గవర్నరు గారూ! జోక్యం చేసుకోరూ!!

హైదరాబాద్ 13 జూన్ 2013:

కేంద్ర నేర పరిశోధన సంస్థ(సీబీఐ) యూపీయే ప్రభుత్వానికీ, రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షం టీడీపీకి తొత్తులా వ్యవహరిస్తోందని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు రాష్ట్ర గవర్నర్ ఇ.ఎస్.ఎల్. నరసింహన్‌కు తెలియజేశారు. ఇందుకు సంబంధించిన ఆధారాలను అందజేస్తున్నట్లు పేర్కొన్నారు. గురువారం మధ్యాహ్నం వారు గవర్నరును కలిశారు. గవర్నరుకు వారు సమర్పించిన వినతి పత్రం పూర్తి పాఠం..
గౌరవనీయులు
శ్రీ ఇ.ఎస్.ఎల్. నరసింహన్ గారు,
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర గవర్నరు,
రాజ్ భవన్
హైదరాబాద్

మాననీయులైన గవర్నరు గారికి,
కేంద్ర నేర పరిశోధన సంస్థ(సీబీఐ) యూపీఏ ప్రభుత్వ పంజరంలోని చిలుకలా వ్యవహరిస్తోంది. యూపీఏ రహస్య మద్దతుదారు అయిన టీడీపీకి కూడా అది సహకరిస్తోంది. దర్యాప్తు సంస్థల స్వతంత్ర ప్రతిపత్తి, న్యాయం.. చట్టం మీద గౌరవమున్న ప్రతి ఒక్కరికీ సీబీఐ, ఈడీ, ఐటీ విభాగాల వైఖరి ఆందోళన కలిగిస్తోంది. వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డిపై పెట్టిన కేసు కాంగ్రెస్, టీడీపీల ప్రేరేపితమనే విషయం అందరికీ తెలుసు. కాంగ్రెస్ ఎమ్మెల్యే డాక్టర్ శంకరరావు వేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యం, టీడీపీ దానికి జత కలవడం దీనికి ప్రబల ఉదాహరణ. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఇది అవాంఛనీయ పరిణామం. కొత్తగా ఆవిర్భవించిన రాజకీయ పార్టీని తప్పించడం కోసం అధికార, ప్రధాన ప్రతిపక్షాలు దర్యాప్తు సంస్థలను దుర్వినియోగం చేయడం గర్హనీయం. సీబీఐ పంజరంలో చిలుకలా మారిపోయిందన్నది మేమన్నమాట కాదు..దేశ సర్వోన్నత న్యాయస్థానమే ఈ వ్యాఖ్య చేసింది. సీబీఐ డైరెక్టరు కూడా దీనిని అంగీకరించారు. ఇలాంటి పరిస్థితుల్లో న్యాయం కోసం మేమెక్కడికి వెళ్ళాలి?

పద్దెనిమిది అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికల ప్రచారంలో మా పార్టీ అధ్యక్షుడు శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి దూసుకువెళ్ళారు. ఆ ఎన్నికలలో టీడీపీ అన్ని స్థానాలలో ఓటమి పాలయ్యింది. ఇది సహజంగానే ఆ పార్టీకి ఆగ్రహాన్ని కలిగించింది. మరో అపజయాన్ని అంగీకరించలేని స్థితికి ఆ పార్టీ వెళ్లిపోయింది.

