చంద్రబాబు, కిరణ్‌ సమైక్య ద్రోహులే

హైదరాబాద్, 21 అక్టోబర్ 2013:

చంద్రబాబు నాయుడు, కిరణ్‌కుమార్‌రెడ్డి సమైక్య ద్రోహులే అని వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కేంద్ర పాలక మండలి సభ్యుడు దాడి వీరభద్రరావు ఆరోపించారు. వాళ్ళిద్దరి కాకమ్మ కబుర్లను ఇక ప్రజలు నమ్మబోరన్నారు. కేంద్రప్రభుత్వం సంగతి చూస్తానని చంద్రబాబు, విభజన తుపానును ఆపుతానని, రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచగలనని ముఖ్యమంత్రి చెబుతున్న మాటలను దాడి ఎద్దేవా చేశారు. వీళ్ళిద్దరూ ప్రత్యేక తెలంగాణ వాదానికి అనుకూలంగా.. కోవర్టులుగా ఉంటూ.. సమైక్యాంధ్ర ఉద్యమానికి వెన్నుపోటు పొడిచిన ద్రోహులని దాడి దుయ్యబట్టారు. వీళ్ళను తెలుగు జాతి క్షమించదన్నారు. చాంపియన్‌ అయిపోవాలని వాళ్ళిద్దరూ తాపత్రయపడుతున్నారని ఆరోపించారు. అయితే.. రాష్ట్ర విభజనను ఆపాలన్న చిత్తశుద్ధి ఈ ఇద్దరిలోనూ లేదన్నారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో సోమవారం నిర్వహించిన మీడియా సమావేశంలో దాడి మాట్లాడారు.

సమైక్యాంధ్రను కొనసాగించాలనే ఉద్దేశమే కిరణ్‌కుమార్‌రెడ్డికి ఉంటే.. కేంద్రప్రభుత్వ నిర్ణయానికి ఆయన ఏనాడో సీఎం పదవికి రాజీనామా చేసేవారని దాడి వ్యాఖ్యానించారు. కిరణ్‌ రాజీనామా చేస్తే ఈ పరిస్థితి వచ్చేది కాదన్నారు. సోనియా గాంధీ కచ్చితంగా దిగి వచ్చేవారన్నారు. తన పదవిని కిరణ్‌ వదులుకోరని, మంత్రులను రాజీనామా చేయనివ్వరని విమర్శించారు. సీమాంధ్ర ఎంపిలు రాజీనామాలు చేసినా వాటిని ఆమోదించకుండా లోక్‌సభ స్పీకర్‌ మీద ఒత్తిడి తెచ్చేలా చేశారని ఆరోపించారు. రాష్ట్ర విభజన ప్రక్రియ పూర్తిస్థాయిలో కొనసాగుతున్నా ఇంకా ప్రజలను మోసగించే చర్యలే కిరణ్‌కుమార్‌రెడ్డి చేస్తున్నారని దాడి దుయ్యబట్టారు.

సోనియాకు వ్యతిరేకంగా కిరణ్‌ మాట్లాడగలరా? :
సోనియా గాంధీకి వ్యతిరేకంగా మాట్లాడే శక్తి కిరణ్‌కుమార్‌రెడ్డికి ఉందా? అని దాడి ప్రశ్నించారు. సోనియాకు వ్యతిరేకంగా కిరణ్‌ నిజంగా మాట్లాడితే.. ఈ పాటికే సిఎం పదవి నుంచి ఆయనను పీకిపారేసి ఉండేవారని వీరభద్రరావు వ్యాఖ్యానించారు. సోనియా గాంధీ అడుగుజాడల్లోనే నడుస్తున్న కిరణ్‌కుమార్‌రెడ్డి సీమాంధ్రలో కాంగ్రెస్‌ మట్టికొట్టుకుపోతుందన్న భయంతో 'ఇందిరా పార్టీ' పేరుతో కొత్త పార్టీని ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో డ్రామా ఆడుతున్నారన్నారు. నూకలు చెల్లిన కాంగ్రెస్‌కు ప్రత్యామ్నాయంగా కొత్త పార్టీ పెట్టి, సీట్లు సంపాదించాలనే కిరణ్‌ ఇదంతా చేస్తున్నారన్నారు. కిరణ్‌ పనులన్నీ సోనియాతో కుమ్మక్కై చేసేవే అన్నారు.

