నాయ‌కుడొచ్చాడు..న‌వ‌ర‌త్నాలు తెచ్చాడు

 వైయ‌స్ జ‌గ‌న్ ప్ర‌జా సంక‌ల్ప ప్ర‌స్థానం పూర్తై రేప‌టికి రెండేళ్లు  

14 నెలలు 3,648 కిలోమీటర్లు సాగిన జ‌న‌నేత‌ పాదయాత్ర

పాద‌యాత్ర‌లో ఇచ్చిన హామీల్లో ఏడాదిన్న‌ర పాల‌న‌లో 95 శాతం అమ‌లు

సంక్షేమ ప‌థ‌కాల‌తో మురిసిపోతున్న జనం

దేశానికే దిక్సూచిగా మారిన ఏపీ సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌

అమ‌రావ‌తి: 341 రోజులు.. 3,648 కిలోమీటర్లు.. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా.. సమస్యల పరిష్కారమే లక్ష్యంగా.. టీడీపీ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ.. నవరత్నాలు ప్రజల్లోకి తీసుకెళుతూ.. ప్రజా సంకల్పమంటూ ముందుకు సాగారు వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయ‌స్ జగన్‌మోహన్ రెడ్డి. మొత్తం 13 జిల్లాల్లోని 134 నియోజకవర్గాల్లో.. 2,516 గ్రామాల్లో.. 124 బహిరంగ సభలతో.. 55 ఆత్మీయ సమ్మేళనాలతో దాదాపు రెండు కోట్లమంది ప్రజలతో మమేకమయ్యారు. ఇలా 2017లో ఇడుపులపాయలో ప్రారంభమైన ప్రజాసంకల్ప యాత్ర.. ఇచ్ఛాపురంలో జ‌న‌వ‌రి 9, 2019న ముగిసింది. వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ప్ర‌జా సంక‌ల్ప ప్ర‌స్థానం ముగిసి రేప‌టితో రెండేళ్లు పూర్తి అవుతుంది. 

 2017 నవంబర్‌ 6..వైయస్‌ఆర్‌ జిల్లా ఇడుపులపాయ సాక్షిగా ఒక చరిత్ర పురుడు పోసుకుంది. బాధ్యతారహిత పాలన వల్ల కష్టాల్లో ఉన్న ప్రజలకు ఓ నమ్మకం, ఓ ధైర్యం, ఓ భరోసా ఇవ్వాలనే ప్రజా సంకల్పంతో వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి పాదయాత్ర మొదలుపెట్టారు. ప్రజల చెంతకే నడుచుకుంటూ వెళ్లాడు. రుతువులు మారాయి. క్యాలెండర్‌ పేజీలు మారాయి. పాదయాత్రికుడైన వైయస్‌ జగన్‌ జనం మనిషై పోయాడు. చీకటిలో వెలుగు కావాలనుకుంటాం. నిరాశలో ఆశగా ఒక భరోసా కోసం ఎదురుచూస్తాం.  రెండేళ్ల క్రితం దాకా ఐదు కోట్ల ఆంధ్రప్రదేశ్‌ సరిగ్గా ఇదే పరిస్థితిలో ఉంది. అప్పుడో పాదయాత్రికుడు వెలుగు దివ్వెగా మారాడు. భరోసాగా ప్రజల కోసం నడిచాడు. 
 
నాడు ప్రజా ప్రస్థానం. వైయస్‌ఆర్‌ను ప్రజల గుండెల్లో మరుపురాని నేతగా మలిచిన ఓ అద్భుతం. మరో ప్రజా ప్రస్థానం పేరుతో మహానేత తనయ వైయస్‌ షర్మిలమ్మ సైతం నడిచారు.  నాటి వైయస్‌ఆర్‌ పాదయాత్ర ఫలితాలు ఆయన పాలన కాలంలో ప్రతిఫలించాయి. అప్పటిదాకా విశాలాంధ్రకు అనుభవం లేని అద్భుతమైన సుపరిపాలన సాగింది. సంక్షేమం మూడు పువ్వులు ఆరు కాయలుగా విరాజిల్లితే, అభివృద్ధి పరుగులు పెట్టింది. అప్పుడు రాష్ట్రం దేశానికే దిక్సూచి. 
 
