ఏ రాజకీయ పార్టీతోనైనా కలిసి పోరాడేందుకు సిద్ధం

ఆంధ్రరాష్ట్ర ప్రయోజనాలే వైయస్‌ఆర్‌ సీపీ లక్ష్యం 
చంద్రబాబు రాజకీయ, సామాజిక, ఆర్థిక నేరగాడు
బాబు ఊసరవెల్లి తనం ప్రజలందరికీ అర్థమైంది
అబద్ధాలు, ప్రజలను మభ్యపెట్టడంలో బాబు దిట్ట
నిజాయితీగా గల ప్రజాప్రతినిధి ఎవరినైనా కలవొచ్చు
తెలియకపోతే ప్రొటోకాల్‌ బుక్‌ చూసుకో చంద్రబాబూ..
వైయస్‌ జగన్‌ రాసిన లేఖతో అన్ని పార్టీలను కలిసి మద్దతు కూడగట్టాం
హైదరాబాద్‌: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రయోజనాలను కాపాడడం కోసం ఏ రాజకీయ పార్టీతోనైనా కలిసి పోరాడేందుకు వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ సిద్ధంగా ఉందని పార్టీ రాజ్యసభ సభ్యుడు వేణుంబాక విజయసాయిరెడ్డి అన్నారు. ఆంధ్రరాష్ట్ర ప్రజల హక్కుల కోసం గత నాలుగేళ్లుగా ఉద్యమం చేస్తుందని, పోరాటంలో భాగంగా కేంద్రంపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టిందన్నారు. హైదరాబాద్‌ లోటస్‌పాండ్‌లోని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కేంద్ర కార్యాలయంలో ఎంపీ విజయసాయిరెడ్డి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అవిశ్వాసం ప్రవేశపెట్టిన తరువాత వైయస్‌ఆర్‌ సీపీ అధ్యక్షుడు వైయస్‌ జగన్‌ అన్ని రాజకీయ పార్టీలకు లేఖ రాయడం జరిగిందన్నారు. ఆ లేఖను ఎంపీలు వైవీ సుబ్బారెడ్డి, మేకపాటి మిగతా సభ్యులతో కలిసి వివిధ పార్టీల ఎంపీలకు ఇచ్చి తీర్మానం బలపర్చాలని కోరడం జరిగిందన్నారు. 
ఊసరవెల్లిలా ఒక్క నిమిషంలో రంగు మార్చిన బాబు
చంద్రబాబు ఆర్థిక, సామాజిక, రాజకీయ నేరగాడని ఎంపీ విజయసాయిరెడ్డి అన్నారు. ఈ రోజు ఉదయం 9:30 గంటల వరకు ఎన్డీయేలో భాగస్వామిగా ఉన్న చంద్రబాబు 9:31కి ఎన్డీయే నుంచి బయటకు వచ్చి ఒక్క నిమిషంలో తన స్టాండ్‌ను మార్చుకున్నాడని, అంటే ఎంత ఊసరవెల్లి తనమో ప్రజలు అర్థం చేసుకోవాలన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు సరిగా నిర్వర్తించాలంటే రాజకీయాలను పక్కనబెట్టి కలిసి పోరాడాలన్నారు. వైయస్‌ఆర్‌ సీపీ తీర్మానం బలపర్చమనేది చంద్రబాబు నిజాయితీలేమికి అద్దం పడుతుందన్నారు.
కానీ చంద్రబాబుకు ఆ క్రెడిబులిటీ లేదు..
అబద్ధాలు చెప్పడం. అనైతిక రాజకీయాలు చేయడం. ప్రజలను మభ్యపెట్టడం చంద్రబాబు సహజశైలి అని ఎంపీ విజయసాయిరెడ్డి విమర్శించారు. వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చిత్తశుద్ధితో పనిచేస్తారని, ఆడిన ఆట తప్పరు అనే అభిప్రాయం ప్రజల్లో ఉందన్నారు. కానీ చంద్రబాబుకు ఆ క్రెడిబులిటీ లేదన్నారు. గత నాలుగేళ్లుగా అన్ని రంగాల్లో ముఖ్యమంత్రిగా వైఫల్యం చెందాడు కాబట్టే  ప్రధాని, కేంద్ర మంత్రులు చంద్రబాబుకు అపాయింట్‌మెంట్‌ ఇవ్వడం లేదన్నారు. నిజాయితీ గల ప్రజా ప్రతినిధిగా ప్రధాని, రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, మంత్రులను ప్రొటోకాల్‌ నిబంధనల ప్రకారం ఏరోజైనా కలవొచ్చని, చంద్రబాబుకు తెలియకపోతే ప్రొటోకాల్‌ బుక్‌ చూసుకోవాలని సూచించారు. 
వైయస్‌ జగన్‌ ముఖ్యమంత్రిగా ఉంటే బాబు అసెంబ్లీకి వస్తాడా..?
రాష్ట్ర ప్రయోజనాల కోసం ప్రధానితో చర్చించాల్సి వస్తే వేరే పార్టీ అని ప్రధానిని కలవను అనే అవకాశం ఉందా అని చంద్రబాబును ప్రశ్నించారు. రాబోయే ఎన్నికల్లో వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వస్తుందని, ఒక వేళ చంద్రబాబు దురదృష్టవశాత్తు కుప్పం నుంచి ఎన్నికై ప్రతిపక్షంలో కూర్చుంటే వైయస్‌ జగన్‌ ముఖ్యమంత్రిగా ఉన్నారని అసెంబ్లీకి హాజరుకానని చెబుతారా అని నిలదీశారు. ప్రజలు అప్పగించిన ఏ బాధ్యతనైనా సక్రమంగా నెరవేర్చాలని సూచించారు. చంద్రబాబు సంతలో పశువులను కొన్నట్లుగా 22 మంది ఎమ్మెల్యేలను రూ. 20 నుంచి 30 కోట్లు పెట్టి కొన్నాడన్నారు. రాజ్యాంగ విలువలు పాటించకుండా అందులో నలుగురిని మంత్రులుగా చేశారని మండిపడ్డారు. వారిపై అనర్హత వేటు వేస్తేనే అసెంబ్లీకి వస్తామని వైయస్‌ఆర్‌ సీపీ అధినేత వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వానికి సూచించారని, అయినా ప్రభుత్వంలో స్పందన లేదని, అందుకే అసెంబ్లీ సమావేశాలను బహిష్కరించినట్లు చెప్పారు.  
 
Back to Top