హైదరాబాద్‌ నుంచి పొమ్మంటే ఎలా?

న్యూఢిల్లీ, 28 ఆగస్టు 2013:

ఆంధ్ర రాష్ట్రం కలిసే ఉండాలని దివంగత మహానేత డాక్టర్ వై‌యస్ రాజశేఖరరెడ్డి కోరుకున్నారని ఆయన సతీమణి‌, వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ గౌరవ అధ్యక్షురాలు శ్రీమతి వైయస్ విజయమ్మ అన్నారు. తెలుగు ప్రజలంతా కలిసి ఉండాలని, అందరూ సంతోషంగా ఉండాలని ‌ఆయన కోరుకున్నారన్నారు. సమన్యాయం చేయాలంటూ వైయస్ఆర్ కాంగ్రె‌స్ పార్టీ బుధవారం ఢిల్లీలోని జంత‌ర్‌ మంత‌ర్ వద్ద ధర్నా చేపట్టింది. శ్రీమతి వైయస్ విజయమ్మ నేతృత్వంలో పార్టీ ‌నాయకులు ఈ ధర్నాలో పాల్గొన్నారు. ధర్నా ప్రాంగణంలో ఉంచిన మహానేత డాక్టర్ వై‌యస్ రాజశేఖరరెడ్డి చిత్రపటానికి ముందుగా పూలమాల వేసి శ్రీమతి‌ విజయమ్మ నివాళులు అర్పించారు. అనంతరం ధర్నాలో కూర్చున్నారు.

ఈ సందర్భంగా శ్రీమతి విజయమ్మ మాట్లాడుతూ.. రాష్ట్రంలో ప్రభుత్వ పాలన గాడి తప్పిందని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో నేడు ఏ ఒక్కరూ సంతోషంగా లేరని ఆమె అన్నారు. వైషమ్యాలకు టిడిపి, కాంగ్రెస్ పార్టీలే కారణమని‌ శ్రీమతి విజయమ్మ వ్యాఖ్యానించారు. రాష్ట్రం అగ్నిగుండంగా మారిందని అన్నారు. తెలుగు ప్రజల మధ్య విద్వేషాలు రగిల్చారని ఆమె విచారం వ్యక్తంచేశారు. రాష్ట్ర విభజనపై సమన్యాయం చేయాలనే వై‌యస్ఆర్ కాంగ్రె‌స్ పార్టీ డిమాండ్ చేస్తు‌న్నదన్నారు. రాష్ట్రాన్ని విభజిస్తే ఏ విధంగా న్యాయం చేస్తారని శ్రీమతి విజయమ్మ ప్రశ్నించారు.

రాష్ట్రం కలిసి ఉండాలని వైయస్ఆర్ కోరుకున్నారని‌ శ్రీమతి విజయమ్మ తెలిపారు. అన్ని ప్రాంతా అభివృద్ధికి ఆయన విశేషంగా కృషిచేశారన్నారు. అరవై ఏళ్ళుగా కలిసి నిర్మించుకున్న హైదరాబాద్ నుంచి వెళ్ళిపొమ్మంటే ఎలా అని ‌శ్రీమతి విజయమ్మ ప్రశ్నించారు. మూడు ప్రాంతాల ప్రజలు కలిసి అభివృద్ధి చేసుకున్న హైదరాబాద్ నగరాన్ని ఒక్క తెలంగాణ ప్రాంతానికే ఎలా కేటాయిస్తారంటూ ‌ఆమె కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీశారు. రాష్ట్ర విభజన విషయంలో అసెంబ్లీలో తీర్మానం అవసరం లేదనటం ఎంతవరకూ సమంజసమన్నారు. స్పీకర్ ఫార్మా‌ట్లో రాజీనామాలు చేసింది ఒక్క వై‌యస్ఆర్ కాంగ్రె‌స్ పార్టీ ఎమ్మె‌ల్యేలు, ఎంపిలే అని శ్రీమతి విజయమ్మ పేర్కొన్నారు. కాంగ్రెస్, టిడిపి ఎమ్మెల్యేలు స్పీకర్ ఫా‌ర్మాట్లో రాజీనామాలు చేస్తే ‌సిడబ్ల్యుసి వెనక్కి తగ్గుతుందన్నారు.

