చిత్తూరు: నగరి నియోజకవర్గంలో ఎమ్మెల్యే ఆర్కే రోజాపై అధికారపార్టీ దౌర్జన్యకాండ మితిమీరింది. రోజా చేతిలో ఓటమి చెందిన అధికారపార్టీనేత ముద్దుకృష్ణమనాయుడు అధికారులను అడ్డుపెట్టుకుని అభివృద్ధి పనులకు అడుగడుగునా అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. నిత్యం ప్రజలపక్షాన రోజా పోరాడడం జీర్ణించుకోలేని తెలుగు తముళ్లు ఆమెపై దౌర్జన్యం చేయడమే కాక నిస్సిగ్గుగా తప్పుడు కేసులు నమోదు చేస్తూ ఇబ్బందులకు గురిచేసే ప్రయత్నం చేస్తున్నారు. రోజా ఎమ్మెల్యేగా ఎన్నికైన పదినెలల కాలంలో ఆమెపై అధికారపార్టీ నేతలు రెండుసార్లు దాడులకు పాల్పడడమే కాక రెండు ఎస్సీ, ఎస్టీ యాక్ట్ కేసులు పెట్టించారు.<br/>సెప్టంబర్ నెలలో నగిరిలో జరిగిన జాతరలో అమ్మవారికి హారతి ఇచ్చేందుకు వెళ్లిన ఎమ్మెల్యేపై అధికారపార్టీ కార్యకర్తలు స్వయంగా దాడికి దిగి హారతి పళ్లెం విసిరికొట్టి ఆమెను గాయపరచడమే కాకుండా ఎస్సీ యాక్ట్ కేసుపెట్టించారు. తాజాగా శుక్రవారం అర్హులైన వారికి పింఛన్లు ఎందుకు ఇవ్వరంటూ పుత్తూరు ఎంపీడీవో కార్యాలయం వద్ద ధర్నా చేశారు. ఓ ప్రజాప్రతినిధిగా అధికారులను అడిగేందుకు వచ్చిన రోజాను అధికారపార్టీ నేతలు పోలీసుల అండతో అడ్డకోవడమే కాకుండా ఆమెపై మరోమారు ఎస్సీ యాక్టు కేసు పెట్టించారు. ప్రజల పక్షాన పోరాడుతున్న ప్రతిపక్ష పార్టీ మహిళా ప్రజాప్రతినిధిపై అధికార పార్టీ కక్షగట్టి దాడులకు దిగడమే కాకుండా తప్పుడు కేసులు పెట్టడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.<br/>మొన్నటికి మొన్న పూతలపట్టు శాసనసభ్యుడు డాక్టర్ సునీల్‌కుమార్ పై తప్పుడు కేసు పెట్టించారు. గత ఏడాది నవంబర్ మూడవ తేదీన యాదమరి మండలం మోర్దాన్‌పల్లె విద్యుత్ సబ్‌స్టేషన్‌కు వెళ్లిన ఎమ్మెల్యే సునీల్‌కుమార్ గతంలో పని చేసిన వారిని విధుల నుంచి ఎందుకు తొగించారని ప్రశ్నించినందుకు అధికారపార్టీ నేతలు ఎస్సీ యాక్టు కేసు పెట్టించారు. అధికారపార్టీ నేతల ఆగడాలను నియోజకవర్గ ప్రజలేకాక జిల్లా వ్యాప్తంగా ప్రజలు ముక్తకంఠంతో ఖండించారు.<br/>ముఖ్యమంత్రి సొంత జిల్లాలో ప్రజల సంగతి దేవుడెరుగు ఏకంగా శాసనసభ్యులకే ప్రజా సమస్యలపై మాట్లాడే హక్కు, స్వేచ్ఛ లేకుండా పోవడం విమర్శలు వెల్లు వెత్తుతున్నాయి. జిల్లా వ్యాప్తంగా వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు, నేతలు, ప్రజాప్రతినిధులపై అధికారపార్టీ దౌర్జన్యకాండ మితిమీరింది. వందలకొద్ది అక్రమ కేసులు పెట్టించి కార్యకర్తలను భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. జిల్లాలో అధికారపార్టీ ఒత్తిళ్లు భరించలేకున్నామని ఓ పోలీసు అధికారే పేర్కొనడం చూస్తే పరిస్థితికి అద్దం పడుతుంది.