రహస్య ఎజెండాతో చంద్రబాబు ఢిల్లీ యాత్ర

హైదరాబాద్, 12 సెప్టెంబర్ 2013:

టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు బస్సుయాత్రలో ఏనాడైనా జై ‌సమైక్యాంధ్ర అన్నారా? అని వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కేంద్ర పాలక మండలి సభ్యుడు ప్రొఫెసర్‌ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు ప్రశ్నించారు. విభజనకు అనుకూలంగా ఇచ్చిన లేఖను ఉపసంహరించుకుంటానని అన్నారా? అని నిలదీశారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో గురువారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత శ్రీ వైయస్ జగ‌న్మోహన్‌రెడ్డికి బెయిల్ రాకుండా‌ చంద్రబాబు అడ్డుకునే ప్రయత్నాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సమైక్య ముసుగు వేసుకుని చంద్రబాబు ఢిల్లీ వెళుతున్నారన్నారు.

ఆత్మగౌరవ యాత్రను చంద్రబాబు నిన్న అర్ధంతరంగా ముగించడానికి ప్రధాన కారణం సుప్రీంకోర్టు శ్రీ జగన్మోహన్‌రెడ్డిగారి విషయంలో గతంలో ఇచ్చిన తీర్పు గుర్తు వచ్చే అన్నారు. సెప్టెంబర్‌ 9 లోగా సిబిఐ తుది చార్జిషీట్‌ వేయాలని ఆదేశించిందని, తదుపరి శ్రీ జగన్‌ బెయిల్‌ పిటిషన్‌ వేస్తారు కాబట్టి తాను ఆడాల్సిన నాటకం ఆడాలనే ఉద్దేశంతోనే అర్ధంతరంగా యాత్రను ముగించారని ఆరోపించారు. చంద్రబాబు ఢిల్లీ యాత్రకు రహస్య ఎజెండా ఉందన్నారు. శ్రీ జగన్మోహన్‌రెడ్డి బెయిల్‌ అంశం ఎప్పుడు వచ్చినా, ఆస్తులను ఈడీ జప్తు చేసినప్పుడు ఇలా ఏ సందర్భం వచ్చినా సరే తన పార్టీ నాయకులందరినీ చంద్రబాబు అప్రమత్తం చేస్తారన్నారు. అందర్నీ కలిసి శ్రీ జగన్‌కు బెయిల్‌ రాకుండా ఏ విధంగా అయినా అడ్డుకోండని ఉసిగొల్పుతారన్నారు. టిడిపి ఎం.పి. నామా నాగేశ్వరరావు నేతృత్వంలో ఈడీని కలిసి శ్రీ జగన్‌ ఆస్తులను జప్తు చేయాలని, ఆయనకు బెయిల్‌ రాకుండా చేయాలని ఒక మెమో ఇచ్చిన వైనాన్ని ఉమ్మారెడ్డి ప్రస్తావించారు.

ఈ సారి తన పార్టీ నాయకులను పంపిస్తే లాభం లేదనుకున్నారేమో తానే స్వయంగా ఢిల్లీకి ప్రయాణమవుతున్నారని ఉమ్మారెడ్డి వ్యాఖ్యానించారు. రాష్ట్రపతి, ప్రధాన మంత్రి, ఇతర పార్టీల నాయకులందర్నీ చంద్రబాబు కలుస్తానని చెబుతున్నారని అన్నారు. సమైక్యాంధ్ర విషయంలో వీరందర్నీ తాను కలుస్తానని పైకి చెబుతున్నప్పటికీ శ్రీ జగన్‌కు బెయిల్‌ రాకుండా అడ్డుకోవడానికే అనేది నగ్న సత్యం అన్నారు.

గడచిన నాలుగు సంవత్సరాల్లో టిడిపి 46 చోట్ల పోటీ చేస్తే 26 చోట్ల డిపాజిట్ గల్లంతయి‌న విషయాన్ని ఉమ్మారెడ్డి ప్రస్తావించారు. ఎవరి ఆత్మగౌరవం కోసం చంద్రబాబు బస్సు యాత్ర చేశారని ఆయన ప్రశ్నించారు. ఆనాడే అవిశ్వాసానికి మద్దతు పలికి ఉంటే ఈ ప్రభుత్వం కూలిపోయి ఉండేదన్నారు.

చిదంబరంతో చంద్రబాబు సంబంధం ఓ చిదంబర రహస్యం అన్నారు. అర్ధంతరంగా ఆత్మగౌరవ యాత్రను ముగించుకు వచ్చిన చంద్రబాబు ఎందుకు యాత్ర చేశారో, తన 11 రోజులూ ప్రజలకు ఏమి సందేశం ఇచ్చారో ఎవరికీ అర్థం కాలేదన్నారు. యాత్రలో ఏం చెప్పాలనుకున్నారో అది మాత్రం చెప్పలేదన్నారు. బస్సు యాత్ర మొత్తంలో సగం సమయాన్ని చంద్రబాబు నాయుడు శ్రీ వైయస్‌ జగన్‌ను, వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ను లేక ఇతర పార్టీల నాయకులపై సిగ్గులేదా? ఎగ్గులేదా? లాంటి పరుష పదజాలం వాడడానికి, ఇప్పటికే తనను రెండు సార్లు ఓడించారు, మరొక్కసారి అవకాశం ఇవ్వండి అని బ్రతిమిలాడుకోవడానికే పరిమితమయ్యారని ఉమ్మారెడ్డి విమర్శించారు.