మహానేత డాక్టర్‌ వైయస్‌ రాజశేఖరరెడ్డిగారు కలలు కన్న రాష్ట్రమేనా ఇప్పుడిలా మారిపోయిందని శ్రీమతి విజయమ్మ ఆవేదన వ్యక్తంచేశారు. రాష్ట్ర విభజన సిడబ్ల్యుసి నిర్ణయమైనా, యుపిఎ నిర్ణయమైనా, భవిష్యత్తులో ప్రభుత్వం నిర్ణయం అవుతుందని చెబుతుంటే చాలా ఆందోళన కలిగించిందని శ్రీమతి విజయమ్మ అన్నారు. రాష్ట్రంలో కొన్ని కోట్ల మంది ప్రజలు రోడ్ల మీదికి వచ్చి ఆందోళనలు చేస్తున్నారని ఆమె ఆవేదన వ్యక్తంచేశారు. ఉద్యోగులంతా పెన్‌డౌన్‌ చేశారన్నారు. సాక్షాత్తు రాష్ట్ర సచివాలయంలో, విద్యుత్‌ సౌధ, ఎల్ఐసి, ఇరిగేషన్‌ కార్యాలయంలో ఇలా ప్రతి కార్యాలయంలోనూ ఉద్యోగులు రెండు వర్గాలుగా విడిపోయి ఆందోళనలు నిర్వహిస్తున్న పరిస్థితి నెలకొన్నదని, పరిపాలన స్తంభించిపోయిందని ఆమె ఆవేదన వ్యక్తచేశారు. న్యాయవాదులు, వైద్యులు కూడా ప్రాంతాల వారీగా చీలిపోయి పరస్పరం విమర్శించుకుంటున్న పరిస్థితి వచ్చిందన్నారు.

ముఖ్యమంత్రి, మంత్రులు తమ తమ కార్యాలయాలకు కూడా వెళ్ళని పరిస్థితి ఉందని శ్రీమతి విజయమ్మ విచారం వ్యక్తంచేశారు. రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న దుస్థితికి కాంగ్రెస్, టిడిపిలే కారణమని దుమ్మెత్తిపోశారు. భాషా ప్రయుక్త రాష్ట్ట్రాలను మొదటి ఎస్సార్సీలో తొలి ప్రధాని పండిట్‌ జవహర్‌లాల్‌ నెహ్రూ ఆంధ్రప్రదేశ్, కర్నాటక, కేరళ, తమిళనాడులను ఏర్పాటు చేశారని, అతి చిన్న రాష్ట్రమైనా ఈ క్రమంలో తమకు ప్రత్యేక రాష్ట్రం కావాలన్న నాగాలాండ్‌ ప్రజల కోరిక మేరకు విభజించారని శ్రీమతి విజయమ్మ తెలిపారు. వాటిని అసెంబ్లీ ఏకగ్రీవ తీర్మానాల ద్వారానే ఏర్పాటు చేశారన్నారు. బిజెపి మూడు రాష్ట్రాలు ఇచ్చినప్పుడు కూడా అసెంబ్లీ ఏకగ్రీవ తీర్మానం ద్వారానే ఇచ్చిందన్నారు. అయితే, ఆంధ్రప్రదేశ్‌ను విభజించే విషయంలో మాత్రం అసెంబ్లీ తీర్మానం అవసరం లేదని కొందరు చెప్పడాన్ని ఆమె తప్పుపట్టారు. మధ్యప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా దిగ్విజయ్‌ సింగ్‌ ఉన్నప్పుడే అసెంబ్లీలో తీర్మానం చేసే ఉత్తరాఖండ్‌ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసిన వైనాన్ని గుర్తుచేశారు.