విభజన విషయంలో చంద్రబాబు నాయుడి విధానం ఏమిటో ఇప్పటి వరకూ స్పష్టం చేయలేదని దాడి విమర్శించారు. చంద్రబాబు నాయుడు తెలంగాణకు అనుకూలమా? వ్యతిరేకమా? స్పష్టం చేయాలని మళ్ళీ మళ్ళీ ప్రశ్నిస్తున్నామన్నారు. సమైక్యాంధ్రకు అనుకూలమా? వ్యతిరేకమా? వెల్లడించాలని డిమాండ్‌ చేశారు. తెలంగాణకు తాను అనుకూలమే.. కానీ ఇప్పుడు విభజించడానికి వీల్లేదంటున్న చంద్రబాబు మాటలను దాడి ఎద్దేవా చేశారు. జాతీయ స్థాయి మీడియా ప్రశ్నించినప్పుడు కూడా స్పష్టత లేకుండా చంద్రబాబు ఏవేవో సమాధానాలు చెప్పిన విధానాన్ని ఆయన ప్రశ్నించారు. ఒక పార్టీ అధ్యక్షుడిగా స్పష్టత ఇవ్వలేని పరిస్థితిలో చంద్రబాబు ఉన్నారని ఎద్దేవా చేశారు.

తెలుగువారి ఆత్మగౌరవాన్ని నట్టేట ముంచిన చంద్రబాబు నాయుడుఎవరి ఆత్మగౌరవ యాత్ర చేస్తారని దాడి సూటిగా ప్రశ్నించారు. రాష్ట్రాన్ని రెండు ముక్కలు చేయడానికి కారణమైన చంద్రబాబే తెలుగువారి ఆత్మగౌరవాన్ని నాశనం చేశారని నిప్పులు చెరిగారు. రాష్ట్రాన్ని విభజించాలంటూ అనేక లేఖలు రాసి కేంద్రాన్ని రెచ్చగొట్టింది చంద్రబాబు కాదా అని వీరభద్రరావు ప్రశ్నించారు. మళ్ళీ ఈ డ్రామాలెందుకని నిలదీశారు. ఓట్ల కోసమేనా.. టిడిపికి ఒక విధానం అంటూ లేదా? అని ఎద్దేవా చేశారు. ఏ ఎండకు ఆ గొడుగు మాదిరిగా ఎక్కడి మాట అక్కడ మాట్లాడడం ఏమిటన్నారు. ప్రజలను అయోమయానికి గురిచేసే పనులకు స్వస్తి పలకాలని చంద్రబాబుకు దాడి హితవు పలికారు.

అవిశ్వాసం ఎవరు పెట్టినా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేస్తాం :
కాంగ్రెస్‌ ప్రభుత్వంపై టిడిపి అవిశ్వాస తీర్మానం పెట్టినా, అలాంటి ప్రయత్నం చేసినా వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ తప్పకుండా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేస్తుందని దాడి వీరభద్రరావు స్పష్టంచేశారు. కాంగ్రెస్‌ పార్టీకి వ్యతిరేకంగా ఉండడమే వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ ధ్యేయం అన్నారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌కు 100 నుంచి 150 కంటే మించి పార్లమెంటు స్థానాలు దక్కబోవని తాము భావిస్తున్నామని దాడి తెలిపారు. కానీ కాంగ్రెస్సే అధికారంలోకి వస్తుందని టిడిపి వాళ్ళు ఆశిస్తున్నారన్నారు. కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వస్తుంది.. వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ దానిలో భాగం పంచుకుంటుందేమో అన్న భయమా టిడిపిది అన్నారు. కుంభకోణాల మయం యుపిఎ ప్రభుత్వం అన్నారు. కుంభకోణాల కాంగ్రెస్‌ అధికారంలోకి రావాలని కోరుకుంటున్నది చంద్రబాబు నాయుడే కాని శ్రీ వైయస్‌ జగన్మోహన్‌రెడ్డి కాదని దాడి స్పష్టం చేశారు. కాంగ్రెస్‌ పార్టీ గెలిస్తేనే తన ఆటలు చెల్లుతాయని చంద్రబాబు అనుకుంటున్నారన్నారు.

కేంద్రంలో కాంగ్రెస్‌తో కుమ్మక్కైంది చంద్రబాబు కాదా? అని దాడి సూటిగా ప్రశ్నించారు. ఎఫ్‌డిఎ‌పై ఓటింగ్ సందర్భంగా కాంగ్రెస్‌కు టిడిపి సభ్యులు ఎందుకు అనుకూలంగా వ్యవహరించారని నిలదీశారు. ఎఫ్‌డిఐకి వ్యతిరేకంగా ఓటు వేసింది వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అని గుర్తుచేశారు. మైనార్టీలో ఉన్న రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికి ఇంకా కొనసాగడానికి కారణం చంద్రబాబు నాయుడు కాదా? అని ప్రశ్నించార. కేంద్రంలోను, రాష్ట్రంలోనూ కాంగ్రెస్‌తో కుమ్మక్కైంది చంద్రబాబా, శ్రీ జగనా అన్నారు.

