14వ ఆర్థిక సంఘాలు బూచిగా చూపిస్తారా

ఒంగోలు: 14వ ఆర్థిక సంఘాలు చంద్రబాబు బూచిగా చూపి ప్రత్యేక హోదాను కేంద్రానికి తాకట్టుపెట్టారని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి అన్నారు. ఒంగోలు కలెక్టరేట్‌ వద్ద జరిగిన ధర్నాలో ఎంపీ వైవీ సుబ్బారెడ్డి, జిల్లా అధ్యక్షుడు బాలినేని శ్రీనివాస్‌రెడ్డి, ఎమ్మెల్యే జంకె వెంకట్‌రెడ్డిలతో పాటు పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వైవీ మాట్లాడుతూ..  ప్రత్యేక హోదా ఇవ్వొద్దని 14వ ఆర్థిక సంఘం చెప్పలేదని, తాను రాసిన లేఖకు ఆర్థిక సంఘం చైర్మన్‌ సమాధానం ఇచ్చారని గుర్తు చేశారు. హోదాతో ఆర్థిక సంఘానికి సంబంధం లేదని, అది కేంద్రం నిర్ణయంపై ఆధారపడి ఉంటుందని చెప్పారన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా వచ్చే అవకాశం లేదని చంద్రబాబు చెబుతున్నారని, కానీ ఇప్పటికే ఉన్న రాష్ట్రాలకు కేంద్రం హోదాను పొడిగించిందని ఎంపీ వైవీ సుబ్బారెడ్డి అన్నారు. కేసుల భయంతోనే చంద్రబాబు హోదాను తాకట్టుపెట్టారని మండిపడ్డారు. నాలుగేళ్లుగా విభజన హామీల సాధన కోసం వైయస్‌ఆర్‌ సీపీ పోరాటం చేస్తుందన్నారు. పార్లమెంట్‌ వేదికగా ఆందోళన చేస్తామని, ఈ నెల 21న కేంద్రంపై అవిశ్వాసం పెడతామని వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. అప్పటికీ కేంద్రం  దిగిరాకుంటే ఏప్రిల్‌ 6న వైయస్‌ఆర్‌ సీపీ ఎంపీల మంతా రాజీనామా చేస్తామని ఆయన అన్నారు. 

తాజా ఫోటోలు

Back to Top