33 మంది ఎంపిలను గెలిపించి 2009లో కేంద్రంలో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి రావడానికి దోహదం చేసిన మన రాష్ట్రాన్ని ఆ పార్టీ ముక్కలు చేస్తోందని శ్రీమతి విజయమ్మ నిప్పులు చెరిగారు. ఏ ప్రాతిపదిక మీద విభజన చేయాలనుకుంటోందో చెప్పకుండా కోట్లాది మంది జీవితాలతో కాంగ్రెస్‌ పార్టీ చెలగాటం ఆడుతున్నదన్నారు.

ఇక చంద్రబాబు విషయానికి వస్తే.. ఒక భాష రెండు రాష్ట్రాలు అని, నాలుగైదు లక్షల కోట్లిస్తే.. సీమాంధ్రలో రాజధానిని నిర్మించుకుంటామంటూ చెప్పడాన్ని శ్రీమతి విజయమ్మ తప్పుపట్టారు. హైదరాబాద్‌ లాంటి రాజధానిని నాలుగైదు లక్షల కోట్లతో కట్టగలరా? అని చంద్రబాబును ఆమె సూటిగా ప్రశ్నించారు. ప్రజల పక్షాన ఒక్క వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ మాత్రమే పోరాడుతోందని ఆమె పేర్కొన్నారు. మహానేత హయాంలో మూడు ప్రాంతాల్లోనూ సమంగా అభివృద్ధి కార్యక్రమాలు చేశారన్నారు. మూడు ప్రాంతాల్లో‌ అవసరాలకు సరిపడినంత విద్యుత్ ఉండాలని జెన్కోను బలీయం చేశారన్నారు. విజయవాడ, భూపాలపల్లి, కృష్ణపట్నంలలో విద్యుత్‌ ప్రాజెక్టులు ఏర్పాటు చేశారన్నారు. హైదరాబాద్‌ను కూడా అనేక విధాలుగా ఆయనే అభివృద్ధి చేశారన్నారు.

మహానేత వైయస్‌ఆర్‌ వారసత్వ పార్టీగా వచ్చిన వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఏర్పాటైందని, ఒక వేళ రాష్ట్ట్రాన్ని విభజించాల్సి వస్తే.. ఎవరి మనోభావాలూ దెబ్బతినకుండా, అన్యాయం జరగకుండా ఒక తండ్రిలా చేయాలని కోరామన్నారు. అఖిలపక్షంలో కూడా ఇదే విషయాన్ని చెప్పామన్నారు. రాష్ట్రంలోని అందరికీ సమన్యాయం కావాలని అప్పుడు ఇప్పుడూ కూడా వైయస్ఆర్‌ కాంగ్రెస్ పార్టీ‌ చెబుతోందన్నారు. తెలంగాణ ప్రకటన రావడానికి ఐదు రోజుల ముందే తమ పార్టీ ఎమ్మెల్యేలు రాజీనామాలు చేశారన్నారు. రాష్ట్ర పరిస్థితులపై కేంద్ర హోంమంత్రి షిండేకు పార్టీ ఎమ్మెల్యేల చేత లేఖ రాయించామన్నారు. కొన్ని కోట్ల మంది రోడ్ల మీద పడి ఆక్రందనలు చేస్తున్నా కేంద్రంలోను, రాష్ట్రంలోనూ ఎవరికి వినిపించడంలేదని శ్రీమతి విజయమ్మ ఆవేదన వ్యక్తంచేశారు. ఈ పరిస్థితుల్లో తాను, జగన్‌బాబు కూడా తమ పదవులకు రాజీనామాలు చేశామన్నారు.

