గన్నవరం(మానేపల్లి): వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయస్ జగన్‌మోహన్ రెడ్డి సీఎం అయితేనే రాష్ట్రంలో పేదలకు పూర్తిన్యాయం జరుగుతుందని వైయస్సార్ సీపీ సీజీసీ సభ్యుడు కుడుపూడి చిట్టబ్బాయి, రాష్ట్ర యువజన విభాగం అధ్యక్షుడు జక్కంపూడి రాజా, కో ఆర్డినేటర్ చిట్టిబాబులు అన్నారు. గడపగడపకూ వైయస్సార్ కాంగ్రెస్ కార్యక్రమంలో భాగంగా వారు నియోజకవర్గంలోని మానేపల్లిలో పర్యటించి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం వందప్రశ్నలతో కూడిన ప్రజాబ్యాలెట్‌ను అందజేసి మార్కులు వేయించారు.
అర్హులందరికీ పింఛన్లు ఇవ్వాలి
నెల్లూరు: జన్మభూమి కమిటీలతో సంబంధం లేకుండా అర్హులందరికీ పింఛన్లు మంజూరు చేయాలని నెల్లూరు నగర ఎమ్మెల్యే డాక్టర్ అనిల్‌కుమార్ యాదవ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గడపగడపకూ వైయస్సార్ కాంగ్రెస్ కార్యక్రమంలో భాగంగా ఆయన స్థానిక 49వ డివిజన్ సంతపేట, ఈద్గామిట్ట, రాజేంద్రనగర్, తూకుమానుకుమిట్ట, మెట్లరేవు ప్రాంతాల్లో ఆయన పర్యటించారు. చంద్రబాబు ప్రజావ్యతిరేక విధానాలను గడపగడపలో వివరించారు. నగరంలో 35వేల పింఛన్లు పెండింగ్‌లో ఉన్నాయని, ఈ విషయాన్ని అనేకమార్లు కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లానని చెప్పారు.
వాడుకోవడానికి నీరు కూడా లేదు
జగ్గయ్యపేట(వత్సవాయి): గడపగడపకూ వైయస్సార్ కాంగ్రెస్ కార్యక్రమం వైయస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సామినేని ఉదయభాను ఆధ్వర్యంలో వత్సవాయిలో కొనసాగింది. ఈ సందర్భంగా ఎస్సీ కాలనీకి చెందిన ప్రజలు తమ సమస్యలను ఉదయభాను ఎదుట మొరపెట్టుకున్నారు. నీళ్లు లేక నానా అవస్థలు పడుతున్నామని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఉదయభాను మాట్లాడుతూ... రాష్ట్రం రాక్షసపాలన రాజ్యమేలుతుందని ధ్వజమెత్తారు. అధైర్యపడొద్దని, త్వరలోనే వైయస్సార్‌సీపీ అధికారంలోకి వస్తుందన్నారు.
ఎస్సీ, ఎస్టీ కాలనీలంటే అంత అలుసెందుకు
ప్రత్తిపాడు: అధ్వాన్న స్థితిలో ఉన్న ఎస్సీ, ఎస్టీ కాలనీలను... అధికారులు గానీ, ప్రజాప్రతినిధులు గానీ పట్టించుకున్న పాపాన పోవడం లేదని వైయస్సార్ సీపీ ప్రత్తిపాడు నియోజకవర్గ కో ఆర్డినేటర్ పర్వత శ్రీపూర్ణ చంద్రప్రసాద్ ఆరోపించారు. ప్రత్తిపాడు మండలం ఒమ్మంగి గ్రామంలోని దళితవాడలో ఆయన గడపగడపకూ వైయస్సార్ కాంగ్రెస్ కార్యక్రమం నిర్వహించారు. తమ పింఛన్లు తొలగించారని, రోడ్డు సౌకర్యం బాగా లేదని, డ్వాక్రా రుణాలు మాఫీ కాలేదని, ఇంటి నిర్మాణానికి ఆర్థిక సహాయం అందలేదని పలువురు తమ సమస్యలను చంద్రప్రసాద్‌కు విన్నవించారు.
