రైతుల ఆందోళనను అర్థం చేసుకోండి

హైదరాబాద్, నవంబర్ 8: ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని నిర్మాణం జరక్కుండా ఎవరో అడ్డుపడుతున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడటం అర్దరహితంగా ఉందని వైఎస్సార్ సీపి రాజకీయ వ్యవహరాల కమిటీ సభ్యుడు అంబటి రాంబాబు ధ్వజమెత్తారు.

ఆయన శనివారం పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. చంద్రబాబు ఈ మాటలనడానికి ముందు రాజధాని కోసం ఎంపిక చేసిన తుళ్లూరు పరిసరాల్లోని 17 గ్రామాల రైతులు తమ భూములను ఇవ్వడానికి ఎందుకు వ్యతిరేకిస్తున్నారో, వారికున్న భయాందోళనలు ఏమిటో తెలుసుకోవాలని డిమాండ్ చేశారు. రాజధాని వస్తే తుళ్లూరు రైతులకు బాగా మేలు జరుగుతుందని, మట్టి పిసుక్కునే వారు బంగారు తొడుగులు వేసుకుంటారని చంద్రబాబు చెబుతున్నారు. మరి అదే నిజమైతే అక్కడి గ్రామాల రైతులు తమ భూములను రాజధాని నిర్మాణం కోసం ఇవ్వడానికి ఎందుకు ప్రతిఘటిస్తున్నారు. ఈ విషయం చంద్రబాబు, ఆయన తాబేదారులు ముందుగా కనుక్కోవాలి అని అన్నారు.

అందుకే రైతులు వ్యతిరేకిస్తున్నారు...

రాజధాని నిర్మాణాన్ని ప్రతిపాదించిన ఈ 17 గ్రామాలకు అన్ని వైపులా కూత వేటు దూరంలో టీడీపీ నేతలు సుజనా చౌదరి, గల్లా జయదేవ్, మంత్రులు దేవినేని ఉమామహేశ్వరరావు, ప్రత్తిపాటి పుల్లారావు, ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ, యరపతినేని శ్రీనివాసరావు వందలాది ఎకరాల భూములు కొన్నారు. ఈ కొనుగోళ్లన్నీ చంద్రబాబు రాష్ర్ట ముఖ్యమంత్రి అయ్యాకే అక్కడ రాజధాని వస్తుందని ముందుగానే తెలుసుకుని వారు భారీగా భూములను కొనుగోలు చేశారని ఆయా గ్రామాల రైతులు చెప్పుకుంటున్నారు.

తమ పొలాల్లో రాజధాని నిర్మిస్తే పరిసర గ్రామాల్లో ఉన్న ఈ టీడీపీ నేతల భూములను బ్రహ్మాండంగా  డిమాండ్ పెరిగి వారికి బంగారం పంట పండుతుందని రైతులు భావిస్తున్నారు. ఇవేవో నేను చేస్తున్న ఆరోపణలు కానే కేదు. అక్కడ రైతులు చెప్పుకుంటున్నా మాటలే. దీంతో పాటు రైతు ద్రోహి అయిన చంద్రబాబు నాయుడు రుణమాఫీ హమీ తప్పినట్లే.. ల్యాండ్ పూలింగ్ లోనూ తమకు భూమి ఇవ్వడేమోనని భయపడుతున్నారు అని అంబటి రాంబాబు చెప్పారు.

విచారణ చేస్తే గుట్టు బయటపడుతుంది...

అసలు అక్కడ టీడీపీ అగ్రనేతలంతా భూములు కొన్నారో లేదో తెలుసుకోవాలంటే చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన తరువాత ఆ ప్రాంతంలో జరిగిన భూమి లావాదేవీలు, అమ్మకాలపై సీబీఐ విచారణకు ఆదేశించాలని అంబటి డిమాండ్ చేశారు. నిరుపయోగమైన భూమి, అటవీ భూమి పుష్కలంగా ఉన్నచోట రాజదాని పెట్టాలని వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు శ్రీ జగన్ మోహన్ రెడ్డి సూచించిన మాట నిజమేనని, అంత మాత్రాన విజయవాడలో వద్దని ఏనాడూ చెప్పలేదని అంబటి గుర్తు చేశారు. నూతన రాజధాని నిర్మాణానికి తమ పార్టీ చిత్తశుద్దితో పూర్తిగా మద్దతు నిస్తుందని, అదే సమయంలో రైతుల హక్కులను కాలరాసే ప్రయత్నాలను ప్రతిఘటిస్తూ వారికి అండగా నిలబుతుందని ఆయన అన్నారు.

Back to Top