పార్టీ ఉత్తరాంధ్ర సమన్వయకర్తగా సుజయ్‌ కృష్ణ

హైదరాబాద్: వై‌యస్‌ఆర్ కాంగ్రె‌స్ పార్టీ ఉత్తరాంధ్ర జిల్లాల సమన్వయకర్తగా బొబ్బిలి ఎమ్మెల్యే సుజ‌య్‌కృష్ణ రంగారావు నియమితులయ్యారు. విజయనగరం, శ్రీకాకుళం, విశాఖపట్నం జిల్లాల పార్టీ వ్యవహారాలను ఆయన పర్యవేక్షిస్తారు. ఈ విషయం పార్టీ కేంద్ర కార్యాలయం శనివారం ఓ ప్రకటనలో తెలియజేసింది. వైయస్‌ఆర్‌ కాంగ్రెస్ పార్టీ ఏర్పాటైన తరువాత మూడు జిల్లాల స్థాయిలో సమన్వయకర్తను నియమించడం ఇదే తొలిసారి. ఈ మూడు జిల్లాల్లో పార్టీ సంస్థాగత వ్యవహారాలు, కార్యక్రమాలు, పార్టీ విస్తరణ తదితర అంశాలను సుజయ్‌కృష్ణ రంగారావు ఇక నుంచి పర్యవేక్షిస్తారని ఆ ప్రకటన వివరించింది.

బొబ్బిలి రాజవంశానికి చెందిన సుజయ్‌కృష్ణ రంగారావు విద్యాసంస్థల కరస్పాడెంట్‌గా ఉంటూ 2003లో రాజకీయాల్లోకి వచ్చారు. దివంగత ముఖ్యమంత్రి, మహానేత డాక్టర్ వై‌యస్‌ రాజశేఖరరెడ్డి ప్రోత్సాహంతో ఆయన కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. 2004లో బొబ్బిలి నుంచి తొలిసారి ఎమ్మెల్యేగా పోటీచేసి విజయం సాధించారు. ఆయన సోదరుడు బేబీనాయన 2006లో బొబ్బిలి మున్సిపల్ చైర్మ‌న్‌గా ఎన్నికయ్యారు. సుజయ్‌కృష్ణ రంగారావు 2009 ఎన్నికల్లో రెండవసారి భారీ మెజార్టీతో ఎమ్మెల్యేగా గెలిచారు. మహానేత వైయస్ ‌ఆకస్మిక మరణానంతరం కాంగ్రెస్ రాజకీయాలకు ఆయన దూరంగా ఉం‌టున్నారు.

మహానేత వైయస్ కుటుంబంపై కాంగ్రెస్, ‌టిడిపిల కుమ్మక్కు రాజకీయాలను సుజయ్‌కృష్ణ తీవ్రంగా వ్యతిరేకించారు. శ్రీ వైయస్ జగ‌న్మోహన్‌రెడ్డిని సిబిఐ విచారణకు పిలిచిందన్న ఆగ్రహంతో ఆయన గత ఏడాది మే 26న లోటస్ పాండ్‌లోని శ్రీ జగన్ నివాసానికి వెళ్లి సంఘీభావం ప్రకటించారు. రంగారావు కాంగ్రెస్‌కు గుడ్‌బై చెబుతారన్న సమాచారం తెలుసుకున్న సీఎం కిరణ్ తన సోదరుడు కిశో‌ర్, మంత్రి ‌కొండ్రు మురళిని పంపి నచ్చజెప్పేందుకు విఫలయత్నం చేశారు. కిరణ్‌కుమార్‌రెడ్డి స్వయంగా ఫోన్ చేసి ప్రలోభపెట్టినప్పటికీ ఒత్తిడికి రంగారావు లొంగలేదు‌. 2012 జూన్ 4న కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తూ స్పీక‌ర్ నాదెండ్ల మనోహ‌ర్‌కు లేఖ సమర్పించారు. జూన్ 8న వై‌యస్‌ఆర్ కాంగ్రెస్‌ పార్టీలో ఆయన చేరారు.

కాగా, సుజయ్‌కృష్ణ రంగారావు రాజీనామా లేఖపై స్పీకర్ ఇంతవరకు ఎలాంటి నిర్ణయ‌మూ తీసుకోలేదు. అయినా, అప్పటి నుంచి సుజయ్‌కృష్ణ రంగారావు, ఆయన సోదరుడు బేబీనాయన విజయనగరం జిల్లా వైయస్‌ఆర్ కాంగ్రె‌స్ పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారు.
Back to Top