విభజన కుట్రలో ఆ ముగ్గురూ నిందితులే

హైదరాబాద్ :

కేంద్రానికి పదే పదే లేఖలు రాస్తూ.. రాష్ట్రాన్ని ముక్కలు చేయాలని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గుర్తుచేయడం వల్లే ప్రస్తుత దుస్థితి వచ్చిపడిందని వైయస్ఆర్ ‌కాంగ్రెస్‌ పార్టీ కేంద్ర పాలక మండలి సభ్యులు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, దాడి వీరభద్రరావు ఆగ్రహం వ్యక్తంచేశారు. రాష్ట్ర విభజనకు కారకులైన నిందితులలో ఎ-1 సోనియా, ఎ-2 చంద్రబాబు, ఎ-3 కిరణ్‌కుమార్‌రెడ్డి అని వారు ధ్వజమెత్తారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో బుధవారం నిర్వహించిన మీడియా సమావేశంలో వారిద్దరూ మాట్లాడారు.

టీడీపీని ప్రజలు తిరస్కరించినా పట్టించుకోకుండా రాజకీయ లబ్ధి కోసం కేంద్రాన్ని రెచ్చగొట్టేలా ‘విభజన మీరు చేస్తారా? నన్ను చేయమంటారా? అసెంబ్లీలో మీరు తీర్మానం పెట్టకపోతే మేం పెడతాం’ అన్న చంద్రబాబు వ్యాఖ్యల వల్లే 2009 డిసెంబర్ 9న విభజన ప్రకటన వచ్చిందన్నారు. రాష్ట్ర విభజన విషయంలో కేంద్రం వెనక్కి తగ్గిన తర్వాత అఖిలపక్షం అంటూ ప్రకటనలు చేసి రాష్ట్ర విచ్ఛిన్నానికి కారకుడయ్యారని చంద్రబాబుపై ఉమ్మారెడ్డి, దాడి తీవ్రంగా మండిపడ్డారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని ఏపీఎన్జీవోలు కోరితే ‘ఏం మనవారు బెంగళూరు, చెన్నై వెళ్లి బతకడం లేదా?’ అంటూ విభజనను సమర్థించేలా చంద్రబాబు మాట్లాడారన్నారు.

సీడబ్ల్యూసీ నిర్ణయం తీసుకున్న జూలై 30నే కిరణ్‌కుమార్‌రెడ్డితో పాటు కేంద్ర, రాష్ట్ర మంత్రులు, విపక్ష సభ్యులంతా రాజీనామా చేసి ఉంటే ఈ రోజు విభజన జరిగేదే కాదన్నారు. డిసెంబర్ 9న చిదంబరం తెలంగాణ ప్రక్రియ ప్రారంభమైందని చెప్పినప్పుడు మూకుమ్మడిగా రాజీనామాలు చేయటంతో విభజన నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్న వైనాన్ని వారు గుర్తుచేశారు.

కేంద్ర కేబినెట్ సమావేశాల్లో మౌనం దాల్చిన మంత్రులు ఇప్పుడు పార్లమెంటులో నిరసనల పేరుతో డ్రామా‌లు ఆడుతున్నారని ఉమ్మారెడ్డి, దాడి విమర్శించారు. సోనియాగాంధీ చెప్పినందువల్లే గతంలో రాజీనామా చేయలేదని అంటున్న కిరణ్ ఇప్పుడు ఆమె పచ్చజెండా ఊపినందు‌ వల్లే పదవి నుంచి తప్పుకున్నారా? అని నిలదీశారు.

Back to Top