కాంగ్రెస్‌కు తొత్తులా శ్రీ జగన్‌ను విమర్శించేది? :

కాంగ్రెస్‌ పార్టీకి తొత్తుగా వ్యవహరించి, దానిని బ్రతికించడానికి సహాయపడుతున్న మీరా శ్రీ జగన్మోహన్‌రెడ్డిని విమర్శించేది అని టిడిపి నాయకులను దాడి తూర్పారపట్టారు. మీరా? మమ్మల్ని శంకించేది అని నిప్పులు చెరిగారు. కాంగ్రెస్‌తో కొనసాగాలని ప్రయత్నిస్తున్నది చంద్రబాబు నాయుడే అన్నారు. వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం పెట్టడానికి ప్రధాన ప్రతిపక్షం టిడిపి, దాని నాయకుడు చంద్రబాబు ముందుకు వస్తారా? అని దాడి వీరభద్రరావు సవాల్‌ చేశారు. ప్రజాస్వామ్య విధానాలకు ప్రధాన ప్రతిపక్షం టిడిపి తిలోదకాలిచ్చిందన్నారు. కాంగ్రెస్‌ పార్టీ చేస్తున్న అరాచకాల్లో టిడిపి కూడా భాగస్వామి అవడం నిజమా కాదా? అన్నారు. ఆరు నెలల్లో పోయేది, మళ్ళీ గెలిచే అవకాశం లేని కాంగ్రెస్‌ ప్రభుత్వంపై అవిశ్వాసం పెట్టగలరా? అని చంద్రబాబును ప్రశ్నించారు. కాంగ్రెస్‌ పార్టీకి, కాంగ్రెస్ ప్రభుత్వానికి‌ వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కేంద్రంలోను, రాష్ట్రంలోనూ వ్యతిరేకంగానే ఉంటామని దాడి స్పష్టంచేశారు.

ఆభాసు పాలైన కాంగ్రెస్, టిడిపిలు జనంలోకి వెళ్ళలేక, ఏమి చేయాలో తెలియని పరిస్థితుల్లోనే ఆ పార్టీల నాయకులు సమైక్య వాదం వినిపిస్తున్నారు తప్ప సమైక్యాంధ్ర కొనసాగాలని కోరుకోవడం లేదని దాడి వీరభద్రరావు ఆరోపించారు. మన రాష్ట్రాన్ని విభజించాలని అక్టోబర్‌ 3న కేంద్ర కేబినెట్‌ తీసుకున్న నిర్ణయాన్ని రద్దు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేయగలరా? అని చంద్రబాబును దాడి సవాల్‌ చేశారు. ఆ విధంగా డిమాండ్‌ చేసిన తరువాత మాత్రమే ప్రజల్లోకి యాత్ర కోసం వెళ్ళాలని సూచించారు.

చిత్తశుద్ధి ఉంటే కిరణ్‌ రాజీనామా చేయాలి :
చిత్తశుద్ధి ఉంటే.. సోనియా గాంధీకి తొత్తుగా వ్యవహరించకపోతే.. మాటల్లో నిజాయితీ ఉంటే.. ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాలని కిరణ్‌కుమార్‌రెడ్డిని దాడి డిమాండ్‌ చేశారు. సమైక్యాంధ్రకు విఘాతం కలిగిస్తూ.. కేంద్రం అన్న చర్యలూ చేసుకుపోతోందని ఆయన అన్నారు. విభజన విషయంలో కేంద్రం దూకుడును ఆపాలంటే పదవులు, అధికారాలు వదులుకోవాలని కిరణ్‌కుమార్‌రెడ్డిని డిమాండ్‌ చేశారు. అప్పుడే కేంద్రం దిగివస్తుందన్నారు. పదవులను వదులుకోకుండా కాకమ్మ కబుర్లు చెబితే ప్రజలు నమ్మే పరిస్థితి ఉండదన్నారు. కిరణ్‌కుమార్‌రెడ్డి కొత్త పార్టీ పెట్టే ముందు కాంగ్రెస్‌ పార్టీకి, పదవులకు రాజీనామా చేస్తే ప్రజలు సంతోషిస్తారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం రాజీనామా చేస్తేనే.. విభజన ప్రక్రియను సోనియా, కేంద్రం వెనక్కి తీసుకుంటాయని దాడి అన్నారు.

Back to Top