నిర్భయ మృతికి వైయస్‌ఆర్‌సిపి సంతాపం

హైదరాబాద్, 29 డిసెంబర్‌ 2012: ఢిల్లీలో సామూహిక అత్యాచారానికి గురైన బాధితురాలు నిర్భయ మృతికి వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ తీవ్ర సంతాపాన్ని ప్రకటించింది.భారత జాతి యావత్తూ సిగ్గుతో తలదించుకుని నిర్భయ మృతికి సంతాపం తెలియజేయాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించింది. వైయస్‌ఆర్‌ సిపి అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ శనివారం మధ్యాహ్నం పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన పత్రికా ప్రతినిధుల సమావేశలో నిర్భయ మృతికి తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఆమె మృతికి వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నట్లు తెలిపారు. నిర్భయ ఆత్మకు శాంతి కలగాలని ఆకాంక్షించారు. మహిళల రక్షణకు ప్రభుత్వాలు చేపట్టాల్సిన చర్యల గురించి ప్రత్యేకంగా పార్లమెంటు సమావేశాలు నిర్వహించి, చర్చించాలని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ తరఫున పద్మ డిమాండ్‌ చేశారు.

బతకాలన్న ఆకాంక్షతో, ధైర్యంతో 13 రోజులు మృత్యువుతో నిర్భయ పోరాడిందని, ఆమెను ఎలాగైనా బతికించాలని వైద్యులు ప్రయత్నించారని పద్మ పేర్కొన్నారు. ఏ పాపం ఎరుగని నిర్భయ కొంతమంది ముష్కరుల చేతిలో దారుణంగా బలైపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సంఘటనను కేవలం ఒక కేసుగా చూడకుండా దేశవ్యాప్తంగా మహిళల రక్షణకు సంబంధించిన అవసరంగా తీసుకోవాలన్నారు. లేదంటే నిర్భయ మృతికి ఒక అర్థం లేదని వైయస్‌ఆర్‌ సిపి భావిస్తోందని పద్మ పేర్కొన్నారు.

ఈ పాశవిక సామూహిక అత్యాచారం జరిగిన తరువాత మన ప్రభుత్వం ఎలా స్పందించింది, మనందరం ఎలా స్పందించామన్న విషయాన్ని అవలోకనం చేసుకోవాలన్నారు. ఆమెపై అత్యాచారం ఘటన జరిగిన మరుసటి రోజున ఢిల్లీ సిఎం షీలా దీక్షిత్‌ మాట్లాడుతూ, రాత్రిళ్ళు మహిళలకు రక్షణ కల్పించలేమని చేసిన ప్రకటనను పద్మ తీవ్రంగా ఖండించారు. అయితే, ఢిల్లీ యువత, విద్యార్థినీ విద్యార్థులు ఢిల్లీ వీధులను ముట్టడించి అశాంతిని, ఆందోళనను వ్యక్తం చేసిన మీదట ప్రభుత్వం దిగివచ్చిన వైనాన్ని ప్రస్తావించారు. అత్యాచారం నిందితులపైన వారం రోజుల లోపు చార్జిషీట్‌ పెడతామని, నెల రోజుల లోపు దర్యాప్తు పూర్తిచేస్తామని, కఠిన శిక్షలు వేస్తామని, ఫాస్టు ట్రాక్‌ కోర్టు పెడతామని కొన్ని డిమాండ్లను అంగీకరించిందన్నారు. ఈ విషయంలో కేవలం ఒక కేసు చుట్టూ మాత్రమే ప్రభుత్వం పరిమితం కావడాన్ని పద్మ విమర్శించారు.

శనివారం తెల్లవారు జామున నిర్భయ సింగపూర్‌ ఆస్పత్రిలో మరణించిన తరువాత ఢిల్లీ ప్రభుత్వం అప్రమత్తమైన తీరు చూస్తుంటే ఆశ్చర్యం కలుగుతోందని పద్మ అన్నారు. ఈ సంఘటనను ఒక శాంతి భద్రతల సమస్యగా ఎందుకు చూస్తోందని నిలదీశారు. కేవలం విజయ్‌ చౌక్‌కు రావద్దు, ఇండియాగేట్‌కు రావద్దు, రాష్ట్రపతి భవన్‌కు రావద్దనే విధానంతోనే ప్రభుత్వం వ్యవహరించడాన్ని తప్పుపట్టారు. ఈ కేసు పట్ల, నిర్భయ మృతి పట్ల ఈ సమాజంలో ఎంత ఆందోళన నెలకొన్నదన్న విషయాన్ని ప్రభుత్వం పట్టించుకోవడంలేదని ఆరోపించారు. బాధితురాలిని సింగపూర్‌ తరలించిన తీరు కూడా వివాదాస్పదం అవుతున్నదన్నారు. ఎవరిని అడిగి ఆమెను సింగపూర్‌ తరలించారని నిలదీశారు. మన దేశంలో వైద్య సౌకర్యాలు లేవని తరలించారా, లేక ఇక్కడి వైద్యులు తమ వల్ల కాదని చేతులెత్తేసినందు వల్ల నిర్భయను సింగపూర్‌ తరలించారా అని పద్మ ప్రశ్నించారు. టెన్‌ జన్‌పథ్‌లో నిర్ణయించి ఆమెను సింగపూర్‌ తీసుకువెళ్ళారా అన్న విషయాన్ని స్పష్టం చేయాల్సిన ఆవశ్యతక కేంద్ర, ఢిల్లీ ప్రభుత్వాలకు ఉందన్నారు.