5-5-2012న లోక్‌సభలో టీడీపీ ఎంపీ నామా నాగేశ్వరరావు మాట్లాడుతూ శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డిని తక్షణం అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ఎంపీ లగడపాటి రాజగోపాల్ మరో అడుగు ముందుకేసి 23-5-2012న  ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో శ్రీ జగన్మోహన్ రెడ్డి అతి త్వరలో అరెస్టు కాబోతున్నారని జోస్యం చెప్పారు.  కాంగ్రెస్, టీడీపీల వ్యాఖ్యలు తప్పని రుజువుచేసే ధైర్యాన్ని సీబీఐ చేయలేకపోయింది. ఎఫ్ఐఆర్ దాఖలు చేసిన 250 రోజుల తర్వాత శ్రీ జగన్మోహన్ రెడ్డిని అరెస్టు చేయాలని గుర్తించిన సీబీఐ తమ ముందు హాజరుకావాలని ఆయనకు సమన్లు పంపి, ప్రచార పర్వం మధ్యలోనే అనైతికంగా 27-05-12న అరెస్టు చేసింది. ఎన్నికలు పూర్తయ్యే వరకూ అరెస్టు చేయవద్దని ఆయన చేసిన విజ్ఞప్తిని సీబీఐ పెడచెవిన పెట్టింది. ఈ నేపథ్యంలో ది హిందూ పత్రిక  29-05-12న రాసిన సంపాదకీయంలో 'శ్రీ జగన్మోహన్ రెడ్డిని కాంగ్రెస్ ఎదుర్కోవాలంటే రాజకీయంగా చేయాలి తప్ప దర్యాప్తు సంస్థలను దుర్వినియోగం చేయరాద'ని  వ్యాఖ్యానించింది.

మరో పక్క.. టీడీపీ అనుకూల మీడియా సీబీఐ ఏం చేయాలో క్రమం తప్పకుండా ఎప్పటికప్పుడు తెలియజెబుతూ ఉండేది. అవే అక్షర సత్యంగా సీబీఐ వ్యవరించేది. సీబీఐ జేడీ లక్ష్మినారాయణ ముందుగానే దర్యాప్తు సమాచారాన్ని ఆ మీడియాకు అందించడం.. వాటినవి తామే సొంతంగా కనుగొని రాసిట్లు ప్రచురించడం జరిగిపోయేవి. ఇది వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులను తికమకపెట్టేవి. శ్రీ జగన్మోహన్ రెడ్డి బెయిలు పిటిషను విచారణకు వచ్చిన ప్రతి సందర్భంలోనూ ఈ మీడియా న్యాయ వ్యవస్థను ప్రభావితం చేసేలా అసంబద్ధమైన కథనాలు ప్రచురిస్తున్నాయి. అక్టోబరు 4, 2012న టీడీపీ బృందం కేంద్ర ఆర్థిక మంత్రి చిదంబరాన్ని కలుసుకుని శ్రీ జగన్ ఆస్తులను ఈడీ అటాచ్ చేసేలా చూడాలని విజ్ఞప్తి చేయడం.. ఆ వార్త పత్రికలలో ప్రచురితమయ్యేవి. దేశ సర్వోన్నత న్యాయస్థానం ముందుకు శ్రీ జగన్ బెయిలు పిటిషన్ విచారణకు వచ్చే ముందురోజే ఈడీ ఆయనకు సంబంధించిన 51 కోట్ల రూపాయల విలువైన ఆస్తులను అటాచ్ చేసిందని ఆయా మీడియాలో మొదటి పేజీలో ప్రచురించడం జరిగిందన్నారు.

ఇటీవలి కాలంలో అంటే జూన్ 6, 2013న శ్రీ జగన్మోహన్ రెడ్డి, విజయసాయిరెడ్డిలను వేర్వేరు జైళ్ళలో ఉంచాలని టీడీపీ డిమాండ్ చేసిందన్నారు. ఈ డిమాండ్ వినిపించడమే తరువాయిగా సీబీఐ ఇదే అంశంపై జూన్ 9న సీబీఐ కోర్టులో మెమో దాఖలు చేసింది. ఇద్దరూ ఒకే జైలులో ఉంటే సాక్షులను ప్రభావితం చేస్తారనేది సీబీఐ కారణంగా చూపింది.

