9న వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ రాష్ట్ర బంద్‌

హైదరాబాద్,  28 మార్చి  2013 : పెంచిన విద్యుత్ చార్జీ‌లకు నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు నిర్వహించాలని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. ఏప్రిల్‌ 9న రాష్ట్ర వ్యాప్త బంద్‌ నిర్వహించాలని పిలుపు ఇచ్చింది. ఏప్రి‌ల్ 3‌వ తేదీన అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో ధర్నాలు నిర్వహించాలని పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ నిర్ణయించిందని కమిటీ కో ఆర్డినేటర్ కొణతాల రామకృష్ణ తెలిపారు. ఏప్రిల్ 5 బాబూ జగ్జీవన్‌రాం జన్మదినం రోజున ప్రారంభించి 14వ తేదీ అంబేద్కర్ జయంతి వరకు రాష్ట్ర‌ వ్యాప్తంగా కరెంట్‌ చార్జీల పెంపుపై 'ప్రజా బ్యాలట్' నిర్వహించనున్నట్టు ఆయన చెప్పారు. పార్టీ గౌరవ అధ్యక్షురాలు శ్రీమతి వైయస్‌ విజయమ్మ అధ్యక్షతన గురువారంనాడు లోటస్‌పాండ్‌లోని ఆమె నివాసంలో జరిగిన పిఎసి సమావేశం ఈ నిర్ణయాలు తీసుకున్నట్లు ఆయన తెలిపారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో గురువారం మధ్యాహ్నం నిర్వహించిన మీడియా సమావేశంలో రామకృష్ణ మాట్లాడారు.

ప్రజా బ్యాలట్‌లో 1) కరెంటు చార్జీలను ప్రజలు ఆమోదిస్తున్నారా? లేక వ్యతిరేకిస్తున్నారా? 2) కరెంటు సరఫరా ఈ రాష్ట్రంలో ఏ విధంగా ఉంది? బాగుంది లేదా బాగోలేదు.. ఈ ప్రశ్నలపై ప్రజల అభిప్రాయం తెలుసుకోవాలని తమ కమిటీ నిర్ణయించిందన్నారు. అన్ని మండల కేంద్రాలు, మున్సిపాలిటీలు, మేజర్‌ పంచాయతీల్లో ఏప్రిల్‌ 5 నుంచి 14 వరకూ ఈ కార్యక్రమం నిర్వహిస్తామన్నారు.

దివంగత మహానేత డాక్టర్‌ వైయస్‌ రాజశేఖరరెడ్డి ఈ దేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా చేసిన 'ప్రజాప్రస్థానం' పాదయాత్ర ప్రారంభించి ‌ఏప్రిల్ 9వ తేదీకి పది సంవత్సరాలు పూర్తవుతుందన్నారు. ఆ ప్రజా ప్రస్థానం నుంచి ఇప్పుడు జరుగుతున్న మరో ప్రజాప్రస్థానం వరకూ రాష్ట్రంలో చోటుచేసుకున్న పరిస్థితులను ప్రజలకు తెలియజేస్తామన్నారు. మహానేత వైయస్‌ఆర్‌ పాదయాత్ర చేయడానికి ముందు చంద్రబాబు పాలనలో ఉన్న దౌర్భాగ్యకరమైన పరిస్థితులే ఇప్పటి కిరణ్‌ కుమార్‌ రెడ్డి పాలనలోనూ కొనసాగుతున్నాయని అందుకు నిరసనగా 9న రాష్ట్ర వ్యాప్తంగా బంద్‌ నిర్వహించాలని పార్టీ పిఎసి నిర్ణయం తీసుకున్నదని కొణతాల చెప్పారు.

విద్యుత్‌ బిల్లు రూ. 40 వేలు రావడంతో ఒక చేనేత కార్మికుడు గుండె ఆగి చనిపోయిన సంఘటన నిన్ననే జరిగిందని, చంద్రబాబు హయాంలో వేలాది మంది రైతులు, చేనేత కార్మికులు ఆత్మహత్యలు చేసుకున్న వైనాన్ని ఈ సంఘటనలు పునరావృతం అవుతున్నాయనడానికి ఇదే నిదర్శనం అన్నారు. సిపిఎం, సిపిఐ నుంచి వై. వెంకటేశ్వరరావు, అజీజ్‌ పాషా ఈ రోజు శ్రీమతి విజయమ్మను కలిసి తాము నిర్వహించే విద్యుత్‌ ఉద్యమాలకు సంఘీభావం ప్రకటించాలని కోరారని చెప్పారు. అలాగే వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ ఉద్యమాలకూ తమ మద్దతు ఇస్తామని హామీ ఇచ్చారన్నారు. ఈ ప్రజా ఉద్యమ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు, ఈ ప్రభుత్వం కళ్ళు తెరిపించేందుకు పార్టీ శ్రేణులు, ప్రజలంతా కలిసిరావాలని కొణతాల విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమాల్లో పార్టీ గౌరవ అధ్యక్షురాలు శ్రీమతి విజయమ్మ కూడా పాల్గొంటారని ఆయన తెలిపారు.