అప్పుడు నిర్భయ ఉన్న పరిస్థితిలో వేరే చోటికి తరలించడం సరికాదని మన వైద్యులు చెబుతున్నారని పద్మ తెలిపారు. అలా తరలించడం కూడా నిర్భయ మృతికి కారణం అయిందా? అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయన్నారు. ఈ సంఘటనకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం వ్యవహరించిన తీరులో స్పష్టత లేదన్నారు. అత్యాచారం ఘటనపై ఆందోళన వ్యక్తంచేస్తున్న మహిళలు, యువతులపైన లాఠీచార్జీ చేసిన వైనం చూస్తే అది కేవలం శాంతిభద్రతల సమస్యగానే ప్రభుత్వం భావిస్తోందని దుయ్యబట్టారు. ఈ సమాజంలోని ఒక రుగ్మతకు బాధితులుగా మారిన మహిళలకు రక్షణ కల్పించాల్సిన బాధ్యతను ప్రభుత్వం విస్మరించిందని నిప్పులు చెరిగారు.

దక్షిణ ఢిల్లీలోని వసంతవిహార్ ప్రాంతంలో ఈ నెల‌ 16 ఆదివారం రాత్రి ఓ ప్రైవేట్ బ‌స్సులో సామూహికంగా అత్యాచారానికి గురైన పారామెడికల్ విద్యార్థిని‌ నిర్భయ సింగపూర్‌లోని మౌంట్‌ ఎలిజబెత్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ‌ తుదిశ్వాస విడిచింది. భారత కాలమానం ప్రకారం ఆమె శనివారం తెల్లవారు జామున 2.15 గంటలకు మృతి చెందింది.‌ అత్యాచారానికి గురైన తరువాత ఢిల్లీలోని సఫ్దర్‌ జంగ్‌ ఆస్పత్రిలో చికిత్స కోసం చేర్పించిన కేంద్ర ప్రభుత్వం అనంతరం ఆమెకు మెరుగైన చికిత్స కోసం అని చెప్పి సింగపూర్‌లోని మౌంట్ ఎలిజబె‌త్ ఆస్పత్రికి తరలించిన విషయం తెలిసిందే.

దారుణానికి బలై, మరణించిన నిర్భయ మనందరి మీద ఒక బాధ్యతను ఉంచిందన్న విషయాన్ని అన్ని రాజకీయ పార్టీలు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కూడా గుర్తించాల్సిన అవసరం ఉందని పద్మ సూచించారు. ఈ అత్యాచారం సంఘటనపై పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ, రాష్ట్రపతి కుమారుడు, ఎంపి అభిజిత్‌ ముఖర్జీ మాట్లాడిన తీరు తీవ్ర అభ్యంతరకరంగా ఉందన్నారు. రాజకీయ నాయకులు ఇలా మాట్లాడుతుంటే మహిళల రక్షణకు ఇక ఏమి చర్యలు తీసుకుంటారన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయన్నారు.

నిర్భయ మృతికి ప్రధాని, సోనియా గాంధీ కంటితుడుపు చర్యగా సంతాపాలు వ్యక్తం చేయడం కాకుండా ఎంత చిత్తశుద్ధితో, ఎంత బాధ్యతతో మహిళల రక్షణకు చర్యలు చేపడతామన్నది స్పష్టమైన హామీ ఇవ్వాలన్నారు. దేశ వ్యాప్తంగా ఈ ఏడాది 28 వేల అత్యాచారం కేసులు నమోదయ్యాయని ప్రభుత్వ లెక్కలే చెబుతున్నాయంటే, రికార్డులలోకి రానివి మరెన్ని వేల కేసులు ఉన్నాయో అని పద్మ ఆవేదన వ్యక్తం చేశారు. ఇన్ని వేల కేసులు నమోదవుతున్నాయంటే మహిళల భద్రత ఎంతగా క్షీణించిపోయిందన్న కనీస జ్ఞానం ఈ ప్రభుత్వానికి ఉందా? అని పద్మ నిలదీశారు.

సమాజం తెచ్చిపెట్టిన ఉపద్రవానికి బలైపోయిన యువతి నిర్భయ కుటుంబం త్వరగా ఆ దుఃఖం నుంచి కోలుకోవాలని పద్మ ఆకాంక్షించారు. ఈ సంఘటన నుంచి మనందరం గుణపాఠం నేర్చుకోవాలని అన్నారు.

నిర్భయకు నివాళి:
అత్యాచార బాధితురాలు మృతి చెందినట్లు తెలిసిన వెంటనే వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆమె చిత్రపటాన్ని ఉంచి శ్రద్ధాంజలి ఘటించారు. పార్టీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మతో పాటు పలువురు నాయకులు పాల్గొని ఆమె మృతికి సంతాపంగా రెండు నిమిషాలు మౌనం పాటించారు. బాధితురాలి కుటుంబం మనోవేదన నుంచి కోలుకోవాలని వారు కోరారు.
Back to Top