సమైక్యవాదైతే.. సీఎం ఆ రోజేం చేశారు?

హైదరాబాద్ :

‘సమైక్య సింహాన్నంటూ తనకు తానుగా డబ్బా కొట్టుకుంటున్న సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి, తెలంగాణ ప్రకటన వచ్చిన జూలై 30న ఏం చేశారు? ఆ రోజే రాజీనామా చేసి ఉంటే.. విభజన ప్రకటన వచ్చి ఉండేదా?’ అని వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు ప్రశ్నించారు. విభజనపై ఢిల్లీ నేతలు రచించిన స్క్రిప్టు మేరకు కిరణ్‌తో పాటు కాంగ్రెస్ ‌నాయకులంతా బ్రహ్మాండంగా నటిస్తున్నారని ధ్వజమెత్తారు. తెలుగు ప్రజల జీవితాలతో కాంగ్రెస్‌ పార్టీ చెలగాటం అడుతోందన్నారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో శనివారం జరిగిన మీడియా సమావేశంలో అంబటి దుయ్యబట్టారు.

‘రాష్ట్ర విభజనకు సీఎం అంగీకరించారని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇ‌న్‌చార్జి దిగ్విజయ్‌సింగ్ ప్రకటిస్తే, అదేమీ లేదని, తాను సమైక్యవాదానికే కట్టుబడ్డానని మర్నాడే కిర‌ణ్ ప్రె‌స్‌మీట్ పెట్టి చెబుతారు. ‌సీడబ్ల్యూసీ విభజన నిర్ణయం తీసుకుంటుందని సీఎంగా ఆయనకు ముందే తెలుసు. మరి జూలై 30న ఉదయమే సోనియా ఇంటికి వెళ్లి రాజీనామా పత్రం విసిరేసి ఉంటే సాయంత్రం విభజన ప్రకటన వచ్చేదా? అలా చేయకుండా ఎందుకు మౌనం దాల్చారని అడుగుతున్నా. పైగా విభజన ప్రకటన వచ్చాక 10 రోజుల దాకా కిరణ్ నోరు విప్పలేదు. సమైక్యం ముసుగులో డ్రామా‌లు ఆడుతూ ప్రజలను గందరగోళపరుస్తున్నారు. ఢిల్లీలో కాంగ్రెస్ వా‌ర్ రూ‌మ్‌లో విభజనకు అంగీకరించి, బయటేమో సమైక్యవాదం వినిపిస్తూ ప్రజలను దగా చేస్తున్నారు. పదవి కోసం సీమాంధ్ర ప్రజల భవిష్యత్తును తాకట్టు పెట్టారు’ అని విమర్శించారు.

కిరణ్‌కుమార్‌రెడ్డి ఇప్పటికైనా డ్రామాలు కట్టిపెట్టాలని అంబటి హితవు పలికారు. ‘గతంలో కావూరి సాంబశివరావు సమైక్యవాదాన్ని అడ్డుపెట్టుకొని సెటిల్మెంట్లలో భాగంగా కేంద్ర మంత్రి పదవి దక్కించుకున్నారు. కిరణ్ ఏదో సెటిల్మెంట్లు చేసుకోవడానికే డ్రామాలాడుతున్నారు. సమైక్య సింహమనే బోర్డు మెడలో వేసుకుని, ఒక పార్టీ పెట్టి, సీమాంధ్రలో కొన్ని సీట్లు గెలిచి వాటిని సోనియా కాళ్ల ముందు పెట్టేందుకు డ్రామా ఆడుతున్నారనే అనుమానం కలుగుతోంది. అందుకే విభజనకు కారకురాలైన సోనియాను కిర‌ణ్ పల్లెత్తు మాటైనా అనడం లేదు’ అన్నారు.‌ ‌సీఎం నిజంగా సమైక్యవాది అయితే సమైక్య రాష్ట్రం కోసం ఈ వంద రోజులుగా ఏం చేశార?ని ప్రశ్నించారు. కేంద్ర కేబినెట్ నిర్ణయాన్ని, జీ‌ఓఎం ఏర్పాటును ఎందుకు అడ్డుకోలేకపోయార?ని అడిగారు. విభజన డ్రామాలో అన్ని పాత్రలు కాంగ్రెస్ పార్టీయే పోషిస్తుందని విమర్శించారు.

తాజా వీడియోలు

Back to Top