ఆర్అండ్‌బీ మంత్రిగా ఉన్న ధర్మాన ప్రసాదరావు తన పేరు ఎఫ్ఐఆర్‌లో నమోదు చేశారని తెలియగానే మంత్రి పదవికి రాజీనామా చేశారు. కానీ ముఖ్యమంత్రి దానిని ఆమోదించకపోవడమే కాక విధులకు హాజరు కావాలని ఆయనపై ఒత్తిడి కూడా తెచ్చారు. కానీ చంద్రబాబు ఒత్తిడికి తలొగ్గి రాజీనామా చేయాల్సిందిగా ఇదే ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ధర్మానను ఆదేశించారు. ఇది ప్రజాస్వామ్యమేనా?
అధిక సంఖ్యలో దేశ భక్తులను 18నెలల పాటు జైళ్ళలో పెట్టిన ఎమర్జెన్సీ కాలాన్ని ఇది గుర్తుకు తెస్తోంది. అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన తీర్పు మేరకు పదవి నుంచి దిగిపోవాలని అప్పటి ప్రధాని ఇందిరా గాంధీని ప్రశ్నించడమే వారు చేసిన తప్పు.

కాంగ్రెస్ అధిష్టానం, టీడీపీల సూచన మేరకు మొండివైఖరితో వ్యవహరిస్తున్న సీబీఐ సుప్రీం కోర్టులో శ్రీ జగన్మోహన్ రెడ్డి బెయిలు పిటిషనను వ్యతిరేకించడం దారుణం. సుప్రీం కోర్టునుకూడా తప్పుదోవ పట్టించి శ్రీ జగన్మోహన్ రెడ్డిని సాధ్యమైనంత ఎక్కువ కాలం జైలులో ఉంచడమే దాని ఉద్దేశంలా కనిపిస్తోంది. దేశాన్నీ, సుప్రీం కోర్టును తప్పుదోవ పట్టించేలా శ్రీ జగన్మోహన్ రెడ్డి 43వేల కోట్ల రూపాయల కుంభకోణానికి పాల్పడ్డారని ఆరోపించిందనీ, ఈ మొత్తాన్ని ఎలా లెక్కించారో అంతుచిక్కదు.

తమ ఓట్ల బ్యాంకులను కొల్లగొడుతున్న వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో నష్టపోయిన కాంగ్రెస్, టీడీపీలు మీడియా మద్దతుతో శ్రీ జగన్మోహన్ రెడ్డి లక్ష కోట్ల రూపాయల అవినీతికి పాల్పడ్డారని ప్రచారం చేస్తున్నాయి. ఈ ప్రచారంతో ఓటర్లను, సానుభూతిపరులను వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దూరం చేయవచ్చనేది వాటి ఆశ. వీరు చేస్తున్న ప్రకటనలకు విశ్వసనీయత లేదు. దేశంలోనే ఈ రకమైన అవాస్తవ ప్రచారాన్ని ఆపేవారే లేరా?

సీబీఐ చెబుతున్న దాని ప్రకారం ఇప్పటి వరకూ 70 శాతం దర్యాప్తు పూర్తయ్యింది. ఇంతవరకూ 5 చార్జి షీట్లను దాఖలు చేశారు. చార్జిషీట్లలో వారు చెప్పిన ప్రకారం 1030 కోట్ల రూపాయల లావాదేవీలపై విచారణ పూర్తయ్యింది. అలాంటప్పుడు మిగిలిన ముప్పై శాతం విచారణలో లావాదేవీల విలువ సీబీఐ చెప్పిన ప్రకారం 43000కోట్లుంటుందా?   టీడీపీ చేస్తున్న నిర్లక్ష్య పూరిత ప్రచారంపైనే సీబీఐ ఆధారపడుతోంది తప్ప తన విచారణపై కాదనేది దీన్ని బట్టి వెల్లడవుతోంది. ఇదెంత దురదృష్టకరం. 1030 కోట్ల లావాదేవీలపై దర్యాప్తు పూర్తయిందన్నది తప్పుదారి పట్టించేలా ఉంది. నిమ్మగడ్డ ప్రసాద్ లాంటి కార్పొరేట్ వ్యాపారులు పన్ను కట్టి చూపిన మొత్తాన్ని కూడా లంచాలుగా చూపించడం ఆశ్చర్యకరంగా ఉంది. షేర్లు పెట్టుబడిదారుల పేరుమీద, ప్రిమియంలు కంపెనీల పేరుమీద ఉంటాయనే కనీసం పరిజ్ఞానం కూడా దర్యాప్తు సంస్థకు కొరవడింది. పై మొత్తంలో రెండు లావాదేవీలు ఇమిడి ఉన్నాయి. నిమ్మగడ్డ ప్రసాద్ భారతి సిమెంట్సులో 250 కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టారు.. అదే సమయంలో  ఈ షేర్లను ఫ్రెంచ్ సిమెంటు కంపెనీలో 550 కోట్ల పన్ను కట్టిన అనంతరం రుణాత్మక పెట్టుబడి పెట్టారు. జగతి పబ్లికేషన్సులో ఆయన 350 కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టారు. ఈ మొత్తం 850 కోట్ల రూపాయలను సీబీఐ లంచంగా చూపిస్తుండడం దారుణాతిదారుణం.

