పాలమూరులో షర్మిల 225 కిలోమీటర్ల పాదయాత్ర

హైదరాబాద్‌, 21 నవంబర్‌ 2012: తెలంగాణలో ‌షర్మిల పాదయాత్ర ఈ నెల 22 గురువారం మధ్యాహ్నం నుండి ప్రారంభమవుతుంది. కర్నూలు సరిహద్దులో ఉన్న మహబూబ్‌నగర్‌ జిల్లాలోకి ప్రవేశించడంతో ఆమె తెలంగాణలో పాదయాత్ర మొదలవుతుంది. గురువారం మధ్యాహ్నం ఒంటి గంటకు తుంగభద్ర వంతెన మీదుగా రావడం ద్వారా షర్మిల మహబూబ్‌నగర్‌ జిల్లాలో అడుగుపెడతారని పార్టీ జిల్లా కన్వీనర్ ఎడ్మ కిష్టారెడ్డి, కేంద్ర పాలక మండలి సభ్యుడు కె.కె.మహేందర్‌రెడ్డి, పాదయాత్ర సమన్వయ కమిటీ కో ఆర్డినేటర్ తలశిల రఘురామ్ తెలిపారు.‌ మహబూబ్ నగర్ జిల్లాలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో షర్మిల పాదయాత్ర కొనసాగుతుందని పార్టీ కేంద్ర కార్యాలయం బుధవారం విడుదల చేసిన ఒక పత్రికా ప్రకటనలో పేర్కొంది. పాలమూరు జిల్లాలో ఆమె మొత్తం 225 కిలోమీటర్ల మేర పాదయాత్ర చేస్తారని ప్రకటనలో వెల్లడించింది. వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్‌రెడ్డి తరఫున ఆయన సోదరి షర్మిల మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర చేస్తున్నారు.

మహబూబ్‌నగర్‌ జిల్లాలో పాదయాత్ర పూర్తి చేసిన అనంతరం షర్మిల తెలంగాణ ప్రాంతంలోని రంగారెడ్డి, నల్లగొండ జిల్లాల్లో చేస్తారని పార్టీ కేంద్ర కార్యాలయం ప్రకటన స్పష్టం చేసింది. అనంతరం షర్మిల మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర తెలంగాణలోని ఖమ్మం జిల్లాలో కొనసాగించే ముందు గుంటూరు, కృష్ణా జిల్లాల్లో కొనసాగుతుందని తెలిపింది.

రాష్ట్రాన్ని అన్ని విధాలా అట్టడుగు స్థాయికి దిగజార్చిన అసమర్థ కాంగ్రెస్‌ పార్టీ ప్రభుత్వం తీరును ఎండగడుతూ, దానికి పరోక్షంగా మద్దతు ఇస్తూ కుమ్మక్కు రాజకీయాలో నడుపుతున్న టిడిపి తీరును నిలదీస్తూ, సమస్యలతో సతమతం అవుతున్న ప్రజలకు భరోసా ఇచ్చేందుకు షర్మిల మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర చేస్తున్నారు. కడపజిల్లాలోని ఇడుపులపాయలో ఉన్న దివంగత మహానేత వైయస్‌ రాజశేఖరరెడ్డి ఘాట్‌ నుంచి అక్టోబర్‌ 18న షర్మిల తన పాదయాత్రను ప్రారంభించారు. కడప, అనంతపురం, కర్నూలు జిల్లాల్లో ఆమె పాదయాత్ర కొనసాగింది. మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర కడప, అనంతపురం జిల్లాల్లో ముగించుకుని కర్నూలు జిల్లాలోకి నవంబర్‌ 8వ తేదీన ప్రవేశించింది. కర్నూలు జిల్లాలో షర్మిల పాదయాత్ర గురువారం ముగిసే సమయానికి మొత్తం 200 కిలోమీటర్ల మేర పాదయాత్ర చేస్తారు.

కాగా, షర్మిల పాదయాత్ర తమ ప్రాంతంలోకి ప్రవేశించే ముందు ఆమెకు అఖండ స్వాగతం చెప్పేందుకు తెలంగాణ జిల్లాల ప్రజలు సమాయత్తమవుతున్నారని పార్టీ కేంద్ర కార్యాలయం తన ప్రకటనలో వెల్లడించింది. మహబూబ్‌నగర్‌ జిల్లా ప్రజలు కూడా షర్మిల ఎప్పుడెప్పుడు తమ ప్రాంతానికి వస్తుందా, ఎదురేగి సాదర స్వాగతం చెబుదామా అని ఆసక్తిగా ఉన్నారని పేర్కొంది. ఇదిలా ఉండగా, షర్మిల తన 35వ రోజు బుధవారం సాయంత్రం మరో ప్రజాప్రస్థానం ముగిసే సమయానికి మొత్తం 463.6 కిలోమీటర్ల మేర పాదయాత్ర పూర్తిచేస్తారని ప్రకటన తెలిపింది.
Back to Top