గెలుపు గుర్రాలు కాదు..అమ్ముడుపోయిన గాడిదలు


–చట్టాలకు వ్యతిరేకంగా శాసన సభ నడుస్తోంది
 – పార్టీ ఫిరాయించిన వారిలో నలుగురు మంత్రులుగా ఉన్నారు
– ఫిరాయింపుదారులపై వేటు వేస్తేనే అసెంబ్లీకి వస్తాం
– చంద్రబాబుకు స్పీకర్‌ పాలాభిషేకం చేయడం ధర్మమేనా?
– ఎన్‌టీఆర్‌కు వెన్నుపోటు పొడిచిన వ్యక్తి చంద్రబాబు
– వైయస్‌ఆర్‌సీపీలోకి వచ్చే వారిని రాజీనామా చేసి రావాలని చెప్పాం
 
విజయవాడ: చంద్రబాబు ఇటీవల గెలుపు గుర్రాలకు టికెట్లు ఇస్తామన్నారని, పార్టీ ఫిరాయించిన వారికి టికెట్లు రావని, వారు గెలుపు గుర్రాలు కాదని, అమ్ముడుపోయిన గాడిదలని వైయస్‌ఆర్‌సీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు ఎద్దేవా చేశారు.  పార్టీ మారిన ఎమ్మెల్యేలు చంద్రబాబు చేసిన అభివృద్ధి చూసి టీడీపీలో చేరలేదని, అమ్ముడుపోయారని విమర్శించారు. పదవులు, డబ్బుల కోసం అమ్ముడపోయారని మండిపడ్డారు.  ముఖ్యమంత్రి చంద్రబాబు, స్పీకర్‌ యాంటీ డిపెన్స్‌ లాను గౌరవించి పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేస్తే తప్పకుండా వైయస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి వస్తారని అంబటి రాంబాబు తెలిపారు. గురువారం విజయవాడలోని పార్టీ కార్యాలయంలో అంబటి రాంబాబు మీడియాతో మాట్లాడారు.  శాసన సభ ఒక పవిత్రమైనదని, మన దౌర్భాగ్యం ఏపీలో ఉన్న శాసన సభ చాలా విచిత్రంగా ఉందన్నారు. చట్టాలు అమలు చేయడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైయస్‌ఆర్‌సీపీ తరఫున 67 మంది గెలిచారని, ఇవాళ అసెంబ్లీ చూస్తే..ప్రతిపక్షం నుంచి గెలిచిన నలుగురు మంత్రులుగా ఉన్నారని, వారితో కలిపి 22 మంది శాసన సబ్యులు పార్టీ ఫిరాయించి అధికార పార్టీలో ఉన్నారన్నారు. వారు చంద్రబాబుకు భజన చేస్తున్నారని, ఇది చాలా చిత్రమైన వ్యవహారమన్నారు. ప్రజాస్వామ్యదేశాల్లో ఈ ప్రపంచంలో ఎక్కడా కూడా ఇలాంటి సభను చూసి ఉండరన్నారు. శాసనసభలో చట్టాలున్నాయని, సాంప్రదాయాలు ఉన్నాయని, వీటిని చంద్రబాబు పక్కన పెట్టారన్నారు. పార్లమెంట్‌లో మొన్న రాహుల్‌ గాంధీ కూడా మాట్లాడారన్నారు. ఏపీ అసెంబ్లీలో మాత్రం వైయస్‌ జగన్‌ పది నిమిషాలు మాట్లాడితే..ఇక్కడి స్పీకర్‌ 9 సార్లు కట్‌ చేశారన్నారు. చంద్రబాబు మాత్రం అసెంబ్లీలో రంకెలెస్తారని తప్పుపట్టారు. చరిత్రలో ఓ మహిళా ఎమ్మెల్యేను ఏడాది పాటు సస్పెండ్‌ చేశారన్నారు. ఈ సభ కన్నా ఎన్‌టీఆర్‌ ట్రస్ట్‌ భవన్‌ బెటర్‌ అన్నారు. అతిదారుణంగా అసెంబ్లీని నిర్వహిస్తున్నారన్నారు. అందుకే ఈ సభను బహిష్కరించాలని మేం నిర్ణయం తీసుకున్నామన్నారు. మా పార్టీ తరఫున గెలిచి అధికార పార్టీలో చేరిన వారిపై వేటు వేయాలని కోరితే ఇంతవరకు పట్టించుకోలేదన్నారు. వారిపై ఎలాంటి చర్యలు తీసుకోకుండా మమ్మల్ని సభకు పిలవడం ఏంటి దారుణమన్నారు. కనీసం జ్ఞానం వస్తుందేమో అని ఇన్నాళ్లు వేచి చూశామన్నారు. ఇవాళ నుంచి సభ జరుగుతుందని, మా నుంచి చంద్రబాబుకు లేఖ రాశామన్నారు. ఎవరైతే మా పార్టీ నుంచి అవతలి పార్టీలో చేరారో, చంద్రన్న సేవలో నిమగ్నమైన ఎమ్మెల్యేలతో లేఖ రాయించారన్నారు. వీరు రాసిన లెటర్‌ చూస్తే ఆశ్చర్యంగా ఉందన్నారు. ఎవరైనా పార్టీ మారవచ్చట. అయతే పార్టీ మారిన వారు ఎందుకు ఆ పదవికి రాజీనామా చేయడం లేదని ఆయన నిలదీశారు. ఈ లేఖ చంద్రబాబే రాసి ఉంటారని అనుమానం వ్యక్తం చేశారు. గెలుపు గు్రరాలకే టికెట్లు ఇస్తామని, అమ్ముడపోయిన గాడిదలకు చంద్రబాబు టికెట్టు ఇవ్వరని ఆయన వ్యాఖ్యలు చేసినట్లు చెప్పారు. తెలంగాణలో టీడీపీ ఎమ్మెల్యేలు పార్టీ మారితే అప్పట్లో చంద్రబాబు పశువులను కొన్నట్లు కొన్నారని విమర్శించారని, ఆయన ఎలా కొన్నారని ప్రశ్నించారు. అసెంబ్లీ రాకుంటే ఎమ్మెల్యేలు వేతనాలు ఎలా తీసుకుంటారని చంద్రబాబు పేర్కొనడం విడ్డూరంగా ఉందన్నారు. గతంలో చంద్రబాబు ప్రతిపక్షంలో ఉంటూ పాదయాత్ర చేస్తూ అసెంబ్లీకి వెళ్లకుండానే జీతాలు తీసుకున్నారన్నారు. చట్టాలు, ధర్మాలు చంద్రబాబుకు వర్తించవా అని ప్రశ్నించారు. చంద్రబాబు ఏ పార్టీ నుంచి ఎదిగారని, అలాంటి వ్యక్తి దివంగత ముఖ్యమంత్రి వైయస్‌ రాజశేఖరరెడ్డిని విమర్శించడం సిగ్గుచేటు అన్నారు. పిల్లనిచ్చిన మామనే వెన్నుపొటు పొడిచి ముఖ్యమంత్రి అయ్యారని గుర్తు చేశారు. 