క‌న్నీళ్లు తుడుస్తూ..ధైర్యం నూరిపోస్తూ..

వణికించే చలికాలం, కానీ కష్టాల కొలిమిలో కాలుతున్న రాష్ట్ర జనం. విభజిత ఆంధ్రప్రదేశ్‌లో సమస్యలు అన్ని ఇన్ని కావు. కానీ నాటి పాలకులకు అవేవి కనిపించలేదు. ప్రజల గోడు వినిపించలేదు. ఆ పాలన కాలమంతా ఈవెంట్లమయం. గ్రాఫిక్‌మాయజాలంతో కట్టుకథలు. భ్రమరావతి భ్రమలు, సాగునీటి ప్రాజెక్టుల్లో పారిన అవినీతి. అప్పటిదాకా ప్రజా సమస్యలను అసెంబ్లీలో నినదించిన ప్రతిపక్ష నాయకుడి మాటల్ని అధికార పక్షం చెవికి ఎక్కించుకోలేదు. విపక్షనేత నిజాయితీ ప్రయత్నాలన్ని చెవిటి వాడు ముందుకు శంఖం ఊదినట్టుగా ఉండేది. ప్రజా సమస్యలంటే పట్టింపులేని ప్రభుత్వం. బాధ్యత తెలియని పచ్చ నేతలు. దోచుకోవడం, దాచుకోవడమే వారికి తెలిసిన విద్యలు. చట్ట సభలో పదే పదే ప్రతిపక్షం గొంతు నొక్కుతున్న తరుణంలో ఇక ప్రజాక్షేత్రంలోనే తేల్చుకుంటానంటూ పాదయాత్రగా బయలుదేరాడు వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి. 14 నెలల పాటు సుదీర్ఘంగా 3,648 కిలోమీటర్లు పాదయాత్ర చేసిన వైయస్‌ జగన్‌  పేదల గుండె ఘోష విన్నారు.  వైయస్‌ఆర్‌ జిల్లాలో మొదలైన పాదయాత్ర  కర్నూలు జిల్లాలో ఓ ఉప్పెనగా మారింది.జన ఉప్పెనతో ప్రకాశం బ్యారేజ్‌ ఊగింది. రాజమండ్రి వద్ద ఉన్న గోదారి బ్రిడ్జిపై జనసంద్ర ప్రకంపనలు సృష్టించింది.  ప్రతిపక్ష నేతగా ప్రజల తరఫున నిలబడ్డారు. వారి కష్టసుఖాల్లో తోడుగా నిలిచారు. కన్నీళ్లు తుడిచారు..ధైర్యం నూరిపోశారు. మంచి రోజులు వస్తాయని భరోసా కల్పించారు. తమ కోసం ఒక నమ్మకమై నడిసొచ్చిన వైయస్‌ జగన్‌లో ఒక ఆత్మబంధువును చూసుకున్నారు ప్రజలు. పల్లెపల్లెల్లోని అక్కలు, చెల్లెల్లు, అన్నలు, తమ్ముళ్లు, తాతలు, అవ్వలు, ఎండా, వానా, చలి అన్న తేడా లేకుండా జగన్ను చూడటానికి వచ్చారు. ఆశీర్వదించారు. అక్కున చేర్చుకున్నారు. వారి కష్టాలు, కన్నీళ్లు, ఆనందాలు, అనుభూతులు, ఆప్యాయతలలో వైయస్‌ జగన్‌ను భాగస్వామిని చేశారు. వారికి భరోసాగా తాను నిలబడి తీరాలన్న సంకల్పం వైయ‌స్‌ జగన్‌లో గట్టిగా నిలిచేలా చేశారు.  

