం ప్రకటించాల్సిన ఆవశ్యకత ఉందని మైసూరారెడ్డి అన్నారు. అందుకే తమ పార్టీ ఈ ప్రభుత్వంపై అవిశ్వాసం పెట్టాలని తీర్మానించిందని ఆయన చెప్పారు. తమ పార్టీ ప్రవేశపెట్టే అవిశ్వాస తీర్మానానికి కలిసిరావాలని అన్ని పార్టీలకూ మైసూరా పిలుపునిచ్చారు.

కాంగ్రెస్‌ను రక్షించడమే టిడిపి వ్యూహం :
ప్రభుత్వంపైన సరైన వత్తిడి తెచ్చేందుకు ప్రధాన ప్రతిపక్షం టిడిపి దగ్గర సరైన సంఖ్యాబలం ఉందని మైసూరారెడ్డి అన్నారు. అయితే, తమ బాధ్యతను పూర్తిగా పక్కన పెట్టేసిన ఆ పార్టీ నిత్యమూ ఈ ప్రభుత్వానికి పరిపాలించే అర్హత లేదని, విశ్వాసం కోల్పోయిందని ఉత్తుత్తి కబుర్లు చెబుతోందని ఆయన విమర్శించారు. అవిశ్వాసం పెట్టడం టిడిపి బాధ్యత అని ఆయన అన్నారు. ప్రభుత్వంపై టిడిపి అవిశ్వాసం పెట్టాలని మైసూరా డిమాండ్‌ చేశారు. అవిశ్వాసానికి అన్ని పక్షాలూ సిద్ధమైనా ప్రధాన ప్రతిపక్షం ముందుకు వస్తే దాన్ని గౌరవించి తామంతా మద్దతు ఇస్తామని మైసూరా స్పష్టం చేశారు. నిజానికి కాంగ్రెస్‌ పార్టీని రక్షించడమే టిడిపి వ్యూహంగా ఉందన్నారు.

అయితే, ఇతర పార్టీలు అవిశ్వాసం పెట్టిన తరువాత తాము పెట్టేదేమిటని కుంటి సాకులు చెబుతూ టిడిపి పారిపోవడం సరికాదని మైసూరారెడ్డి ఎద్దేవా చేశారు. ఇది భేషజానికి సంబంధించిన సమస్య కాదన్నారు. ఇది ప్రజా సంక్షేమానికి, ప్రజా ప్రయోజనాలకు సంబంధించినదని, ప్రజల కోసం ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా ముందుకు రావాలని మైసూరారెడ్డి పిలుపునిచ్చారు.

ప్రభుత్వంపై అవిశ్వాసం నోటీసును ఒక్క సభ్యుడు ఇచ్చినా చాలని, దానిని చర్చకు తీసుకోవాలా వద్దా అన్నప్పుడు మాత్రం పది శాతం మంది సభ్యుల మద్దతు అవసరమవుతుందని మైసూరా తెలిపారు. ప్రజా కంటక ప్రభుత్వాన్ని నిలదీద్దాం ముందుకు రమ్మని టిడిపికి ఆయన పిలుపునిచ్చారు. చేతిలో ఉన్న అధికారాన్ని ప్రధాన ప్రతిపక్షం టిడిపి దుర్వినియోగం చేయడం ఘోరం అని మైసూరారెడ్డి విమర్శించారు. వీధుల్లోకి వెళ్ళి పాదయాత్రలు చేసి, పనికిరాని సోది కబుర్లు చెబితే ఫలితం ఉండదని చంద్రబాబును ఉద్దేశించి మైసూరా వ్యాఖ్యానించారు.
 