– స్పీకర్‌ చట్టాలను గౌరవించడం లేదని అంబటి రాంబాబు విమర్శించారు. సభా నాయకుడు చంద్రబాబుకు పాలాభిషేకం చేసిన ఏకైక స్పీకర్‌ కోడెల శివప్రసాదరావు అన్నారు. స్పీకర్‌ వ్యవస్థను భ్రష్టుపట్టించిన వ్యక్తి మాకు నీతులు చెప్పడం బాధాకరమన్నారు. చట్టాలను గౌరవించని చంద్రబాబును స్పీకర్‌ ఎందుకు ప్రశ్నించలేకపోతున్నారని ఫైర్‌ అయ్యారు. స్పీకర్‌ ఎందుకు 22 మంది ఎమ్మెల్యేలు, నలుగురు మంత్రులపై అనర్హత వేటు వేయలేదని ప్రశ్నించారు. సంప్రదాయాలను పాట్టించే పార్టీ వైయస్‌ఆర్‌సీపీ అన్నారు. గతంలో కాంగ్రెస్‌ నుంచి మా పార్టీలో చేరితే ఉప ఎన్నికలకు వెళ్లి వారిని గెలిపించుకున్నామన్నారు. నంద్యాల ఉప ఎన్నికల సమయంలో ఎమ్మెల్సీ చక్రపాణిరెడ్డి మా పార్టీలో చేరితే ఆయనతో రాజీనామా చేయించి పార్టీలో చేయించుకున్న విలువులు ఉన్న నాయకుడు వైయస్‌ జగన్‌ అన్నారు. పార్టీ మారిన నాయకులది దుర్మార్గమైన మనస్తత్వమన్నారు. రేపు చంద్రబాబు టికెట్టు ఇవ్వకపోతే ఆయన్ను కూడా విమర్శిస్తారన్నారు. శాసన సభకు వెళ్లకూడదన్న దురుద్దేశం వైయస్‌ఆర్‌సీపీకి లేదన్నారు. తక్షణమే పార్టీ ఫిరాయించిన వారిపై అనర్హత వేటు వేయండి..మేం సభకు రాకపోతే అప్పుడు అడగండని సవాలు విసిరారు. వైయస్‌ఆర్‌సీపీ అసెంబ్లీకి వచ్చేందుకు సిద్ధమే అని ఆయన స్పష్టం చేశారు. ఇప్పటికైనా చంద్రబాబు, స్పీకర్‌ చట్టాలను గౌరవించాలని అంబటి రాంబాబు సూచించారు.
 

Back to Top