ప్రత్యేకహోదాపై పార్లమెంట్ లో పోరాడుతాం

హోదాపై చంద్రబాబుకు చిత్తశుద్ధి లేదు
ఇచ్చిన హామీని కేంద్రం నిలబెట్టుకోవాలి
పార్లమెంట్ లో హోదాను ప్రకటించాలి
వైఎస్సార్సీపీ ఎంపీల డిమాండ్

న్యూఢిల్లీః పార్లమెంట్ లో రాష్ట్రానికి ప్రత్యేకహోదా ప్రకటన చేయాలని వైఎస్సార్సీపీ ఎంపీలు మేకపాటి రాజమోహన్ రెడ్డి, వైవి సుబ్బారెడ్డిలు కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పార్లమెంట్ సాక్షిగా యూపీఏ ఇచ్చిన హామీని నిలబెడతామని ఆనాడు ఎన్డీఏ చెప్పిందని, ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాల్సిన బాధ్యత ఇప్పుడున్న కేంద్రంపై ఉందని అన్నారు. అధికారంలోకి వచ్చి 17 నెలలయినా ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేకహోదా ఇవ్వడంలో కేంద్రం తాత్సారం చేస్తోందని ఎంపీలు ఆరోపించారు. 

ప్రత్యేకహోదా రాష్ట్రానికి జీవనాడి వంటిదని ఎంపీలు అభివర్ణించారు. ప్రత్యేకహోదా వస్తేనే రాష్ట్రం అన్ని విధాలుగా అభివృద్ధి చెందుతుందన్నారు. హోదా కోసం వైఎస్సార్సీపీ ముందునుండి  పోరాటం కొనసాగిస్తుందని... ఇప్పటికే ఏపీ ప్రతిపక్ష నేత, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ నాయకత్వంలో రాష్ట్రానికి ప్రత్యేకహోదా సాధించేందుకు రకరకాల ఉద్యమాలు చేసినట్లు ఎంపీలు తెలిపారు. ఢిల్లీలో ప్రధాని సహా కేంద్రమంత్రులను పలుమార్లు కలిసి హోదా ఇవ్వాలని అర్థించామన్నారు. ఢిల్లీలో దీక్ష, రాష్ట్ర బంద్ సహా గుంటూరులో  వైఎస్ జగన్ ఏడు రోజుల పాటు ఆమరణ నిరాహార దీక్ష కూడా చేశారన్నారు. ఐనా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయని వైఎస్సార్సీపీ ఎంపీలు పైరయ్యారు.  హోదాపై పార్లమెంట్ లో కేంద్రాన్ని నిలదీస్తామన్నారు. 

రాష్ట్రానికి హోదా సాధించడంలో చంద్రబాబు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని ఎంపీలు మండిపడ్డారు. కేంద్రంలో భాగస్వామ్య పక్షంగా ఉండి కూడా ప్యాకేజీల పేరుతో మోసం చేస్తున్నారని దుయ్యబట్టారు. ఇప్పుడు కొత్తగా మోడ్రన్ కేటగిరి అంటూ మరోరకంగా మభ్యపెట్టే కార్యక్రమాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రి పదవులు, మిత్రపక్షం మెప్పు కోసం పాకులాడుతూ రాష్ట్ర అవసరాలను స్వార్థప్రయోజనాల కోసం తాకట్టుపెడుతున్నారని చంద్రబాబుపై నిప్పులు చెరిగారు. చంద్రబాబుకు ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా హోదా కోసం పోరాడాలన్నారు. 

అదేవిధంగా రాష్ట్ర విభజన తర్వాత వెనుకబడిన జిల్లాలుగా 7 జిల్లాలను ప్రకటించారు. వాటికి కూడా పూర్తిస్థాయిగా నిధులు మంజూరు చేయలేదు. వాటిని కూడా సాధించేందుకు వైఎస్సార్సీపీ తరుపున కృషిచేస్తామని ఎంపీలు ప్రకటించారు.  ప్రకాశం జిల్లాను వెనుకబడిన జిల్లాల్లో చేర్చాలని గతంలోనే వైఎస్ జగన్ నాయకత్వంలో ప్రధానిని కోరినట్లు చెప్పారు. దాని గురించి కూడా పార్లమెంట్ లో కేంద్రాన్ని ప్రశ్నిస్తామన్నారు. 8 వ జిల్లాగా చేర్చాలని డిమాండ్ చేస్తామన్నారు.
Back to Top