రాజకీయాల్లో కొత్త చరిత్ర
దివంగత ముఖ్యమంత్రి వైయస్‌ రాజశేఖరరెడ్డి ఆశీర్వాదబలం..తండ్రి మాట నిలబెట్టాలన్న తనయుడి సంకల్ప బలం ..నేటి రాజకీయాల్లో కొత్త చరిత్రకు శ్రీకారం చుట్టాయి. వైయస్‌ జగన్‌ అనే నేను..అనే మాట ప్రజల గుండెగొంతుకలా నినాదమైన సమయం, సందర్భం ఏర్పడింది.  2019లో జరిగిన సార్వాత్రిక ఎన్నికల్లో రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల్లో ఏకంగా 151 నియోజకవర్గాల్లో వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ జెండా రెపరెపలాడింది. అఖండ మెజారిటీతో వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. పాదయాత్రలో ప్రజలకు ఇచ్చిన హామీలను తూచా తప్పకుండా అమ‌లు చేశారు. ఏడాదిన్న‌ర పాల‌న‌లో దాదాపు 95 శాతం హామీలు అమ‌లు చేసి దేశానికే దిక్సూచిలా వైయస్‌ జగన్‌ నిలిచారు. తాను ప్రవేశపెట్టిన నవరత్నాలపై ఇటీవల ఐక్యరాజ్య సమితి ఆరా తీసింది. ప్రధాని నరేంద్ర మోదీ నవరత్నాల అమలు తీరుపై అభినందనలు తెలిపారు. పక్క రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఏపీలో అమలవుతున్న పథకాలపై అధ్యాయనం చేస్తున్నారంటే వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి పాలన ఎలా ఉందో అర్థం  చేసుకోవచ్చు. ప్రాథమిక విద్య, అందరికీ ఆరోగ్యం ప్రభుత్వ బాధ్యతగా భావించారు. పాదయాత్రలో తాను చూసిన ప్రజల స్థితిగతులు, తాను పొందిన అనుభవం సంక్షేమానికి, అభివృద్ధి ప్రాతిపాదికగా మారాయి. మనమంతా ప్రజా సేవకులమంటూ అధికారులను ప్రోత్సహిస్తూ సుపరిపాలనే లక్ష్యంగా ముందుకు సాగుతున్న వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డికి ఐదు కోట్ల ఆంధ్రుల ఆశీస్సులు పుష్కలంగా ఉన్నాయని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.
 
ఇడుపుల‌పాయ టూ ఇచ్చాపురం.. 
కడప జిల్లాలో ప్రారంభమయిన ఆయన యాత్ర, కర్నూలు, అనంతపురం, చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం, గుంటూరు, కృష్ణా, పశ్చిమగోదావరి, తూర్పుగోదావరి, విశాఖపట్నం, విజయనగరం జిల్లాల మీదుగా శ్రీకాకుళం చేరుకొంది.
ప్రారంభమైన తేది - నవంబర్ 06 2017
ప్రారంభమైన ప్రాంతం - వైయ‌స్ఆర్ జిల్లా, ఇడుపులపాయ  
ముగింపు - జనవరి 09, 2019
ముగింపు ప్రాంతం - ఇచ్చాపురం శ్రీకాకుళం జిల్లా
పొదయాత్ర కొనసాగిన దూరం - 3,648 కిలోమీటర్లు
పాదయాత్ర జరిగిన రోజులు - 341
యాత్రలో మమేకమైన ప్రజలు - 2 కోట్లు
యాత్ర సాగిన జిల్లాలు - 13
యాత్ర సాగిన అసెంబ్లీ నియోజకవర్గాలు - 134
యాత్ర సాగిన గ్రామాలు - 2,516
వివిధ వర్గాల ప్రతినిధులతో సమావేశాలు - 2,500
సామాజిక వర్గాల వారీగా సమావేశాలు - 1000
 

Back to Top