పవన్‌ ప్రశ్నలకు బాబు సమాధానం చెప్పాలి


–  చంద్రబాబుపై పవన్‌ విమర్శలు కొత్తవేమీ కావు
– వైయస్‌ఆర్‌సీపీ చెబుతున్నవే పవన్‌ తన ప్రసంగంలో చెప్పారు
– పవన్‌ ఇన్నాళ్లు మౌనంగా ఉండటం తప్పే
– వైయస్‌ జగన్‌ సహసోపేత నిర్ణయంతో టీడీపీ, జనసేన, బీజేపీలో తీవ్ర పరిణామాలు 
– ఈ పరిణామాలతో రాష్ట్రానికి మేలు జరగాలని కోరుతున్నాం
– ఏపీలో రాక్షస పాలన అంతానికి పవన్‌ నడుం బిగించాలి
– అసెంబ్లీ మీద విరక్తి కలిగి సమావేశాలు బహిష్కరించాం
విజయవాడ: రాష్ట్రంలో రాక్షస పాలన సాగుతుందని, ఈ  పాలన అంతం కావాలని వైయస్‌ఆర్‌సీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు అన్నారు. నిన్న జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ సంధించిన ప్రశ్నలకు చంద్రబాబు సమాధానం చెప్పాలని ఆయన డిమాండు చేశారు. పవన్‌ చేసిన విమర్శలపై అంబటి రాంబాబు స్పందించారు. విజయవాడలోని పార్టీ కార్యాలయంలో గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు.  రాష్ట్రంలో తెలుగు దేశం పార్టీ అధికారంలోకి వచ్చాక చంద్రబాబు సీఎంగా ప్రమాణస్వీకారం చేసిన తరువాత మొట్టమొదటి సారిగా జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ ఘాటుగా విమర్శించారని తెలిపారు. ఇది పెద్ద ఎత్తున చర్చకుదారితీసిందన్నారు. పవన్‌ కళ్యాణ్‌ మాట్లాడిన మాటలు కానీ, విమర్శలు కానీ కొత్తవేవి కాదన్నారు. ఇవి 2014 నుంచి నేటి వరకు వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ చేస్తున్న విమర్శలే అన్నారు. ఇసుక మాఫియా, లోకేష్‌ అవినీతి, వనజాక్షిపై జరిగిన దాడి..ఇలా ప్రతిది కూడా వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌పార్టీ నిరంతరం మాట్లాడుతున్న అంశాలనే పవన్‌ కళ్యాణ్‌ నిన్న గుంటూరు నుంచి వినిపించారన్నారు. ఇది మంచి పరిణామమే అయినా..ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే పవన్‌కు ఈ వాస్తవాలు ఇంతకు ముందే తెలిసీ వ్యూహాత్మకంగా ఇప్పుడు మాట్లాడారా? అన్నది పవన్‌ సమాధానం చెప్పాలన్నారు. పవన్‌కు ఎప్పుడో ఈ వాస్తవాలు తెలిసి అప్పుడు మాట్లాడకపోతే ఆయన మౌనం ఈ రాష్ట్రానికి చాలా నష్టం చేసినట్లే అన్నారు. వనజాక్షిపై దాడి జరిగిన ప్పుడే ఇది తప్పు అని, ఇసుక మాఫియా జరిగినప్పుడే ఇది దోపిడీ అని చెప్పకపోవడంతో రాష్ట్రానికి నష్టం జరిగిందన్నారు. ఇందుకు పవన్‌ కూడా మూల్యం చెల్లించుకోకతప్పదని హెచ్చరించారు. టీడీపీ అధికారంలోకి వచ్చేందుకు పవన్‌ కళ్యాణ్‌ చంద్రబాబును భుజాన వేసుకొని మోశారన్నారు. టీడీపీలో పవన్‌ కళ్యాణ్‌ కూడా భాగస్వామిగా ఉన్నారన్నారు. మేం మాట్లాడిన మాటలకు చంద్రబాబు సమాధానం చెప్పకపోవచ్చు అని, కానీ మీ పార్టనర్‌ ఇంత ఘాటుగా విమర్శలు చేశారంటే దానికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత మీపై ఉందన్నారు. పవన్‌ కళ్యాణ్‌ చంద్రబాబుపై విమర్శలు చేసినా, చంద్రబాబు ఎన్‌డీఏ నుంచి బయటకు వచ్చినా, బీజేపీ టీడీపీపై విమర్శలు చేసినా..