చీకటి ఒప్పందం వల్లే పారిపోతున్న బాబు

హైదరాబాద్, 11 మార్చి 2013: చీకటిలో చిదంబరాన్ని కలిసి ఒప్పందం చేసుకున్నందువల్లే టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ప్రజలకు సమాధానం చెప్పకుండా పారిపోతున్నారని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఆరోపించింది. పార్టీ గౌరవ అధ్యక్షురాలు శ్రీమతి విజయమ్మ ఎకనామిక్‌ టైమ్స్‌లో ఇచ్చిన ఇంటర్వ్యూ శీర్షికను మాత్రమే చదివి టిడిపి, టిఆర్‌ఎస్‌ నాయకులు అసత్య ప్రచారం చేస్తున్నారని పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు నిప్పులు చెరిగారు. కాంగ్రెస్‌ పార్టీలో వైయస్‌ఆర్‌సిపి కలిసిపోతుందంటూ దుష్ప్రచారం చేస్తున్న టిడిపి ఇప్పటికే ఆ పార్టీతో కుమ్మక్కు అయిందని ఆయన వ్యాఖ్యానించారు. చంద్రబాబు నాయుడు అసెంబ్లీకి రావాల్సిందే... కాంగ్రెస్‌ ప్రభుత్వంపై అవిశ్వాసం పెట్టాల్సిందే అని ఆయన డిమాండ్‌ చేశారు. లేకపోతే చంద్రబాబును అసెంబ్లీకి శాశ్వతంగా రానివ్వకుండా ప్రజలే చేస్తారని హెచ్చరించారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో సోమవారం సాయంత్రం అంబటి రాంబాబు  నిర్వహించిన మీడియా సమావేశంలో టిడిపి, టిఆర్‌ఎస్‌ నాయకుల తీరుపై తీవ్రంగా విరుచుకుపడ్డారు. ఎవరితోనైనా కలిసిపోవడానికి వైయస్‌ఆర్‌సిపి ఏమైనా బలహీనపార్టీనా అని ఆయన ప్రశ్నించారు. వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ బలహీనంగా లేదని, ఏ పార్టీలోనూ కలవదని అంబటి స్పష్టం చేశారు. 
టిడిపి, టిఆర్‌ఎస్‌ దుష్ప్రచారం :
శ్రీమతి విజయమ్మ ఇంటర్వ్యూపై మాట్లాడుతున్న వారి తీరు 'దున్నపోతు ఈనిందంటే.. దూడను కట్టేయండి' అన్న చందంగా ఉందని అంబటి ఎద్దేవా చేశారు. కేవలం శీర్షికను మాత్రమే చదివి చంద్రబాబు, టిఆర్‌ఎస్‌ నాయకుడు కెటిఆర్‌ లాంటి వారు ‌కాంగ్రెస్‌ పార్టీలో వైయస్ఆర్‌సిపి కలిసిపోతుందంటూ ప్రజలను నమ్మించే దుస్తంత్రానికి తెరతీశారని దుయ్యబట్టారు. ఎకనామిక్‌ టైమ్స్‌లో వచ్చిన ఇంటర్వ్యూలోని ముఖ్యమైన అంశాన్ని అంబటి చదివి వినిపించారు. వీరి విధానం చూస్తుంటే... 'నలుగురు అంధులు... ఏనుగు కథ' గుర్తుకు వస్తోందన్నారు. 2014కు ముందు ఎలాంటి పొత్తులూ ఉండబోవని శ్రీమతి విజయమ్మ స్సష్టం చేశారన్నారు. ఆ తరువాత పొత్తులు ఎలా ఉంటాయన్నది ఇప్పుడే చెప్పలేమన్నారు. అయితే, మత తత్వ బిజెపి కూటమికి మద్దతు ఇచ్చే ప్రసక్తే లేదని చెప్పారన్నారు. అప్పటి పరిస్థితులను బట్టి, ఆంధ్రప్రదేశ్‌ ప్రజల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని యుపిఎ కూటమికి గాని, మూడవ ఫ్రంట్‌కు గాని తాము మద్దతు ఇచ్చే అవకాశం ఉందని శ్రీమతి విజయమ్మ ఆ ఇంటర్వ్యూలో చెప్పారన్నారు. బిజెపితో అంటకాగిన  చంద్రబాబు నాయుడు గతంలో కూడా వైయస్‌ఆర్‌సిపి ఆ పార్టీలో కలిసిపోతోందంటూ ఇలాగే గోబెల్స్‌ ప్రచారం చేశారని ఆయన విమర్శించారు. కాంగ్రెస్‌లో వైయస్‌ఆర్‌సిపి కలిసిపోతోంది, కలిసిపోయిందంటూ ప్రచారం చేస్తున్న టిడిపి ఇప్పటికే దానితో కలిసిపోయిందని అంబటి విమర్శించారు.

