అనపర్తి: తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారి పవిత్ర లడ్డూ ప్రసాదాన్ని రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకున్న చంద్రబాబు నాయుడు చేసిన ఘోర అపచారం కోట్లాది భక్తుల మనోభావాలను తీవ్రంగా కలచివేసిందని అనపర్తి నియోజకవర్గ వైయస్‌ఆర్‌సీపీ సమన్వయకర్త, మాజీ శాసనసభ్యులు డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి గారు ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి హోదాలో ఉండి ఎలాంటి ఆధారాలు లేకుండా తిరుమల లడ్డూలో జంతువుల కొవ్వు కలిసిందంటూ చేసిన ప్రకటన రాష్ట్ర రాజకీయ చరిత్రలోనే అత్యంత దుర్మార్గమైన కుట్రగా నిలిచిందన్నారు. ఈ దుష్ప్రచారం వల్ల రాష్ట్ర ప్రజలకు, భక్తులకు ఎలాంటి నష్టం కలగకూడదన్న ఉద్దేశంతో వైయస్‌ఆర్‌సీపీ ఆధ్వర్యంలో, పార్టీ అధ్యక్షులు శ్రీ వైయస్ జగన్ మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు పాప పరిహార పూజలు నిర్వహిస్తున్నామని తెలిపారు. చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సహా కూటమి నేతలు తిరుమల లడ్డూ ప్రసాదంపై చేసిన ఆరోపణలు పూర్తిగా అసత్యమని కోర్టుకు సమర్పించిన చార్జ్‌షీట్‌లో స్పష్టంగా తేలిందన్నారు. న్యాయస్థానంలో నిజాలు వెలుగులోకి వచ్చినప్పటికీ కావాలనే అబద్ధపు ప్రచారం కొనసాగించడం మరింత దుర్మార్గమైన చర్యగా అభివర్ణించారు. ఈ నేపథ్యంలో శనివారం (31-01-2026) అనపర్తి నియోజకవర్గం, అనపర్తి గ్రామం పాతఊరులోని నేషనల్ వెంకట్ రెడ్డి గారి నివాసం సమీపంలో ఉన్న పోతారెడ్డి రామాలయం ప్రాంగణంలోని శ్రీ వేంకటేశ్వర స్వామి దేవాలయంలో డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి గారి ఆధ్వర్యంలో ప్రత్యేక పరిహార పూజలు నిర్వహించారు. ఈ పూజల ద్వారా కలియుగ దైవం తిరుమల వెంకటేశ్వర స్వామి వారు కూటమి నేతలకు సద్బుద్ధి ప్రసాదించాలని ప్రార్థించారు. ఆంధ్రప్రదేశ్ రాజకీయ చరిత్రలోనే ఇది ఒక పెద్ద కుట్రగా మిగిలిపోతుందన్నారు. అబద్ధాల పునాదులపై, విషప్రచారంతో ప్రజల మనోభావాలను రెచ్చగొట్టి రాజకీయ లాభాలు పొందాలన్న చంద్రబాబు రచించిన స్కెచ్ చివరకు పూర్తిగా కూలిపోయిందని పేర్కొన్నారు. నిజం గెలిచిందని, అబద్ధం ఓడిపోయిందని స్పష్టం చేశారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు NDDB, NDRI వంటి జాతీయ స్థాయి ప్రయోగశాలలు నిర్వహించిన పరీక్షల్లో తిరుమల లడ్డూ తయారీలో ఉపయోగించే నెయ్యిలో ఎలాంటి జంతు కొవ్వు లేదని స్పష్టమైందన్నారు. ఈ నివేదికలు కోట్లాది భక్తులకు ఊరటనిచ్చాయని చెప్పారు. నిజాలు నిర్ధారణ కాకుండానే తిరుమల క్షేత్ర ప్రతిష్టను దెబ్బతీయడానికి చంద్రబాబు వెనకాడలేదని విమర్శించారు. తిరుమల గౌరవం, రాష్ట్ర ప్రతిష్ట, హిందూ మత గౌరవం అన్నింటినీ పణంగా పెట్టి రాజకీయాలు చేశారని ఆరోపించారు. చివరగా డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి గారు మాట్లాడుతూ, రాజకీయాల కోసం దేవుడినీ వదలని చంద్రబాబు తీరును ప్రజలు గుర్తించాలన్నారు. అబద్ధపు ప్రచారాల పట్ల అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర ప్రజలకు వైయస్‌ఆర్‌సీపీ విజ్ఞప్తి చేస్తోందని తెలిపారు. ఈ పాప పరిహార పూజా కార్యక్రమంలో అనపర్తి నియోజకవర్గ వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.