విభజన నిర్ణయం ప్రకటించిన తరువాత 13 రోజులకు బయటికి వచ్చిన సిఎం కిరణ్‌కుమార్‌రెడ్డి తనను మనం అడగాల్సిన ప్రశ్నలను మనల్ని అడుగుతున్నారని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్‌ పార్టీ వేసిన అంటోని కమిటీ సమావేశాల్లో తెలంగాణపై వెనక్కి తగ్గేది లేదని దిగ్విజయ్‌ సింగ్ ఉదయం సాయంత్రం చెబుతుండడాన్ని తప్పుపట్టారు. సమస్యలుంటే ఆంటోని కమిటీకి చెప్పుకోవాలంటున్నారని, ఇంతకు ముందు వేసిన ప్రణబ్‌ ముఖర్జీ కమిటీ ఏమి చేసిందని, రాజశేఖరరెడ్డిగారు వేసిన రోశయ్య కమిటీ ఏం చేసిందని శ్రీమతి విజయమ్మ ప్రశ్నించారు. రూ. 30 కోట్లు ఖర్చు చేసి శ్రీకృష్ణ కమిటీ ఇచ్చిన నివేదిక సంగతేమైందన్నారు. రాష్ట్రాన్ని విభజించవద్దన్న శ్రీకృష్ణ కమిటీ నివేకను ఎందుకు పట్టించుకోలేదన్నారు. ఆంటోని కమిటీలో మన రాష్ట్రానికి ప్రాతినిధ్య లేకపోవడమేమిటని నిలదీశారు. ఆంధ్ర ప్రజల మనోభావాల గురించి సోనియా గాంధీకి ఏమి తెలుసని ప్రశ్నించారు.

ఏ పార్టీని పిలిచి మాట్లాడకుండానే, నష్టపోలే ప్రజల మనోభావాలు తెలుసుకోకుండానే విభజన నిర్ణయం ఎలా తీసుకుంటారని శ్రీమతి విజయమ్మ నిలదీశారు. అధికారం తమ చేతిలో ఉందని అడ్డగోలుగా విభజించడం తప్పన్నారు. రెండవ ఎస్సార్సీకి కేసీఆర్‌ కూడా అంగీకరించే సంతకం చేశారని తెలిపారు. ఇప్పుడు వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ చెబుతన్న విషయాన్నే అప్పుడు రోశయ్య కమిటీకి రాజశేఖరరెడ్డిగారు చెప్పారని, దానిని ఆ కమిటీ నమోదు చేసిందన్నారు. నిధులు, నీళ్ళు, హైదరాబాద్‌ లాంటి సమస్యలకు సమాధానాలు దొరికినప్పుడు మాత్రమే విభజన వీలవుతుందని వైయస్ఆర్‌ చెప్పారన్నారు. అయితే, విభజనకు బీజం వేసింది వైయస్‌ అంటూ ఆయన పేరును వాడుతున్నారని శ్రీమతి విజయమ్మ ఆగ్రహం వ్యక్తంచేశారు. తెలుగు జాతి అంతా ఒక్కటిగా ఉండాలనే వైయస్ఆర్‌ కోరుకున్నారన్నారు. వైయస్ఆర్‌ ఎంతటి సమదృష్టి కలవారో అందరికీ తెలుసన్నారు.

 న్యాయం చేయలేకపోతే రాష్ట్రాన్ని యధాతథంగా ఉంచాలని తమ పార్టీ కోరుతోందని శ్రీమతి విజయమ్మ అన్నారు. లేని పక్షంలో విభజించే హక్కును, అధికారాన్ని ఏ విధంగా తీసుకుంటారని ఆమె ప్రశ్నించారు. రాష్ట్ట్రాన్ని అడ్డగోలుగా ముక్కలు చేస్తే కుప్పం నుంచి శ్రీకాకుళం వరకూ ఉప్పునీరు తప్ప మంచినీరు ఎక్కడ ఉందని అడిగారు. రాష్ట్రం కలిసి ఉన్నప్పుడే.. కర్నాటక నుంచి నీరు తెచ్చుకోలేని పరిస్థితి ఉందని, మధ్యలో మరో రాష్ట్రం వస్తే శ్రీశైలం, నాగార్జునసాగర్‌కు నీళ్ళు ఎక్కడి నుంచి తెస్తారని ప్రశ్నించారు. పోలవరానికి నీళ్ళు ఎలా నింపుతారన్నారు. మిగులు జలాలపై ఆధారపడి కట్టిన ప్రాజెక్టుల గతేం కావాలన్నారు. కృష్ణా పరీవాహక ప్రాంతం అంతా ఒక వైపున ఉంచితే తప్ప న్యాయం జరగదన్నారు. తుంగభద్ర నుంచి మన రాష్ట్రానికి ఈ రోజుకూ 50 శాతం నీరు కూడా వచ్చే పరిస్థితి లేదన్నారు.