వీటన్నింటికి ఒకే ఒక్క పరిణామం వైయస్‌ జగన్‌ ఫిబ్రవరి 13, నెల్లూరు జిల్లా కలిగిరిలో చేసిన ప్రకటనే కారణమన్నారు. ఏప్రిల్‌ 6న ప్రత్యేక హోదా కోసం వైయస్‌ఆర్‌సీపీ ఎంపీలు రాజీనామా చేస్తారని వైయస్‌ జగన్‌ సహసోపేత నిర్ణయం తీసుకోవడంతో పరిణామాలే వేగంగా మారాయన్నారు. పవన్‌ తన పార్టనర్‌ చంద్రబాబును పక్కకు నెట్టేసి విమర్శలు చేస్తున్నారని, ఇప్పటిదాకా బీజేపీతో కలిసిన టీడీపీ మంత్రులు రాజీనామా చేశారన్నారు. మాపై పవన్‌ చేసిన విమర్శలకు సమాధానం చెబుతున్నామన్నారు.పవన్‌ కళ్యాన్‌ లోకేష్‌ అవినీతి, ఇసుక మాఫియా వంటి ఆరోపణలపై సమాధానం చెప్పాల్సిన బాధ్యత చంద్రబాబుపై ఉందన్నారు. 
– పవన్‌ కళ్యాణ్‌ ఒక సామాన్యమైన కానిస్టేబుల్‌ కుమారుడు అయి ఉండవచ్చు అయితే, ఆయన ఓ నగ్న సత్యాన్ని మరిచిపోయారన్నారు. పవన్‌ అత్యంత ఆధరణ కలిగిన సినిమా నటుడు అని గుర్తు చేశారు. మెగాస్టార్‌ చిరంజీవి తమ్ముడు కాబట్టే ఆయనకు అంత గుర్తింపు ఉందన్నారు. రాష్ట్రంలో బీజేపీ, జనసేన కలిసి చంద్రబాబు రూపంలో అధికారాన్ని రూపొందించారన్నారు. ఆయన అధికారం సమాప్తం కాబోతుందని, మరో ఏడాదిలో ఎన్నికలు ఉన్న సందర్భంలో ఈ ముగ్గురు విడిపోతున్నారన్నారు. అధికారమనే తోలు విడిపోతున్నప్పుడు ఎవరి దారిలో వారు విడిపోతున్నారని విమర్శించారు. ఈ రాజకీయ పరిణామం రాష్ట్రానికి మేలు చేస్తుందా అని ప్రశ్నించారు. ఈ రాజకీయ పరిణామాలతో రాష్ట్రానికి మేలు జరగాలని వైయస్‌ఆర్‌సీపీ భావిస్తుందన్నారు. రాష్ట్రంలో రాక్షస పాలన, అన్యాయమైన, అక్రమ పరిపాలన అంతం కావడం కోసం ఈ పరిణామాలు జరగాలని మేం కోరుతున్నామన్నారు. రాష్ట్రంలో నరకాసుర పాలన సాగుతుందని ధ్వజమెత్తారు. ఆ రావణాసురుడిని వధించాల్సిందేనని, నరకాసురుడి బొడ్డులో బాణం వదలాల్సిందే అన్నారు. నరకాసురుడు, రావణాసురుడిని సంహరిస్తే తప్ప రాష్ట్రం బాగుపడదన్నారు. ఇలాంటి పాలనను పారద్రోలాల్సిన బాధ్యత అందరిపై ఉందని అంబటి రాంబాబు కోరారు.  ఏపీలో రాక్షస పాలన అంతానికి పవన్‌ నడుం బిగించాలని సూచించారు. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తూ అసెంబ్లీ నిర్వహిస్తున్నారని నిప్పులు చెరిగారు. అసెంబ్లీ మీద విరక్తి కలిగి మేం సమావేశాలు బహిష్కరించామని చెప్పారు.
 
Back to Top