కాపు రిజర్వేషన్లపై బాబుకు చిత్తశుద్ధి లేదు


 
– కాపు ఓట్లతోనే బాబు సీఎం అయ్యారు
–  మంజునాధ కమిషన్‌ రిపోర్టు అసెంబ్లీలో ప్రవేశపెట్టలేదు
– – టెక్నికల్‌గా రిజర్వేషన్ల ప్రక్రియను నీరుగార్చేందుకు బాబు కుట్ర
గుంటూరు: కాపు రిజర్వేషన్లపై చంద్రబాబుకు చిత్తశుద్ధి లేదని వైయస్‌ఆర్‌సీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు విమర్శించారు. అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లో బీసీలకు అన్యాయం జరుగకుండా కాపులను బీసీ జాబితాలో చేర్చుతానని మాట ఇచ్చి మోసం చేశారని మండిపడ్డారు. కాపుల ఓట్లతోనే చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యారని తెలిపారు. అధికారంలోకి వచ్చి నాలుగన్నరేళ్లు అవుతున్నా కాపు రిజర్వేషన్ల అంశం కనుచూపు మేర కూడా లేదని ధ్వజమెత్తారు. నాలుగేళ్లలో రిజర్వేషన్‌ ప్రక్రియ ముందడుగు వేయలేదని ఆందోళన వ్యక్తం చేశారు. ముద్రగడ పద్మనాభం కాపుల హక్కుల కోసం ఉద్యమ బాట పట్టిన తరువాత చంద్రబాబు కళ్లు తెరిచారన్నారు. మంజునాథ్‌ను చైర్మన్‌గా చేస్తూ మరో ముగ్గురు సభ్యులతో కలిసి కమిషన్‌ ఏర్పాటు చేశారన్నారు. కమిటీ సభ్యులు రిపోర్టు ఇవ్వకముందే చంద్రబాబు హడావుడిగా అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపించి చేతులు దులుపుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మంజునాథ్‌ రిపోర్టు రాకుండానే కాపు రిజర్వేషన్ల అంశాన్ని చంద్రబాబు టెక్నికల్‌గా నీరుగార్చేందుకు ఇలాంటి చర్యలు చేపట్టారని విమర్శించారు. మంజునాథన్‌ ఏం చెప్పారో ఆ రిపోర్టు బయట పెట్టాలని అంబటి రాంబాబు డిమాండు చేశారు. ఈ అంశంపై ఉన్న అనుమానాలను చంద్రబాబు నివృత్తి చేయాలని పట్టుబట్టారు. కాపు కార్పొరేషన్‌కు ఐదేళ్లలో రూ.5 వేల కోట్లు ఇస్తానని చెప్పి, నాలుగేళ్లలో రూ.1300 కోట్లు మాత్రమే ఇచ్చారని దుయ్యబట్టారు. 






 
Back to Top