ముగిసిన వైయ‌స్ జ‌గ‌న్ ప్ర‌జా సంక‌ల్ప యాత్ర‌

ఇడుపుల‌పాయ నుంచి ఇచ్చాపురం

3648 కిలోమీట‌ర్లు సాగిన పాద‌యాత్ర‌

కాసేప‌ట్లో భారీ బ‌హిరంగ స‌భ‌

శ్రీ‌కాకుళం:   ప్రజా సంక్షేమమే ధ్యేయంగా... సమస్యల పరిష్కారమే లక్ష్యంగా... సంకల్పమే ఆయుధంగా... అలుపెరుగకుండా సాగిన విపక్ష నేత ప్రజాసంకల్ప యాత్ర కొద్ది సేప‌టి క్రితం ముగిసింది. తుదిదశకు చేరుకుంది. జిల్లాలో దాదాపు రెండు నెలల్లో 36రోజులపాటు అకుంఠిత దీక్షతో  నంబ‌ర్ 6న ఇడుపుల‌పాయ నుంచి ప్రారంభ‌మైన పాద‌యాత్ర ఇవాల్టికి ముగిసింది. మొత్తం 13 జిల్లాల మీదుగా ఇచ్చాపురం వ‌ర‌కు ప్ర‌జా సంక‌ల్ప యాత్ర సాగింది. చరిత్రాత్మకమైన పాదయాత్ర ముగింపు సంద‌ర్భంగా ఇచ్ఛాపురంలోని బాహుదా నదీ తీరంలో ఏర్పాటైన విజయసంకల్ప స్థూపం (పైలాన్‌)ను వైయ‌స్ఆర్‌  కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు,  ప్రతిపక్ష నేత వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆవిష్కరించారు. భారీ ఎత్తున తరలివచ్చిన పార్టీ సీనియర్‌ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు.. వైయ‌స్‌ జగన్‌ పైలాన్‌ను ఆవిష్కరించే దృశ్యాన్ని అపురూపంగా తిలకించారు. పైలాన్‌ ఆవిష్కరించడానికి ముందు ఆయన సర్వమత పెద్దల నుంచి ఆశీర్వాదాలు తీసుకున్నారు. స్థూపాన్ని ఆవిష్కరించిన అనంతరం వైయ‌స్‌ జగన్‌ కాలినడకన పాత బస్టాండ్‌ వద్దకు బయలుదేరారు.  

విలువలు, విశ్వసనీయత, భరోసా, పట్టుదలను వారసత్వంగా పుణికిపుచ్చుకున్న వైయ‌స్‌ జగన్‌ ధృఢ సంకల్పానికి ఇచ్ఛాపురం సాక్షిగా నిలిచింది.  ఆంధ్ర–ఒడిశా సరిహద్దుల్లో ఉన్న ఇచ్ఛాపురం నిజానికి ఓ చిన్న పట్టణం. అక్కడి జనాభా మహా అయితే వేలల్లోనే ఉంటుంది. కానీ రెండు రోజులుగా అక్కడ సందడే సందడి. ఇసుకేస్తే రాలనంతగా జనం.. ఎటు చూసినా పండుగ వాతావరణం.. వీధి వీధినా అంగళ్లు వెలుస్తున్నాయి. హోటళ్లన్నీ కిటకిటలాడుతున్నాయి. అక్కడకు వందల కొద్దీ వాహనాలొస్తున్నాయి. వేలాది మంది వచ్చిపోతున్నారు. ‘పాదయాత్ర ముగింపు ఎక్కడ?.. పైలాన్‌ ఆవిష్కరణ ఎక్కడ?’ ఇచ్ఛాపురం పొలిమేరల్లో కనిపించే ప్రతి వ్యక్తి నోటి నుంచి వస్తున్న ప్రశ్న ఇదీ. విశాఖ, శ్రీకాకుళం, విజయనగరం.. ఇలా అక్కడకు ఏ డిపో నుంచి వచ్చే బస్సు అయినా కిక్కిరిసిపోతోంది. ఆటోల నిండా జనమే. ద్విచక్ర వాహనాల మీద చేరుకునే వాళ్ల సంఖ్య  లెక్కే లేదు. ఆఖరి ఘట్టం ఎలా ఉంటుందోనన్న ఉత్కంఠ వారిలో స్పష్టంగా కనిపిస్తోంది. దివంగత వైఎస్‌ రాజశేఖరరెడ్డితో పాటు ఆయన కుమార్తె షర్మిల కూడా తమ పాదయాత్రలను ఇక్కడే ముగించారు. వైయ‌స్ఆర్, షర్మిల పాదయాత్ర స్థూపాలను ప్రత్యేకంగా సందర్శిస్తున్నారు. ఆ సన్నివేశాలను ప్రత్యక్షంగా చూసిన స్థానికులు తమ ఊరికి వచ్చేవారికి ఆసక్తిగా చెబుతున్నారు.  
 
 
 

Back to Top