‌సంక్షేమానికి విలక్షణ నమూనా వైయస్

 ముఖ్యమంత్రి అయిన తరువాత ఎలాంటి అంశాలకు ప్రాధాన్యం ఇవ్వాలన్న దానిపై డాక్టర్‌ వైయస్‌ రాజశేఖరరెడ్డికి ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడే స్పష్టత ఉండేదేమో. 2004 మే నెలలో ఆయన సీఎం అయ్యాక ప్రొఫెసర్ జయతీ ఘోష్ కమిష‌న్ వేయడం వై‌యస్ ‌లాంటి రాజకీయవేత్త నుంచి ఎదురుచూడని పరిణామం. రాజకీయాలతో పాటుగానే, 1991 తర్వాత దేశంలో ఆర్థిక సంస్కరణలకు సంబంధించిన మంచిని క్షేత్రస్థాయిలో ఆయన సూక్ష్మదృష్టితో చూశారా అనిపిస్తుంది.
సంక్షేమం- అభివృద్ధి- వృద్ధి (గ్రోత్) వీటిలో మూడవది మొదటి రెండింటితో చివరగా వచ్చి చేరింది. అయినప్పటికీ దానికున్న అంతర్జాతీయ స్వరూప స్వభావాలు, విశ్వ విపణి ప్రభావాల దృష్ట్యా అనివార్యమైనప్పటికీ వీలైనంత తక్కువగా దాని గురించి మాట్లాడేవారాయన. ఒక మిషన్‌గా ఉధృతితో సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయాలన్నది వైయస్ ఏకైక అజెండా. గమనించగలిగితే యూపీఏ దృష్టి కూడా అలాగే ఉండేది. అందుకే 2004-06 మధ్య అన్నింటికీ తెగించి జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని కేంద్రం అమలుపరచింది. దుర్వినియోగం ఉంటుందని తెలుసు, అయినా అమలు చేయాలి! ఇదే దృష్టి! ఈ నాటి గ్రామీణ ప్రాంత ప్రజల కొనుగోలు శక్తి పెరుగుదల మీద నిన్న మొన్నటి ‘క్రిసి‌ల్ రేటింగ్’ వంటి నివేదికలను వీటన్నిటి నుంచి వేరు చేసి విడిగా చూడవలసినవి ఎంత మాత్రం కాదు.‌
అప్పట్లో డాక్టర్ మన్మోహ‌న్‌సింగ్ తరచుగా అంటూ ఉండే ‘రిఫా‌ర్మ్స్ వి‌త్ హ్యూమ‌న్ ఫే‌స్’ (మానవీయ దృష్టితో సంస్కరణల అమలు) నినాదాన్ని మనసా‌ వాచా కర్మణా అమలు చేయాలని కలలుగన్న నాయకుడు డాక్టర్ వై‌యస్ రాజశేఖరరెడ్డి. డాక్ట‌ర్ ఏపీజే అబ్దు‌ల్ కలాంకు ఇష్టమైన పదం ‘పురా’... (ప్రొవైడింగ్ అర్బ‌న్ ఎమినిటీ‌స్ ఇ‌న్ రూర‌ల్ ఏరియా‌స్-‌ గ్రామీణ ప్రాంతాల్లో నగర వసతులు) దీనికి తన ట్రిపుల్ ఐటీల స్థాపన వంటి పెక్కు కార్యక్రమాలతో ఆచరణ రూపం ఇచ్చింది డాక్ట‌ర్ వై‌యస్. 
దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న పేదల వార్షికాదాయం రూ.5 నుంచి రూ.10 వేల మేర పెంచగలిగితే వారిని ప్రధాన స్రవంతిలోకి తీసుకురావడం సాధ్యం అవుతుందంటారు వివే‌క్‌దేవ్ రా‌య్, అమీరుల్లాఖా‌న్. మేధావులు చాలా చెబుతారు. కానీ నాయకులు వాటిని పట్టించుకోవడం అరుదు. కానీ వై‌యస్ అందుకు మినహాయింపు.
మన రాష్ట్రం సరిహద్దున ఛత్తీ‌స్‌గఢ్‌లో 2010, మే నెలలో దంతెవాడలో ఊచకోత సంఘటన అనంతరం న్యూఢిల్లీలోని ఇనిస్టిట్యూట్ ఫ‌ర్ కాన్ల్ఫి‌క్ట్ మేనే‌జ్‌మెంట్ డెరైక్ట‌ర్ డా‌క్టర్‌ అజయ్ సహానీ హిందూస్తా‌న్ టై‌మ్స్‌లో ఒక వ్యాసం రాశారు. ఆసక్తికరమైన ఆరంభంతో ఆయన దాన్ని మొదలుపెట్టారు. ‘భారత ప్రభుత్వానికి మావోయిస్టులను నిలువరించడానికి ఒక వ్యూహం అంటూ లేదు. అలాగే నక్సలిజంతో దారుణంగా నష్టపోతున్న రాష్ట్రాలదీ అదీ పరిస్థితి... అయితే ఒక్క ఆంధ్రప్రదేశ్ అందుకు మినహాయింపు’. 