ఎన్నికలకు వైయస్‌ఆర్‌సిపి సిద్ధం :
రాష్ట్రంలో ఏ ఎన్నికలనైనా ఎదుర్కొనేందుకు వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ సిద్ధం అని మైసూరా అన్నారు. స్థానిక ఎన్నికలు ఎదుర్కొనే ధైర్యం లేకే టిఆర్‌ఎస్‌, వైయస్‌ఆర్‌సిపిలు అవిశ్వాసం పెడుతున్నాయంటూ సీఎం కిరణ్‌ చేసిన వ్యాఖ్యలపై మీ స్పందన ఏమిటన్న ఒక మీడియా ప్రతినిధి ప్రశ్నకు ఆయన పై విధంగా సమాధానం చెప్పారు. అవిశ్వాసం కేబినెట్‌ మీదే అన్నారు. శాసనసభకు కేబినెట్‌ జవాబుదారీ అన్నారు. అవిశ్వాస తీర్మానంలో కారణాలు చూపాలన్న అవసరం లేదని మరో ప్రశ్నకు బదులిచ్చారు. ఒక వేళ ఒకే అంశం మీద అవిశ్వాసం పెట్టినా చర్చకు వచ్చినప్పుడు ఇతర అంశాలను కూడా ప్రస్తావించవచ్చన్నారు. అలాగే ఇతర సభ్యులు కూడా ఆ సందర్భంగా ఇతర విషయాలపై అవిశ్వాసం ప్రకటించవచ్చన్నారు.

అవిశ్వాసం ప్రవేశపెట్టాలన్న కనీస బాధ్యత ప్రధాన ప్రతిపక్షానికి లేదంటే.. ప్రభుత్వంతో కుమ్మక్కు అయిందని స్పష్టం అవుతుందన్నారు. వారి మీద, వీరి మీద బురద జల్లి టిడిపి తప్పించుకుంటే ఎలా? అని మైసూరారెడ్డి ఒక ప్రశ్నకు బదులిచ్చారు. అవిశ్వాసం అంటే యుద్ధమా? అని ఆయన వ్యాఖ్యానించారు. మా వ్యూహాలు మాకు ఉంటాయన్న టిడిపిపై అడిగిన ప్రశ్నకు ఆయన పై విధంగా సమాధానం చెప్పారు. అవిశ్వాసం పెట్టకపోయినా, అసెంబ్లీకి రాకపోయినా లేదా కొందరు సభ్యులను గైర్హాజరు చేసినా కాంగ్రెస్‌తో టిడిపి కుమ్మక్కయినట్లే అన్నారు. టిడిపి తాను బేరసారాలు చేసుకుని ఇతరును విమర్శిస్తున్నదని ఆయన ఆరోపించారు.

రాజకీయాలతో ప్రజాజీవితాన్ని ముడిపెడతారా? : 
రాజకీయాలను తీసుకెళ్ళి ప్రజా జీవితంతో ముడిపెట్టడం చాలా దౌర్భాగ్యమైన పరిస్థితి అని మైసూరారెడ్డి వ్యాఖ్యానించారు. శ్రీ జగన్మోహన్‌రెడ్డి, శ్రీమతి విజయమ్మ, శ్రీమతి షర్మిల, బ్రదర్‌ అనిల్ మహానేత వైయస్‌ సమాధిపై ‌ప్రమాణం చేయాలని టిడిపి నాయకులు చేసిన డిమాండ్‌ను ఆయన తీవ్రంగా ఖండించారు. ఇంతకు ముందు ఎమ్మెల్సీ ఎన్నికల్లో, ఉప ఎన్నికల్లో, తర్వాత కేసుకులకు సంబంధించి మీరు కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడుకోలేదని ఎన్టీఆర్‌ ‌సమాధిపై చంద్రబాబునాయుడు, భువనేశ్వరి ప్రమాణం చేస్తారా అని మైసూరా సవాల్‌ చేశారు.

బంగాళాఖాతంలో విసిరేద్దాం అని, కత్తులు, గొడ్డళ్ళతో కొట్టేయాలని ఊరికే కబుర్లు చెప్పేకంటే కాంగ్రెస్‌ ప్రభుత్వంపై తమకు విశ్వాసం ఉందని, ప్రజాస్వామ్య బద్ధంగా ఈ ప్రభుత్వం నడుస్తున్నదని టిడిపి ప్రకటించాలని మైసూరారెడ్డి వ్యాఖ్యానించారు. ప్రజాస్వామ్య విలువలు, పార్లమెంటరీ నిబంధనలు తెలియని వాళ్ళు మాట్లాడే తీరులో టిడిపి నాయకులు మాట్లాతున్నారని మైసూరారెడ్డి ఎద్దేవా చేశారు.
Back to Top