'సమైక్య దినోత్సవం'గా నవంబర్ 1

హైదరాబాద్, 29 అక్టోబర్ 2013:

మెజారిటీ ప్రజల అభిప్రాయానికి నిలువెత్తు పాతర వేసి, రాజ్యాంగ నిర్మాతల ఉద్దేశాన్ని తుంగలో తొక్కి, ఇష్టారాజ్యంగా ఒంటెత్తు పోకడలు పోతున్న కేంద్ర ప్రభుత్వ వ్యవహారానికి నిరసనగా నవంబర్ 1 ఆంధ్ర రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని 'సమైక్య దినోత్సవం'గా పాటించాలని వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ పిలుపునిచ్చింది. సమైక్య వాదులంతా పిడికిలి బిగించాలని, ఐకమత్యంగా సమైక్య వాదాన్ని చాటాలని కోరింది. ఆ రోజున గ్రామ సభలు నిర్వహించి, సమైక్య తీర్మానాన్ని ఆమోదించి ప్రధానికి ఈ మెయిళ్ళు పంపించాలని విజ్ఙప్తి చేసింది. పట్టణాల్లో మానవ హారాలు ఏర్పాటు చేయమని కోరింది. ఆ రోజు నరక చతుర్దశి కూడా అయినందున నరకాసురులను వధించినట్లుగా రాత్రి 7 గంటల సమయంలో విభజనకు కారకులైన వారి దిష్టిబొమ్మలను పటాకులతో దగ్ధం చేయాలని పిలుపునిచ్చింది. పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటి సభ్యుడు డాక్టర్‌ ఎంవీ మైసూరారెడ్డి కేంద్ర కార్యాలయంలో మంగళవారం సాయంత్రం మీడియా సమావేశంలో మాట్లాడారు. నరకాసుర వధలో సత్యభామ ప్రధాన భూమిక నిర్వహించిందని అలాగే ఈ నరకాసురుల వధలో మహిళలు అధిక సంఖ్యలో పాల్గొనాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

వచ్చే నెల 7న విభజనపై ఏర్పాటు చేసిన కేంద్ర మంత్రుల బృందం తూతూ మంత్రం సమావేశంలో చర్చలుండవని, ప్రజాభిప్రాయానికి విలువే లేదని మైసూరారెడ్డి వ్యాఖ్యానించారు. అధికారులిచ్చిన నివేదికలే ప్రజాభిప్రాయం అనుకుంటున్నారని విమర్శించారు. ఇలాంటి సమావేశంలో న్యాయం జరగబోదన్నారు. అలాంటి సమావేశానికి కనువిప్పు కలిగేలా 6, 7 తేదీల్లో 48 గంటల పాటు రహదారులను దిగ్బంధించాలని మైసూరా పిలుపునిచ్చారు.

స్వాతంత్ర్యం వచ్చే నాటికి దేశం ఒక రూపంలో లేనందున సమైక్యంగా ఉంచాలని, కేంద్ర విధానం ఉండాలని రాజ్యాంగ నిర్మాతలు ఆర్టికల్‌ 3 ను రూపొందించారని మైసూరారెడ్డి గుర్తుచేశారు. అయితే, ప్రస్తుత పాలకులు ఆ ఉద్దేశాన్ని తుంగలోతొక్కి తమ అధికారం, ఓట్లు, సీట్ల కోసం రాజ్యాంగ స్ఫూర్తిని నిరంకుశంగా దుర్వినియోగం చేయడం తగదని హితవు పలికారు. అడ్డగోలు విభజనకు పూనుకున్న కేంద్రం రాష్ట్రాల అభిప్రాయం తెలుసుకోవాలన్న నైతిక విలువలు కూడా పాటించడం లేదని దుయ్యబట్టారు. అసెంబ్లీలో సమైక్య తీర్మానం పెట్టాలని ఎంత మంది కోరినా, వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రతినిధులు గవర్నర్‌ను కలిసి విజ్ఞప్తి చేసినా, ముఖ్యమంత్రి, స్పీకర్‌కు కలిసినా ప్రయోజనం లేదని విచారం వ్యక్తంచేశారు.

ఆంధ్రప్రదేశ్‌ను విభజించాలనుకున్నప్పుడు కొన్ని ప్రత్యేక పద్ధతులు పాటించాల్సిన అవసరం ఉందని మైసూరారెడ్డి అన్నారు. ఆంధ్ర రాష్ట్రాన్ని ఏర్పాటు చేసినప్పుడు ఆంధ్ర, హైదరాబాద్‌ రాష్ట్ట్రాల అసెంబ్లీల్లో 2/3 వంతు మెజారిటీతో తీర్మానం చేస్తేనే ఆంధ్రప్రదేశ్‌గా ఏర్పాటవ్వాలని ఫజుల్‌ అలీ కమిషన్‌ సిఫారసు చేసిందన్నారు. అలా తీర్మానాలు చేసిన తరువాతే ఆంధ్రప్రదేశ్‌ ఏర్పడిందన్నారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ అభిప్రాయాన్ని కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. అప్పటి హోం మంత్రి చిదంబరం తెలంగాణపై ప్రకటన చేస్తూ.. రాష్ట్ర అసెంబ్లీలో తీర్మానం పెట్టడం ద్వారా విభజన ప్రక్రియ మొదలువుతుందని చెప్పిన విషయాన్ని మైసూరా గుర్తుచేశారు. చట్టసభలకు ఇచ్చిన హామీని అమలు జరపకపోతే సంప్రదాయాలకు విరుద్ధం అన్నారు. ఎన్డీయే ప్రభుత్వం కూడా కొత్త రాష్ట్రాలను ఏర్పాటు చేసినప్పుడు శాసనసభల తీర్మానాలు తీసుకుందన్నారు. అయితే, కేంద్రం వీటిని దేనినీ పట్టించుకోవడం లేదన్నారు. రాష్ట్ర అసెంబ్లీ కేవలం సై‌నె డై అయింది కాని ప్రొరోగ్‌ కాలేదని, అయినా ఎందుకు సమావేశం నిర్వహించడం లేదో అర్థం కావడం లేదన్నారు. రాష్ట్రపతికి, మరెవ్వరికో సీఎం కిరణ్‌ లేఖలు రాయడం కాదు కాని చిత్తశుద్ది ఉంటే అసెంబ్లీని సమావేశ పరచాలన్నారు.

మెజారిటీయే లేని యూపీఏ ప్రభుత్వానికి చరిత్రాత్మక నిర్ణయాలు తీసుకునే నైతిక హక్కు లేదని మైసూరారెడ్డి అన్నారు. ఆరు మాసాల తరువాత యూపీఏ ప్రభుత్వం చరిత్ర పుటల్లో మిగిలిపోతుందన్నారు. విభజనపై ఈ మెయిల్సు పంపించమన్న కేంద్రం చర్యను ఆయన తప్పుపట్టారు. ఎంతమంది ప్రజా ప్రతినిధులకు హైటెక్‌ సేవలు వినియోగించగలరన్న అనుమానం వ్యక్తంచేశారు. ఇలాంటి వారికి బుద్ధి చెప్పడానికే పంచాయతీల తీర్మానాలను ఈ మెయిల్‌ చేయమని తాము చెబుతున్నామన్నారు. సమైక్యాన్ని కోరుకునే వారంతా వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పిలుపునకు స్పందించాలని మైసూరారెడ్డి కోరారు. సమైక్య ముసుగులో డ్రామాలాడుతున్న వారందరికీ గుణపాఠం చెప్పాలని ఆయన విజ్ఞప్తిచేశారు.

Back to Top