కిరణ్‌ కుమార్‌రెడ్డి తీసుకుంటున్న నిర్ణయాల కారణంగా రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలూ తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని కొణతాల ఆవేదన వ్యక్తంచేశారు. చంద్రబాబు హయాంలోని దుర్భర పరిస్థితులను ఈ ప్రభుత్వమూ తలపించేలా చేస్తోందని దుయ్యబట్టారు. ఇలాంటి ప్రజా వ్యతిరేక ప్రభుత్వాన్ని నిలదీయాల్సి బాధ్యతను పట్టించుకోకుండా ప్రధాన ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు మహానేత డాక్టర్‌ వైయస్‌ రాజశేఖరరెడ్డి మీద బురదజల్లే విధంగా అవాస్తవాలు మాట్లాడుతున్నారని ఆయన దుయ్యబట్టారు. కేవలం తమ రాజకీయ మనుగడ కోసం కాంగ్రెస్‌, టిడిపిలు ఒక్కటై పనిచేస్తున్నాయని ఎద్దేవా చేశారు. ప్రజా కంటక ప్రభుత్వానికి టిడిపి రక్షణ కవచంలా పనిచేస్తోందని కొణతాల ఆరోపించారు. మొన్న విడుదల చేసిన 'బ్లాక్‌ పేపర్'‌లో కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని ఎలా కాపాడాలన్న తపనే టిడిపిలో కనిపించిందన్నారు.

ఆనాడు వ్యవసాయం దండగ అనడమే కాక ప్రతి ఏడాదీ విద్యుత్‌ చార్జీలు పెంచేసి రైతులు, సామాన్యుల నడ్డి విరిచిన చరిత్ర చంద్రబాబుది అని కొణతాల విమర్శించారు. కిరణ్‌ పాలనలోనూ ఇప్పుడు అదే పునరావృతం అవుతోందని ఆయన దుయ్యబట్టారు. ఇప్పుడు ఎరువుల ధరలు పెరిగిపోతున్నాయని, వంటగ్యాస్‌ ధర పెంచేశారని ఆవేదన వ్యక్తంచేశారు.

మహానేత వైయస్‌ వ్యవసాయానికి 7 గంటల ఉచిత విద్యుత్‌ను సక్రమంగా సరఫరా చేసిన విషయాన్ని కొణతాల గుర్తుచేశారు. అవసరమైతే ఎక్కువ ధరకైనా కొని ఆయన విద్యుత్‌ ఇచ్చారన్నారు. మన రాష్ట్రంలోని రైతులకు రూ. 12 వేల కోట్లు రుణ మాఫీ చేయించిన రైతు బాంధవుడు వైయస్‌ అన్నారు. ఇప్పటి ప్రభుత్వం ఇన్‌పుట్‌ సబ్సిడీని పెంచినప్పటికీ నీలం తుపాన్‌ బాధిత రైతులకు ఇంత వరకూ పరిహారం అందించలేదని కొణతాల విమర్శించారు.

బషీర్‌బాగ్‌ కాల్పులనూ బ్లాక్‌ పేపర్‌లో పెట్టాల్సింది :
విద్యుత్‌ సమస్యపై బ్లాక్‌ పేపర్ విడుదల చేసిన టిడిపి పత్రంలోని అంశాలపై కొణతాల తీవ్రంగా దుయ్యబట్టారు. తొమ్మిదేళ్ల పాలనలో దాదాపు ప్రతి ఏటా విద్యుత్‌ చార్జీలు పెంచి ప్రజల నడ్డి విరిచిన ఘనత చంద్రబాబుదని, అలాంటి వ్యక్తి వైయస్‌పై నిందలు వేయడమేమిటని ఆయన ప్రశ్నించారు. విద్యుత్‌ చార్జీలు తగ్గించాలని కోరుతూ బషీర్‌బాగ్‌ వద్ద ఆందోళన చేస్తే మరో జలియన్‌వాలాబాగ్‌ తరహాలో ఉద్యమకారులను కాల్చి చంపిన విషయం బాబు మరిచారా అని ప్రశ్నించారు. ఈ కాల్పుల ఘటనను కూడా బ్లాక్‌పేపర్‌లో పెట్టాల్సిందని అన్నారు. ఆ ఉదంతాన్ని బాబు మర్చిపోయినా రాష్ట్ర ప్రజలు ఇంకా మర్చిపోలేదని చెప్పారు. చంద్రబాబు ప్రైవేటు విద్యుత్‌ ప్రాజెక్టులతో చీకటి ఒప్పందాలు చేసుకుని ప్రజలకు ఎలా అన్యాయం చేశారో ఆ పేపర్‌లో వివరించి ఉంటే బాగుండేదని అన్నారు.


Back to Top