ఎలా? 2004లో రాష్ట్రంలో ఆర్థిక సంస్కరణల రెండవ దశను అమలు‌ చేయవలసిన ముఖ్యమంత్రిగా వైయస్ బాధ్యతలు చేపట్టారు. తొలిదశ సంస్కరణల ఫలితాలు చేరని సమూహాలు, సమాజాల వద్దకు ఆయన వీటిని ఒక ఉధృతితో తీసుకుని వెళ్లారు. ఎంతో సూక్ష్మ పరిశీలన ఉంటేగాని ఒక్కొక్క గిరిజన కుటుంబానికి 3 ఎకరాల కాఫీతోటపై సాగుదారు హక్కు దఖలుపరచటం సాధ్యంకాదు. ఆదివాసీ తన కాఫీతోటలో తాను పనిచేసుకోవడాన్ని కూడా, జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పరిధిలోకి తెచ్చి వేతనం అందేలా చూశారు వై‌యస్. ఒరిస్సా, ఛత్తీ‌స్‌గఢ్‌ల సరిహద్దుల్లో ఉన్న మన మన్యసీమలో పండుతున్న ‘గిరిజన్ కాఫీ’, మన దేశం ‘ఏషియన్’తో కుదుర్చుకున్న స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంలోని ఎగుమతుల జాబితాలో చోటుచేసుకోగలిగింది. నాటి కేంద్ర వాణిజ్య మంత్రిత్వశాఖ సహాయ మంత్రి జైరాం రమే‌ష్ సేవలను అంత ముందుచూపుతో వై‌యస్ వినియోగించుకోగలిగారు.
మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం అమలుకు సంబంధించి మొదటి నుంచి మన‌ రాష్ట్రం గొప్ప నమూనాగా నిలవడం తెలిసిందే. 2009 ఫిబ్రవరిలో సెంటర్ ఫ‌ర్ పాలసీ రీసె‌ర్చ్‌కి చెందిన ‘అకౌం టబిలిటీ ఇనీషియేటివ్’ విభాగం ‘ఆంధ్రప్రదే‌శ్‌లో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం అమలులో పారదర్శకత- జవాబుదారీతనం... ఒక పరిశీలన’ పేరుతో 28 పేజీల నివేదిక తయారుచేసింది. ఈ పరిశీలనను యామినీ అయ్యర్, సలీమా సమ్జీ చేశారు. వారి పరిశీలనలో కీలకమైన అంశం ఏమిటంటే... ‘ఇది కూలీల ఆత్మస్థయిర్యాన్ని, వారి ఆత్మగౌరవాన్ని బాగా పెంచింది. అన్నింటినీ మించి స్థానిక అధికారులతో మెలగడం ఎలాగో వాళ్లకు నేర్పింది. ఈ నివేదిక రాష్ట్రంలో చంద్రబాబు హయాంలో అమలు జరిగిన ‘పనికి ఆహారం’ పథకం బాగోగులను కూడా ప్రస్తావించింది.

సంక్షేమ కార్యక్రమాల అమలు తీరు తెన్నులను క్షేత్రస్థాయిలో అధ్యయనం చేసే ‘సామాజిక తనిఖీ’ (సోష‌ల్ ఆడిటింగ్) ప్రక్రియను ఎట్టి పరిస్థితుల్లోనూ కొనసాగించి తీరవలసిందేనని వై‌యస్ దృఢచిత్తంతో నిలవడం వల్ల దేశవ్యాప్తంగా ఏదో ఒక నాటికి ఇది లోప‌ రహితంగా అమలు జరగడానికి ఆస్కారముందనే ఆశ కలుగుతూ ఉంది. నాయకుల నిబద్ధతకు కొలమానం వారి జీవిత కాలంలోనే కాదు వారి తదనంతరం కూడా నిలుస్తుంది. ‘సంక్షేమం విషయంలో వైయస్‌ది ఒక విలక్షణ నమూనా. మరణించడానికి ముందు సంచారజాతికి చెందిన పూసలవాళ్ల సంక్షేమానికి ఒక పథకాన్ని రూపొందించమని తన కార్యదర్శి ఎం.సుబ్రమణ్యంకు వైయస్ చెప్పారట. అభివృద్ధి ఫలాలు అందని వారికి అందజేయాలనే తపన ఆయన మది‌లో ఎల్లవేళలా ఉండేది. అదే వైయస్ విశిష్టత.

తాజా వీడియోలు

Back to Top