అన్నదాతను హేళన చేసిన బాబు: నాగిరెడ్డి

హైదరాబాద్‌, 30 అక్టోబర్‌ 2012: అధికారంలో ఉండగా వ్యవసాయ ఉత్పత్తులకు మద్దతు ధరలు పెంచాలని టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఏనాడూ ఆలోచన చేయలేదని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఆరోపించింది. సాగునీటి ప్రాజెక్టులకు శంకుస్థాపనలు చేయడమే గాని వాటిని పూర్తిచేయాలన్న లక్ష్యంతో ఆయన పనిచేయలేదని వైయస్‌ఆర్‌సిపి రైతు విభాగం కన్వీనర్‌ ఎంవిఎస్‌ నాగిరెడ్డి ఎద్దేవా చేశారు. టిడిపి 1999 నుంచి 2004 వరకూ ధాన్యానికి పెరిగిన మద్దతు ధర కేవలం 60 రూపాయలే అని అన్నారు. దివంగత మహానేత వైయస్‌ రాజశేఖరరెడ్డి పాలనా కాలంలో రూ. 440 పెరిగిందని వివరించారు. శ్రీకృష్ణ దేవరాయల పాలన నుంచి వైయస్‌ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రి అయ్యే వరకూ రాష్ట్రంలో కేవలం 80 లక్షల ఎకరాలకు మాత్రమే సాగునీటి వనరులు ఉంటే, వైయస్ కోటి ఎకరాలకు లక్ష కోట్లతో సాగునీరు అందిస్తానని జలయజ్ఞం పథకాన్ని చేపడితే ఎంతసేపూ చంద్రబాబు విమర్శించడమే తప్ప అది రైతులకు ఎలా అందాలని ఆలోచించలేదన్నారు.
ఆత్మహత్యలు చేసుకున్న రైతులకు పరిహారం ఇస్తే, దాని కోసమే చనిపోతారని చంద్రబాబు ఎగతాళి చేసిన విషయాన్ని నాగిరెడ్డి గుర్తుచేశారు. విద్యుత్‌ హార్సు పవర్‌ ధరను పెంచింది చంద్రబాబే అన్నారు. విపరీతంగా పెంచేసిన విద్యుత్‌ చార్జీలపై రైతులు ఉద్యమిస్తే హైదరాబాద్‌లోని బషీర్‌బాగ్‌లోను, పశ్చిమగోదావరి జిల్లా కాల్దరిలోనూ వారిపై చంద్రబాబు కాల్పులు జరిపించి పొట్టన పెట్టుకున్నారని అన్నారు. రైతుల పట్ల ఇంత అమానుషంగా ప్రవర్తించిన ఆయన ఇప్పుడు ఏ ముఖం పెట్టుకుని పాదయాత్ర పేరుతో ప్రజల మధ్యకు వస్తున్నారని నిలదీశారు. తనను తాను శిక్షించుకుంటూ పాదయాత్ర చేస్తున్నట్లు చెప్పుకుంటున్నచంద్రబాబు చేసిన తప్పులను వివరించాలని డిమాండ్‌ చేశారు. చంద్రబాబు హయాంలో మన రాష్ట్రంలో ఏ రంగమైనా పూర్తిగా దివాలా తీసిందని నాగిరెడ్డి ఎద్దేవా చేశారు. 2003 నాటి పరిస్థితే రాష్ట్రంలో ఇప్పుడూ దాపురించిందన్నారు.
చంద్రబాబు పాదయాత్రకు వైయస్‌ఆర్‌ సిపి అధ్యక్షుడు జగన్మోహన్‌రెడ్డి సోదరి షర్మిల చేస్తున్న మరో ప్రజాప్రస్థానం పాదయాత్రకు ఎంతో వ్యత్యాసం ఉందని నాగిరెడ్డి అభివర్ణించారు. వేలాదిగా తరలి వస్తున్న ప్రజలు షర్మిలకు తమ కష్టాలు చెప్పుకుంటున్నారన్నారు. షర్మిల పాదయాత్రలో చెట్లు, భవనాలపైనా మనుషులు కాస్తున్నారని అన్నారు. జగన్‌ సీఎం అయితేనే తమ సమస్యలు తీరతాయని రాష్ట్ర ప్రజలు విశ్వసిస్తున్నారన్నారు. వైయస్‌ కుటుంబాన్ని ఇబ్బంది పెట్టడానికి, జగన్మోహన్‌రెడ్డిని జైలు నుంచి బయటికి రానివ్వకుండా చూడడానికి కాంగ్రెస్‌, టిడిపిలు కుమ్మక్కయ్యాయని ఆయన ఆరోపించారు.
మైళ్ళకు మైళ్ళు నడిచి వెళ్ళినా గ్రామాల్లో మంచినీరు దొరకని దుస్థితి ప్రస్తుత ప్రభుత్వ పాలనలో దాపురించిందని నాగిరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. రైతు సమస్యలపై దృష్టి పెట్టని ప్రభుత్వం తీరును ప్రజలు గమనిస్తూనే ఉన్నారని, సమయం వచ్చినప్పుడు బుద్ధి చెబుతారని హెచ్చరించారు. వ్యవసాయ ఉత్పత్తులకు ధరల స్థిరీకరణ కోసం 3 వేల కోట్లతో జగన్మోహన̴్రెడ్డి ప్రత్యేకంగా నిధిని ఏర్పాటు చేస్తారని చెప్పారు. రైతు ఉత్పత్తులను ముట్టకుండా 24 గంటలైనా గడపగలరేమో కాంగ్రెస్‌, టిడిపి నాయకులు గుండెల మీద చేయివేసుకుని చెప్పాలని నాగిరెడ్డి సవాల్‌ చేశారు.
Back to Top