పరిశ్రమలు, అభివృద్ధి, ఉద్యోగావకాశాలు అన్నీ హైదరాబాద్‌లోనే కేంద్రీకృతమయ్యాయని, రాష్ట్రం విడిపోతే సీమాంధ్రలో చదువుకున్న యువత భవిష్యత్తు సంగతి ఏమిటని శ్రీమతి విజయమ్మ ప్రశ్నించారు. సీమాంధ్ర మొత్తంలో ఒక్క విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ తప్ప మరొక్క పెద్ద పరిశ్రమ కూడా లేని విషయాన్ని ఆమె గుర్తుచేశారు. హైదరాబాద్‌లోని ఉద్యోగులకు భద్రత ఏదన్నారు. సిడబ్ల్యుసి నిర్ణయాన్ని ప్రకటించిన వెంటనే సీమాంధ్రుల వెళ్ళిపోవాల్సిందే.. నో ఆప్షన్‌ అంటూ కేసీఆర్‌ బెదిరించడాన్ని ఆమె తప్పుపట్టారు. విడిపోవాలనుకున్న వారికి రాజధాని ఇస్తారా? కలిసి ఉండాలనుకునే వారిని వెళ్ళిపొమ్మంటారా? అని శ్రీమతి విజయమ్మ నిలదీశారు. తెలంగాణ ప్రాంతంలోని ప్రజలు కూడా విభజనను కోరుకోవడం లేదన్నారు. ప్రాణహిత చేవెళ్ళ పూర్తయితే తప్ప తెలంగాణకు న్యాయం జరగదన్నారు.

జగన్‌బాబును అన్యాయంగా జైలులో పెట్టినప్పటికీ నిరంతరం ప్రజల సమస్యల గురించే ఆలోచిస్తున్నారని, నిర్బంధంలో కూడా ప్రజలు, న్యాయం కోసమే నిరవధిక నిరాహార దీక్ష చేస్తున్నారని శ్రీమతి విజయమ్మ పేర్కొన్నారు. జగన్‌బాబును అక్రమంగా జైలులో పెట్టి మంగళవారానికి 15 నెలలు పూర్తయిందని, ఆయన విషయంలో ధర్మానికి, అధర్మానికి మధ్య పెద్ద యుద్ధమే జరుగుతోందన్నారు. విలువలు, విశ్వసనీయత, మాటకు కట్టుబడిన జగన్మోహన్‌రెడ్డిని జైలులో పెట్టారన్నారు. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం కోసం అనేక ప్రాంతాలు కోల్పోయామన్నారు.

రాష్ట్రానికి ఇంత అన్యాయం జరుగుతున్నా చంద్రబాబు నాయుడు నోరెత్తడంలేదని శ్రీమతి విజయమ్మ విమర్శించారు. ఓట్లు, సీట్ల కోసం కాంగ్రెస్, టిడిపిలు రాజకీయాలు చేస్తున్నాయన్నారు. అన్ని ప్రాంతాలకూ సమన్యాయం జరిగేందుకు ప్రతి ఒక్కరూ కలిసి రావాలని శ్రీమతి విజయమ్మ పిలుపునిచ్చారు.

తాజా ఫోటోలు

Back to Top