ఒక ఎఫ్ఐఆర్‌కు ఒక చార్జి షీటు వేయాలన్న నిబంధనను సీబీఐ తుంగలో తొక్కింది. దీనిని ప్రశ్నించే వారు లేరు. ఈ కారణంగా ఈ నిబంధన ఉండి ఉపయోగం ఏమిటి? శ్రీ జగన్మోహన్ రెడ్డికి ఒక్కసారి కూడా సమన్లు పంపకుండా సీబీఐ కోర్టులో మూడు చార్జి షీట్లను దాఖలు చేసింది. పట్టపగలు హత్య చేసిన వ్యక్తికి కూడా అలా తానెందుకు చేయాల్సి వచ్చిందో చార్జి షీటు వేసేముందు చెప్పుకునే అవకాశమిస్తారు. దర్యాప్తు పూర్తయిన తర్వాతనే 173 సీఆర్‌పీసీ ప్రకారం చార్జిషీటు వేయాలి. అలాకాకుండా చేయడం ఎంతవరకూ సబబు? సెక్షన్ 167సిఆర్ పీసీని తోసి రాజనడం దారుణం. రాజ్యాంగంలోని 21 అధికరణాన్ని ఇది సూచిస్తుంది. అరెస్టు చేసిన వ్యక్తిపై 90 రోజుల్లో దర్యాప్తు పూర్తిచేసి బెయిలు ఇవ్వాలని ఇది తెలుపుతోంది. శ్రీ జగన్మోహన్ రెడ్డిని అరెస్టు చేసి ఏడాది దాటింది. సీబీఐ చెప్పిన ప్రకారం దర్యాప్తునకు మరో నాలుగు నెలల సమయం పడుతుందని తెలుస్తోంది. మరి సెక్షన్ 167 సీఆర్ పీసీకి విలువుందా?

శ్రీ జగన్మోహన్ రెడ్డితో సంబంధం ఉన్న దాదాపు 2000మంది ఫోన్లు సీబీఐ నిఘాలో ఉన్నాయి. ఒకప్పుడు ఆయన వద్ద పనిచేసిన వారి ఫోన్లను కూడా సీబీఐ విడిచిపెట్టడం లేదు. కొందరిని బెదిరించి అంగీకార పత్రాలను రాయించుకుంటోంది. సెక్షన్ 164 ప్రకారం వ్యక్తుల్ని అరెస్టు చేసి శ్రీ జగన్ కుటుంబానికి సన్నిహితులను భయభ్రాంతులను చేస్తోంది.
శ్రీ జగన్మోహన్ రెడ్డి వెల్లడించిన ఆదాయానికి అదనంగా సీబీఐ ఒక్క పైసాను చూపలేకపోయింది. చట్టం ముందు అందరూ సమానులు కాదన్న అంశం శ్రీ జగన్ విషయంలో నూటికి నూరు శాతం నిజం కాదన్న విషయం రుజువైంది. ఈ అంశంలో మీరు జోక్యం చేసుకుని న్యాయం చేయాలని విన్నవిస్తున్నాము.
కృతజ్ఞతలతో
వైయస్ఆర్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు

తాజా వీడియోలు

Back to Top