కుమ్మక్కు రాజకీయాలకు పరాకాష్ఠ

హైదరాబాద్, 7 డిసెంబర్ 2012:

ఎఫ్‌డీఐలపై రాజ్యసభలో జరిగిన ఓటింగ్‌లో తెలుగుదేశం పార్టీ ఎంపీలు పాల్గొనకపోవడం వారి కుమ్మక్కు రాజకీయాలకు పరాకాష్ట అని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీజీసీ సభ్యుడు ఎం.వి.మైసురారెడ్డి ఆరోపించారు. లోపాయికారి ఒప్పందం మేరకే చారిత్రాత్మకమైన బిల్లుకు ఓటింగ్ జరుగుతున్న సమయంలో ముగ్గురు టీడీపీ సభ్యులు దూరంగా ఉన్నారని విమర్శించారు.

     
     ఎఫ్‌డీఐలపై తెరముందు గగ్గోలు పెడుతూనే తెరవెనక టీడీపీ అధినేత చంద్రబాబు లాలూచీ రాజకీయాలు చేస్తున్నారని మైసూరారెడ్డి విమర్శించారు. దేశంలోని చిల్లర వర్తకుల మీద ప్రభావం చూపే ఎఫ్‌డీఐలు రావడానికి పరోక్షంగా టీడీపీ కారణమైందన్నారు. ఇది మంచి సంప్రదాయం కాదని ఆయన హితవు పలికారు. రిటైల్ రంగంలోకి ఎఫ్‌డీఐలను వ్యతికిస్తూ తన పాదయాత్రలో పదే పదే చెప్పిన చంద్రబాబుకు ప్రజలకు సరైన గుణపాఠం చెపుతారని పార్టీ
కేంద్ర కార్యాలయంలో శుక్రవారంనాడు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో
ఎం.వి.మైసురారెడ్డి అన్నారు.

     సీబీఐ కేసుల నుంచి బయట పడేందుకు చంద్రబాబు కాంగ్రెస్ పార్టీతో కుదుర్చుకున్న ఒప్పందం మేరకు ముగ్గురు సభ్యులు గైర్హాజరు అయ్యారని మైసూరా రెడ్డి ధ్వజమెత్తారు. పరోక్షంగా ఆయన కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాలకు కొమ్ముకాస్తున్నారని అన్నారు. అందులో భాగంగానే అవిశ్వాస తీర్మానం పెట్టమంటే వెనుకడుగు వేస్తున్నారన్నారు.
     గురువారం వరకు ఆరోగ్యంగా ఉన్న టీడీపీ ఎంపీ, వైద్య చికిత్స కోసం పార్టీ అధినేత అనుమతి తీసుకున్నానని చెప్పడం శోచనీయమన్నారు. ఎలాగైనా వీగిపోతుందనే తాము ఓటింగ్‌లో పాల్గొనలేదని మిగతా ఇద్దరు సభ్యులు చెప్పడం సిగ్గుచేటన్నారు. సభ్యుల గైర్హాజరు చంద్రబాబుకు తెలిసే జరిగిందని, ఆయాచితంగా ఏమీ జరగలేదని మైసూరారెడ్డి విమర్శించారు.

తాజా ఫోటోలు

Back to Top