పాల‌కుల క‌ళ్లు తెరిపించేందుకే ప్ర‌జా చైత‌న్య పాద‌యాత్ర‌
ప్ర‌కాశం:  వెలిగొండ ప్రాజెక్టు తీవ్ర నిర్లక్ష్యానికి గురైందని, పాలకుల కళ్లు తెరిపించాలన్న ఉద్దేశంతో ప్రజా చైతన్య పాద యాత్ర చేప‌ట్టిన‌ట్లు వైవీ సుబ్బారెడ్డి పేర్కొన్నారు. సోమ‌వారం వైవీ సుబ్బారెడ్డి 13వ రోజు పాద‌యాత్ర చెట్ల‌మిట్ట నుంచి ప్రారంభించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న‌కు దారిపొడ‌వునా స్థానికులు ఆత్మీయ స్వాగ‌తం ప‌లికారు. పూల‌వ‌ర్షం కురిపించి అభిమానాన్ని చాటుకున్నారు. రాజ‌న్న రాజ్యం మ‌ళ్లీ రావాల‌ని, జ‌గ‌న‌న్న ముఖ్య‌మంత్రి కావాల‌ని నిన‌దించారు. వైవీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ..  పర్సంటేజీల కోసం టీడీపీ ప్రభుత్వం కొత్త కాంట్రాక్టర్లకు అప్పచెప్పటానికి ప్రయత్నిస్తుందని ఆయన అన్నారు. వైయ‌స్ జ‌గన్‌ సీఎం అయితేనే వెలిగొండ ప్రాజెక్టు పూర్తవుతుందని, తీవ్ర కరువు కాటకాలతో అలమటిస్తున్న పశ్చిమ ప్రాంతం సస్యశ్యామలం అవుతుంద అన్నారు. రాష్ట్రంలో రాక్షస పాలన సాగుతోందని, ప్రజలకు కనీసం తాగు, సాగునీరు ఇవ్వలేని పరిస్థితుల్లో టీడీపీ ప్రభుత్వం ఉందని ధ్వ‌జ‌మెత్తారు. జిల్లాలో నాలుగేళ్లుగా కరువు విలయ తాండవం చేస్తుందని, 700 అడుగుల లోతు బోరు వేసినా నీరు పడే పరిస్థితి లేదని ఆయన అన్నారు. నీరుపడినా అవి తాగేందుకు ఉపయోగపడటం లేదని వైవీ ఆవేదన వ్యక్తపరిచారు. జిల్లాలో నెలకొన్న పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని దివంగత నేత డాక్టర్ వైయ‌స్‌ రాజశేఖరరెడ్డి వెలిగొండ ప్రాజెక్టుకు నిధులు కేటాయించి పనులు వేగవంతం చేశారని, అప్పట్లోనే దాదాపు 70 శాతం పనులు పూర్తయ్యాయని ఆయన అన్నారు. 2014లో అబద్ధపు వాగ్దానాలు చేసి అధికారంలోకి వచ్చిన టీడీపీ.. ప్రాజెక్టుకు నిధులు కేటాయించకుండా తీవ్ర జాప్యం చేసిందని ఆయన అన్నారు. ఎన్నికలు సమీపిస్తుండటంతో సంక్రాంతి నాటికి జిల్లా ప్రజలకు వెలిగొండ ప్రాజెక్టు నుంచి సాగర్‌ జలాలు అందిస్తామని చెప్పడం హాస్యాస్పదంగా ఉందని ఆయన అన్నారు. వైయ‌స్ఆర్‌  కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే వెలిగొండ ప్రాజెక్టు పూర్తవుతుందని, ఆ ప్రాజెక్టు కింద ఉన్న భూములు సస్యశ్యామలం అవుతాయని, ప్రజలు తాగునీటికి ఇబ్బంది పడే పరిస్థితి ఉండదని ఆయన అన్నారు. రాష్ట్రాభివృద్ధిని దృష్టిలోపెట్టుకొని వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి పాదయాత్ర చేస్తున్నారని, మాటతప్పని నాయకుడు వైయ‌స్ జగన్‌ను సీఎంను చేసుకోవలసిన అవసరం ఉందని ఆయన అన్నారు.కార్య‌క్ర‌మంలో ఎమ్మెల్యే ఆదిమూల‌పు సురేష్‌, ఎమ్మెల్సీ ఆళ్ల నాని, త‌దిత‌రులు పాల్గొన్నారు. 
Back to Top