<br/>హైదరాబాద్) నాగార్జున విశ్వ విద్యాలయంలో రిషితేశ్వరి ఆత్మహత్య, తదనంతర పరిస్థితుల్లో ప్రభుత్వ పాత్రను వైఎస్సార్‌సీపీ తప్పు పడుతోంది. దీనికి ప్రధాన కారణం ఆర్కిటెక్చర్ కళాశాల ప్రిన్సిపాల్ బాబురావు అని, ఆయన్ని కేసులో మొదటి ముద్దాయిగా చేర్చాలని పార్టీ డిమాండ్ చేస్తోంది. ఇందుకు సంబందించి పార్టీ మహిళా విభాగం అధ్యక్షురాలు రోజా మీడియాతో మాట్లాడారు. ముఖ్యమంత్రి కనీసం రిషితేశ్వరి తల్లిదండ్రులకు కనీసం అపాయింట్ మెంట్ కూడా ఇవ్వలేదని ఆమె గుర్తు చేశారు. విద్యార్థులు క్యాంపస్ కు వెళితే లాఠీ ఛార్జీ చేశారని ఆమె అన్నారు. ప్రిన్సిపాల్ బాబురావు ఉమనైజర్ అని, తైతక్క లాడుతున్నాడని ఆమె మండిపడ్డారు. రిషితేశ్వరి, ఆమె తండ్రి వచ్చి ఫిర్యాదులు ఇచ్చినా పట్టించుకోక పోవటం వల్లనే ఇంతటి దారుణం జరిగిందని రోజా ఆవేదన వ్యక్తం చేశారు. ప్రిన్సిపాల్ అంతటి ఉత్తముడు లేడు అన్నట్లుగా టీడీపీ వర్గాలు మాట్లాడటాన్ని ఆమె తప్పు పట్టారు.కాగా, రిషితేశ్వరి ఆత్మహత్య ఘటనకు సంబంధించి వైఎస్సార్ సీపీ ఒక నిజ నిర్ధారణ కమిటీ ని ఏర్పాటు చేసింది. కే. పార్థ సారధి, లేళ్ల అప్పిరెడ్డి, ఆర్ కే రోజా, మెరుగు నాగార్జున, వంగవీటి రాధాకృష్ణ, గొట్టిపాటి రవికుమార్ లను సభ్యులుగా చేర్చారు. ఆత్మహత్య లో నిందితుల ప్రమేయం, దర్యాప్తులో ప్రభుత్వ ప్రమేయం, కుల వివక్ష వంటి అంశాల్ని పరిశీలించి ఈ కమిటీ ఒక నివేదిక అందచేయనుంది.