ధైర్యం చెక్కుచెదరని జగన్‌ :
వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ మంగళవారంనాడు రెండవ ఆవిర్భావ దినోత్సవం జరుపుకుంటున్నదని అంబటి తెలిపారు. ఈ రెండేళ్ళలోనూ పార్టీ చరిత్రలో లేని విధంగా దినదిన ప్రవర్ధమానంగా దేదీప్యంగా వెలుగొందుతున్నదన్నారు. పార్టీ ఆవిర్భవించిన కేవలం రెండు నెలల్లోనే అధినేత శ్రీ వైయస్‌ జగన్మోహన్‌రెడ్డి అత్యధిక మెజారిటీతో గెలిచిన వైనాన్ని ఆయన గుర్తుచేశారు. ప్రస్తుత లోక్‌సభలో మరే ఇతర ఎం.పి.కీ రానంత అత్యధిక భారీ మెజారిటీ వచ్చిన వ్యక్తి శ్రీ జగన్‌ అన్నారు. కాంగ్రెస్‌తో కలిసిపోవడమే నిజమైతే 10 నెలలుగా శ్రీ జగన్‌ జైలులో ఎందుకు ఉండాల్సి వస్తుందని అంబటి ప్రశ్నించారు. పది నెలలపాటు శ్రీ జగన్‌ జైలులో ఉన్నా చెక్కుచెదరలేదని చెప్పారు.

‌కాంగ్రెస్‌ ప్రభుత్వం కారణంగా, సిఎం కిరణ్‌ కుమార్‌రెడ్డి తీరు వల్ల రైతులు కిడ్నీలు అమ్ముకునే దుస్థితి వచ్చిందని రోజూ చెబుతున్న చంద్రబాబు ఆ ప్రభుత్వంపై అవిశ్వాసం ఎందుకు పెట్టడంలేదని అంబటి ప్రశ్నించారు. వైయస్‌ఆర్‌సిపి అవిశ్వాసం పెట్టాలంటూ చంద్రబాబు చెబుతున్నారన్నారు. తక్కువ మంది సభ్యులున్నప్పటికీ తమ పార్టీ అవిశ్వాసం పెడుతుందని, అయితే, తనకు ఉన్న సభ్యులందరితో కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా ఓటు వేయించే దమ్ము చంద్రబాబుకు ఉందా? అని ఆయన సవాల్‌ చేశారు. అవిశ్వాసం పెడితే ఐఎంజి కేసులో జైలుకు పంపిస్తామని కాంగ్రెస్‌ పెద్దలు భయపెడుతున్నందువల్లే చంద్రబాబు అసెంబ్లీకి రాకుండా పాదయాత్ర సాకుతో పారిపోతున్నారని అంబటి రాంబాబు వ్యాఖ్యానించారు. చంద్రబాబు నాయుడు చీకటి ఒప్పందం చేసుకున్నారు కనుకే అవిశ్వాసం పెట్టాలన్న ఆలోచన రావడంలేదన్నారు.

కాంగ్రెస్‌ పార్టీతో పొత్తు పెట్టుకుంటే బెయిల్‌ వచ్చేస్తుందని భావిస్తున్నవారెవరో చెప్పాలని ఒక విలేకరి ప్రశ్నకు బదులిచ్చారు. కాంగ్రెస్‌కు గుడ్‌బై చెప్పి, శ్రీ జగన్‌ దగ్గరికి వచ్చిన ఎమ్మెల్యేల రాజీనామాలను ఆమోదించకుండా ఎందుకు తాత్సారం చేస్తున్నారో వి.హనుమంతరావు సమాధానం చెప్పాలని మరో ప్రశ్నకు సమాధానం చెప్పారు. అవిశ్వాసం పెట్టనని చెప్పిన చంద్రబాబు కాంగ్రెస్‌తో కుమ్మక్కయినట్లు మరోసారి స్పష్టం చేశారన్నారు. చంద్రబాబు అవిశ్వాసం పెట్టరన్న ధీమా రావడంతోనే పిసిసి చీఫ్‌ బొత్స సత్యనారాయణ ధీమాగా సవాల్‌ చేస్తున్నారన్నారు.
Back to Top