కాంగ్రెస్‌తో వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ కుమ్మక్కైందని, కలిసి రాజకీయ ఎత్తుగడలు వేస్తున్నారని చంద్రబాబు చెబుతున్నారని, తాను అబద్ధాలు చెబుతున్నట్లు తెలిసిన ఆయన ఆరోపణలు అదేవిధంగా చేస్తున్నారన్నారు. చంద్రబాబు పూర్తిగా కాంగ్రెస్‌తో మమేకమై పనులు చేస్తున్న విషయం ప్రజలందరికీ తెలుసన్నారు. కాంగ్రెస్‌ నుంచి బయటికి వచ్చిన చంద్రబాబు నాయుడు తన శరీరంలో 30 శాతం కాంగ్రెస్‌ రక్తమే అని చెప్పిన వైనాన్ని ఉమ్మారెడ్డి ప్రస్తావించారు. శ్రీ జగన్‌గారి ఆస్తుల విషయంలో కాంగ్రెస్, టిడిపి కలిసి నాటకం ఆడాయన్నారు.

రాష్ట్రాన్ని విభజించాలని కేంద్రానికి లేఖ ఇచ్చి, విభజన ప్రకటన వెలువడిన మరుసటి రోజునే నాలుగైదు లక్షల కోట్లిస్తే.. కొత్త రాజధానిని కట్టుకుంటామని ఆంధ్రుల ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టి, బేరం పెట్టింది చంద్రబాబే అని ఉమ్మారెడ్డి విమర్శించారు. అలాంటి చంద్రబాబు ఆత్మగౌరవ యాత్ర చేయడం ఏమిటని ప్రశ్నించారు.

ఏకపక్షంగా జరిగిన విభజన నిర్ణయంపై వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రజాప్రతినిధులంతా రాజీనామాలు చేస్తే.. టిడిపి నుంచి ఎవరైనా ఆ విధంగా ప్రజల పక్షాన స్పందించారా? అని ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు నిలదీశారు. గతంలో రెండు కళ్ళ సిద్ధాంతం అన్న చంద్రబాబు ఇప్పుడు మరో అడుగు ముందుకు వేసి ఒక కాలిని మూసీ నదిలోను, మరొకటి కృష్ణానదిలోనూ పెట్టారని ఎద్దేవా చేశారు. జాతీయ, అంతర్జాతీయ సదస్సుల్లో పాల్గొన్న నాయకుడి స్థాయిలో చంద్రబాబు వాడిన భాష లేదన్నారు. ఆంధ్రుల ఆత్మగౌరవాన్ని మంట గలిపేలా కాంగ్రెస్‌తో చంద్రబాబు ప్రతి విషయంలోనూ కుమ్మక్కయ్యారని ఆయన ఆరోపించారు.

శ్రీ జగన్‌ ఎక్కడ బయటికి వస్తారో, జనంలో ఆయనకు ఉన్న ఆదరణలో వచ్చే ఎన్నికల్లో ఆయన ముందు ఎక్కడ గాలిలో కొట్టుకుపోతామో అనే భయం చంద్రబాబుకు పట్టుకుందన్నారు. ఆ భయం ఆ అసహనంతో వాడే మొద్దబ్బాయి, దొంగబ్బాయి లాంటి పదాలు, పార్టీ మారిన వాళ్లంతా పశువులని అనడాన్ని ఉమ్మారెడ్డి తీవ్రంగా ఖండించారు. పార్టీ మారిన వారి గురించి చంద్రబాబు నాయుడు మాట్లాడకూడదని ఆయన సలహా ఇచ్చారు. టిడిపి నుంచి 26 మంది సీనియర్‌ నాయకులు బయటికి ఎందుకు వెళ్ళిపోయారో చంద్రబాబు ఆత్మ పరిశీలన చేసుకోవాలన్నారు. పాదయాత్ర ద్వారా చంద్రబాబు సాధించిందేమిటి? దానిలో ఆయన ఇచ్చిన సందేశం ఏమిటి? బస్సు యాత్రలో ప్రజలకు ఆయన ఇచ్చిన సందేశం ఏమిటో వివరిస్తే.. జనం సంతోషిస్తారన్నారు.

చంద్రబాబు అసహనానికి గురవుతున్నారని, అధికారం కోసం అర్రులు చాస్తున్నారని ప్రజలకు తెలిసిపోయిందని ఉమ్మారెడ్డి అన్నారు. అధికారమే పరమావధిగా చంద్రబాబు యాత్రలు చేస్తున్నారన్న విషయమూ ప్రజలకు తెలిసిపోయిందన్నారు. కాంగ్రెస్‌ పార్టీకి చంద్రబాబు గొడుగు పడుతున్న విషయమూ స్పష్టమైపోయిందన్నారు. ఢిల్లీ యాత్రకు ఎందుకు వెళుతున్నారో చంద్రబాబు వెల్లడించాలని ఉమ్మారెడ్డి డిమాండ్‌ చేశారు.

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top