<span style="text-align:justify">అమరావతి: రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలని కోరుతూ వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు స్పీకర్ పోడియాన్ని చుట్టుముట్టి నినాదాలు చేశారు. జీఎస్‌టీ బిల్లు అమలు కోసం ఇవాళ ప్రత్యేకంగా సమావేశమైన అసెంబ్లీలో రైతు సమస్యలపై వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యులు పట్టుపట్టారు. రైతు సమస్యలపై చర్చించాలని స్పీకర్ పోడియం వద్దకు చేరి ఫ్లకార్డులు ప్రదర్శించారు. రైతు వ్యతిరేక ప్రభుత్వమంటూ పెద్ద పెట్టున నినాదాలు చేశారు. గందరగోళం మధ్య అసెంబ్లీలో జీఎస్‌టీ బిల్లుపై అధికార పార్టీ సభ్యులు ప్రసంగించారు. చంద్రబాబు రైతులను నట్టేట ముంచారని, రైతు వ్యతిరేక ప్రభుత్వం నశించాలని విపక్ష సభ్యుల నినాదాలతో సభలో గందరగోళం నెలకొంది. ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేయాలంటూ వైయస్‌ఆర్‌సీపీ సభ్యులు నినాదాలతో సభను హోరెత్తించారు. అయినా స్పీకర్ చర్చకు అనుమతించకుండా ఏకపక్షంగా సభను కొనసాగించారు.</span>