ప‌ట్టువీడ‌ని వైయ‌స్ఆర్‌సీపీ- ప్ర‌త్యేక హోదా కోసం పార్ల‌మెంట్ వేదిక‌గా పోరాటం
- కేంద్రంపై వైయ‌స్ఆర్‌సీపీ అవిశ్వాస తీర్మానం
- ఆరు రోజులుగా చ‌ర్చ‌కు అనుమంతించ‌ని స్పీక‌ర్‌
- కొన‌సాగుతున్న ఎంపీల ఆందోళ‌న‌
ఢిల్లీ:  ప్ర‌త్యేక హోదా ఆంధ్రుల హ‌క్కు అంటూ మొద‌టి నుంచి ఉద్య‌మిస్తున్న వైయ‌స్ఆర్‌సీపీ అధ్య‌క్షులు వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి త‌న పోరాటాన్ని ఉధృతం చేశారు. హోదా ఇచ్చి తీరాల్సిందే అని ఇప్ప‌టి వ‌ర‌కు గ‌ల్లీ నుంచి ఢిల్లీ దాకా పోరాటం చేశారు. తాజాగా పార్ల‌మెంట్ స‌మావేశాల్లో హోదా కోసం పార్టీ ఎంపీల‌తో ఉద్య‌మాన్ని తీవ్ర‌త‌రం చేశారు. ఈ నెల 16వ తేదీ నుంచి కేంద్రంపై అవిశ్వాస తీర్మానం నోటీసులు ఇస్తూనే ఉన్నారు. అయితే స‌భ‌లో అవిశ్వాస తీర్మానంపై చ‌ర్చ‌కు అనుమ‌తించ‌కుండా వాయిదాలు వేస్తూ త‌ప్పించుకుంటున్నారు. 
పార్లమెంట్‌లో అవిశ్వాసం ప్రస్తావనకు రాగానే వెల్‌లో ఉన్న ఏఐఏడీఎంకే, టీఆర్‌ఎస్‌ ఎంపీలు ఆందోళనను రెట్టింపు చేయడంతో వరుసగా శుక్ర‌వారం ఆరో రోజు కూడా తీర్మానాలు ప్రవేశపెట్టకుండానే లోక్‌సభ వాయిదాపడింది. వైయ‌స్ఆర్‌సీపీ ఇచ్చిన అవిశ్వాస తీర్మానాలను సభ సజావుగా లేదన్న కారణంగా స్పీకర్‌ సుమిత్రా మహాజన్‌ అనుమతించలేదు.  

ఆరు రోజులుగా నోటీసులు
ప్ర‌త్యేక హోదాపై చ‌ర్చ జ‌ర‌పాల‌ని వైయ‌స్ఆర్‌సీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి కేంద్రంపై ఇప్ప‌టికే ఆరుసార్లు అవిశ్వాస తీర్మానం నోటీసులు అంద‌జేశారు. పార్ల‌మెంట్ స‌మావేశాల ప్రారంభం నుంచి పార్టీ ఎంపీలు పార్ల‌మెంట్ ఆవ‌ర‌ణ‌, ప్ర‌ధాన ద్వారం  వ‌ద్ద ప్ర‌తి రోజు ధ‌ర్నా నిర్వ‌హిస్తున్నారు. అవిశ్వాస తీర్మానానికి ఇత‌ర పార్టీల మ‌ద్ద‌తు కూడ‌గ‌ట్టారు. స‌భ‌లో అవిశ్వాసం నోటీసు ప్రస్తావన రాగానే విపక్ష సభ్యులంతా మద్దతుగా నిలుచున్నారు.  అయితే  సభ సజావుగా లేనందున అవిశ్వాస తీర్మానాలు ప్రవేశపెట్టేందుకు అనుమతిని తోసిపుచ్చుతున్నట్లు పేర్కొంటూ స్పీకర్‌ లోక్‌సభను వాయిదా వేస్తున్నారు.  అటు రాజ్యసభలో ప్రత్యేక హోదాపై చర్చకు అవకాశం ఇవ్వాలని రాజ్యసభ చైర్మన్‌ను కోరుతూ ఎంపీ వి.విజయసాయిరెడ్డి తన స్థానంలో నిలుచుని అభ్యర్థించారు. అయితే వెల్‌లో వివిధ పక్షాల ఆందోళనతో కొద్ది క్షణాల్లోనే సభను రాజ్యసభ ఛైర్మన్‌ ఎం.వెంకయ్యనాయుడు కూడా స‌భ‌ను వాయిదా వేశారు. హోదాపై చ‌ర్చించే వ‌ర‌కు ప‌ట్టు వీడేది లేద‌ని వైయ‌స్ఆర్‌సీపీ ఎంపీలు స్ప‌ష్టం చేస్తున్నారు. 

టీడీపీ గుట్టు ర‌ట్టు
ఐదు కోట్ల ఆంధ్రులను మరోసారి మోసం చేయాలనుకున్న టీడీపీ డ్రామా మ‌రోమారు గుట్టురట్టైంది. పైపైకి ప్రత్యేక హోదా పోరాటం చేస్తున్నట్లు నటిస్తోన్న పచ్చ నేతలు.. లోలోన మాత్రం ప్యాకేజీ కోసం ఆరాటపడుతూ, ఆ మేరకు కేంద్ర మంత్రుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తోన్నవైనం తేటతెల్లమైంది. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుకు ఢిల్లీలో అన్నీ తానై వ్యవహరించే సుజనా చౌదరి.. బీజేపీ కీలక నేత, ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీతో రహస్యంగా భేటీ అయ్యారన్న సమాచారం టీడీపీలో కలవరం రేపుతోంది. శుక్రవారం ఉదయం చంద్రబాబు నాయుడు నిర్వహించిన టెలీకాన్ఫరెన్స్‌లో ‘రహస్య భేటీ’  అంశం చర్చకు వచ్చినట్లు తెలిసింది.
Back to Top