నంద్యాల: భర్త చనిపోయి కుటుంబం దిక్కులేనిది అయితే పట్టించుకున్న నాథుడే కరువయ్యాడు. ప్రభుత్వ సాయం కోసం కార్యాలయాల చుట్టూ, జన్మభూమి కమిటీ చుట్టూ తిరిగినా పరిష్కారం లభించలేదు. దీంతో విసుగు చెందిన ఆ మహిళ పింఛన్ కోసం తన ఆత్మాభిమానాన్ని చంపుకోలేక, ఎవరిని అడగలేక కష్టం చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటోంది. ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డి గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ఈ విషయం వెలుగు చూడటంతో వెంటనే అధికారులతో మాట్లాడి ఆమెకు ఒక్క రోజులోనే వితంతవు పింఛన్ మంజూరు చేయించిన ఘటన శ్రీశైలం నియోజకవర్గం మహానంది మండలంలో చోటు చేసుకుంది. 12 ఏళ్ల తరువాత ఆమెకు ప్రభుత్వం నుంచి పింఛన్ మంజూరు కావడంతో సీఎం వైయస్ జగన్, ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డిలకు కృతజ్ఞతలు తెలిపింది.
వివరాల్లోకి వెళ్తే.. మహానంది మండలం, గాజులపల్లి గ్రామంలో ఈ నెల 4వ తేదీ ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డి గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించారు. ఈ క్రమంలో గ్రామానికి చెందిన పాల్డమ్ మదార్ బీ అనే మహిళ ఇంటికి ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి వెళ్లగా తన భర్త చనిపోయాడు..12 ఏళ్లు అవుతున్నా పింఛన్ మంజూరు కావడం లేదని చెప్పింది. వెంటనే స్పందించిన ఎమ్మెల్యే శిల్పా ..అధికారులతో మాట్లాడి ఆమెకు పింఛన్ మంజూరు చేయించారు. 12 సంవత్సరాల నుంచి రాని పెన్షన్ ని ఒక్క రోజులోనే ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి మంజూరు చేయించడంతో మదార్ బీ సంతోషం వ్యక్తం చేసింది.